కొత్తపేట నియోజకవర్గంలో అవినీతికి పాల్పడ్డాడు ఒక పోలీస్ అధికారి. రావులపాలెం పోలీస్ స్టేషన్‌పై అవినీతి నిరోధకశాఖ అధికారులు ఆకస్మిక దాడులు చెయ్యగా.. ఏసీబీ వలలో టౌన్ సిఐ ఆంజనేయులు యాభై వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఈ మధ్యకాలంలో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు తమ జీతాలతో పాటు లంచాలకు కూడా బాగా అలవాటు పడుతున్నారు. ఇలా కొందరు చేసే చర్యల వల్ల యావత్ ప్రభుత్వ ఉద్యోగులపైనే కళంకం వచ్చే ప్రమాదం ఉంది. అయితే అన్యాయాన్ని ఎదిరించి న్యాయం చేయాల్సిన బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న పోలీసులే ఇలా ప్రవర్తించడం చాల హేయమైన చర్యగా చూస్తున్నారు ప్రజలు.
కోడి పందేలను నిషేధించాల్సింది పోయి నిర్వహకుని వద్దనే లంచం తీసుకోవడం తీవ్రంగా ఖండించాల్సిన అంశం. గత నెలలో దొరికిన కోడి పందెంల నిందితుడు లక్ష్మణ రాజు వద్ద నుండి రూ.50 వేల లంచం డిమాండ్ చేసినట్లు తెలిసింది. ఏసీబీ అధికారులను సంప్రదించాడు బాధితుడు లక్ష్మణ్ రాజు. దీనిపై స్పందించిన ఏసీబీ అధికారులు ఈరోజు రంగంలోకి దిగారు. పోలీస్ స్టేషన్లో లంచం తీసుకుంటుండగా సీఐ ఆంజనేయులును రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఆపరేషన్లో రాజమండ్రి ఏసీబీ డీఎస్పీ పాల్గొన్నారు. ఇలాంటి సంఘటనలు ఎక్కడైనా చోటు చేసుకుంటే వెంటనే తమకు సమాచారం ఇవ్వండని తెలిపారు. ప్రభుత్వం ఉద్యోగులు లంచాలు డిమాండ్ చేస్తే తమ అధికారిక వెబ్ సైట్లోని టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. బాధితుని వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…