Kakinada GGH: ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు.. ఆనందోత్సవంలో కుటుంబ సభ్యులు
ప్రభుత్వ దవాఖానలో పురుడు పోసుకునేందుకు వచ్చిన ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది. పుట్టిన ముగ్గురు పిల్లలు ఆరోగ్యంగా ఉండటంతో కుటుంబంతా సంతోషంలో మునిగిపోయారు..
కాకినాడ, నవంబర్ 15: పండగ పూట ఆ ఇంట సిరులు కురిశాయి. అయితే అది ధన రూపంలో కాదు.. సంతానం రూపంలో.. అవును! సంతానం కూడా సంపదేనని మన పూర్వికులు ఏనాడో అన్నారు. తాజాగా ఓ మహిళ కాన్పు కోసం ప్రభుత్వ దవాఖానాకు వెళ్తే.. ఏకంగా ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. ఒకేసారి తమ ఇంట సంతాన లక్ష్మి వరాలు కురిపించడంతో ఆ తల్లీదండ్రుల ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. ఈ సంఘటన కాకినాడ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..
కాకినాడ జిల్లాలోని కాకినాడ జీజీహెచ్ లో ఓ మహిళకు ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జన్మించారు. జిల్లాలోని తణుకుకు చెందిన తపస్విని అనే గర్భిణి ప్రసవం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్యుల సూచనల మేరకు నవంబర్ 6న కాకినాడ జీజీహెచ్ చేరారు.
ఈ క్రమంలో నవంబర్ 8వ తేదీన ప్రసవం అవ్వగా ఇద్దరు ఆడ, ఒక మగ శిశువు పుట్టారు. తల్లీ, బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. శిశువులు 1.5 కిలో నుంచి 1.7 కిలో వరకు బరువు ఉన్నారని వెద్యులు అన్నారు. ఈ సందర్భంగా తపస్విని, భర్త తానేటి రాజు, బంధువులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పిల్లలంతా వైద్యుల పర్య వేక్షణలో ఉన్నారు.