
తెల్లవారుతున్న వేళ, బతుకులు తెల్లారిపోయాయి. గమ్యస్థానాన్ని కాసేపట్లో చేరుకుంటామనేలోపే, మృత్యువు అగ్నికీలల రూపంలో కబళించింది. మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రయాణికుల ప్రాణాలు తీసేసింది మరో ట్రావెల్స్ బస్సు. డ్రైవర్ నిర్లక్ష్యానికి 13మంది ప్రాణాలు కోల్పోయారు. నిద్రలో ఉన్నవాళ్లు నిద్రలో ఉన్నట్టే సజీవ దహనమైపోయారు. ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నంలో మరికొందరు బస్సు అద్దాల మధ్య ఇరుక్కుని తగలబడిపోయారు. మార్కాపురం జిల్లా రాయవరం దగ్గర ఈ ఘోర విషాదం జరిగింది.
మార్కాపురం జిల్లా రాయవరం దగ్గర సీటర్ కమ్ స్లీపర్ నాన్ AC బస్సు టిప్పర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధం కావడంతో 13 మంది సజీవదహనమయ్యారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. కొందరు బస్సులోనే సజీవదహనమైపోగా.. మరికొందరు ప్రాణాలు కాపాడుకునే క్రమంలో బస్సు అద్దాల మధ్య ఇరుక్కుని మంటల్లో కాలిపోయారు. ప్రమాద సమయంలో బస్సులో 41 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం 26మందిని మార్కాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీళ్లలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది.
హరికృష్ణ ట్రావెల్స్ బస్సు.. జగిత్యాల నుంచి నెల్లూరు జిల్లా కలిగిరి వెళ్లుండగా ఈ ప్రమాదం జరిగింది. పలకల క్వారీ దగ్గర ఎదురుగా వస్తోన్న టిప్పర్‌ను ఢీకొట్టింది ట్రావెల్స్ బస్సు. బస్సు ఢీకొట్టడంతో టిప్పర్ డీజిల్ ట్యాంక్ నుంచి మంటలు చెలరేగి కొన్ని క్షణాల్లోనే తగలబడిపోయింది. బస్సు అద్దాలు పగలగొట్టి బయటపడేలోపే పొగతో ఉక్కిరిబిక్కిరి చేసింది. బస్సు నుంచి దిగడానికి వీల్లేకుండా అగ్నికీలలు వ్యాపించాయి. ప్రయాణికులంతా నెల్లూరు, మార్కాపురం జిల్లా వాసులుగా గుర్తించారు. బస్సు ప్రమాదంలో గాయపడ్డవారిని మార్కాపురం ఏరియా అస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో 26మందికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్లు చెప్పారు. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వెల్లడించారు.
మార్కాపురం బస్సు ప్రమాద ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనలో పలువురు మంది మృతి, కొందరికి తీవ్ర గాయాలపాలవడంపై సీఎం విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని సీఎం ఆకాంక్షించారు. బస్సు నిర్మల్ నుంచి నెల్లూరు వైపు వెళుతున్న నేపథ్యంలో బస్సు ప్రమాదంలో మృతిచెందిన వారు.. గాయపడిన వారి వివరాలు తెలుసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును ముఖ్యమంత్రి ఆదేశించారు. ఏపీ అధికారులతో మాట్లాడి పూర్తి వివరాలు సేకరించాలని సూచించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం సహాయం అందేలా చూడాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో సీఎస్ రామకృష్ణారావు ఏపీ సీఎస్‌తో మాట్లాడారు.
ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైందని మార్కాపురం CI సుబ్బారావు తెలిపారు. -ఇప్పటివరకు 12మందికి పైగా మరణించారన్నారు. ట్రావెల్స్ బస్సు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డినట్టు CI సుబ్బారావు చెప్పారు. క్షతగాత్రులతో మార్కాపురం GGHలో హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రమాదానికి గురైన బస్సులో ప్రయాణించి, గాయపడిన మనోహర్ విలపిస్తుండటం కలచివేస్తోంది. ఈ ప్రమాదంలో మనోహర్ తల్లి చనిపోవడం మరో విషాదం. మార్కాపురం ఆస్పత్రిలో చికత్స పొందుతున్న బాధితులను ఎమ్మెల్యే పరామర్శించారు. దగ్గరుండి చికత్స అందిస్తున్న తీరును పరిశీలిస్తున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉందని, వాళ్లను ఒంగోలు తరలించే ఆలోచన చేస్తున్నట్టు MLA కందుల నారాయణరెడ్డి చెప్పారు.
మార్కాపురం జిల్లాలో రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సులోని ప్రయాణికులు సజీవదహనం కావడంపై చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదంపై అధికారులతో మాట్లాడారు. ప్రమాదంలో గాయపడినవారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని సీఎంకు అధికారులు వివరించారు. మృతుల సంఖ్యపెరిగే అవకాశం ఉందన్న సమాచారంపై CM ఆందోళన చెందారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులకు సూచించారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
రోడ్డు ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. 13 మంది సజీవ దహనం అయిన తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానన్నారు. ప్రమాదానికి గల కారణాల గురించి జిల్లా అధికార యంత్రాంగం నుంచి వివరాలు తీసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని సూచించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధితులకు అండగా ఉంటానన్నారు. బస్సు ప్రమాదంపై మంత్రి గొట్టిపాటి రవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే, అధికారులతో ఫోన్‌లో గొట్టిపాటి రవి మాట్లాడారు. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్న మంత్రి, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే హోంమంత్రి అనిత, విజయవాడ నుంచి మార్కాపురం బయల్దేరారు. మార్కాపురం కలెక్టర్,ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడిన అనిత, ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని అనిత హామీ ఇచ్చారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..