చిత్తూరు జిల్లాలో ఒక యువకుడు అవయవదానంతో నలుగురికి ప్రాణదానం చేశాడు. పునర్జన్మను ప్రసాదించాడు. పూతలపట్టు మండలానికి చెందిన యువకుడు అవయవాల దానంతో చిరంజీవిగా మిగిలిపోయాడు. వివరాల్లోకి వెళితే.. పూతలపట్టు మండలం సామనత్తం గ్రామానికి చెందిన 23 ఏళ్ల హేమ కుమార్ 4 రోజులు క్రితం రోడ్డు ప్రమాదానికి గురి అయ్యాడు.
సినిమా చూసేందుకు బైక్ పై వెళ్తూ పూతలపట్టు మండలం ఎం బండపల్లి వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. హేమ కుమార్ ప్రయాణిస్తున్న బైక్‌ను కారు ఢీ కొనడంతో తీవ్రంగా గాయపడ్డ హేమ కుమార్‌కు తిరుపతి సిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయ్యింది. ఈ మేరకు స్విమ్స్ వైద్యులు నిర్ధారించడంతో చనిపోయిన తమ బిడ్డ కొంతమందికైనా పునర్ జన్మ ఇవ్వాలని తల్లిదండ్రులు భావించారు.
ఈ మేరకు హేమ కుమార్ అవయవాల దానంకు అంగీకరించిన తల్లిదండ్రులు గొప్ప మనసును చాటుకున్నారు. హేమ కుమార్ ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీ లో పని చేస్తుండగా తల్లిదండ్రులు మణి, భారతి కూలీ పనులు చేస్తూ జీవన సాగిస్తున్నారు. హేమ కుమార్ మృతదేహం నుంచి గుండె, కాలేయం, మూత్ర పిండాలు అవయవాలను సేకరించారు వైద్యులు. మల్టీ ఆర్గాన్ సర్జరీని విజయవంతం చేసిన టీటీడీ అనుబంధ స్విమ్స్ ఆసుపత్రి వైద్యులను అభినందించారు టీటీడీ జేఈఓ సదా భార్గవి.
రోడ్డు ప్రమాదంలో 24 ఏళ్ల వయసు గల హేమకుమార్ బ్రెయిన్ డెడ్ అయ్యిందనీ, కుటుంబ సభ్యుల అనుమతితో అవయవ దానం చేశారన్నారు. అవయవ దానం చేయడానికి ముందుకు వచ్చిన హేమకుమార్ తల్లిదండ్రులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానన్నారు సదా భార్గవి. జీవన్ దాన్ ద్వారా ట్రాన్స్ ప్లాంటేషన్ చేశామని రానున్న రోజుల్లో టీటీడీ ప్రాణదానం కింద కూడా ట్రాన్స్ ప్లాంటేషన్ చేస్తామన్నారు. వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద పేదలైన వారికి ఉచితంగా పద్మావతీ హృదయాలయ ఆసుపత్రిలో గుండె మార్పిడి శస్త్రచికిత్సలు చేస్తున్నామన్నారు. అవయవ దానం ద్వారా నలుగురి ప్రాణాలను కాపాడే అవకాశం ఉందన్న విషయాన్ని ప్రజల్లో అవగాహన తీసుకురావాలని కోరారు టీటీడీ జేఈవో సదా భార్గవి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..