
బేస్తవారిపేట, సెప్టెంబర్ 28: బిర్యానీ అంటే చాలు లొట్టలేసుకుని తినే నాన్‌వెజ్ ప్రియులకు అప్పుడప్పుడు షాక్ ఇస్తున్నారు రెస్టారెంట్ యజమానులు. సరైన శుభ్రత, శుచి లేకుండా వంటలు వండేస్తున్నారు. ఆర్డరిచ్చిన ఫుడ్‌లో పురుగులు, బొద్దింకలతో పాటు బల్లులు, జెర్రులు, ఎలుకలు కూడా వస్తుండటంతో బయట భోజనం చేయాలంటేనే హడలెత్తుతున్నారు మాంసాహార వంటలు తినే కస్టమర్లు మూడు రోజుల క్రితం హైదరాబాద్‌లోని పంజాగుట్టలో ఓ రెస్టారెంట్ నుంచి ఆన్‌లైన్ ఆర్డర్ తెప్పించుకున్న కస్టమర్‌కు బిర్యానీలో బొద్దింక రావడంతో తన ట్టిట్టర్ ఖాతాలో ఫోటోలు పెట్టి జిహెచ్‌ఎంసి అధికారులు ఆ రెస్టారెంట్‌లో తనిఖీలు చేయాలని కోరాడు… ఈ ఉదంతం హైదరాబాద్‌లో కలకలం రేపింది… ఇలాంటి ఘటనలే అక్కడక్కడా చోటు చేసుకుంటున్నాయి.
తాజాగా ప్రకాశం జిల్లా బెస్తవారిపేట పట్టణంలోని సత్య మ్యాక్స్ ఫ్యామిలీ రెస్టారెంట్లో బిర్యానీ తినేందుకు వెళ్లి ఓ కస్టమర్‌కు ఇదే తరహా అనుభవం ఎదురైంది. నాన్‌వెజ్ వంటకాల్లో రారాజైన బిర్యానీ అర్దరిచ్చాడు. మధ్యాహ్నం సమయంలో లేటుగా వెళ్ళాడేమో ఆకలితో ఉన్న ఆ కస్టమర్‌కు బిర్యానీ సర్వ్ చేయగానే ఆబగా తినేస్తున్నాడు. మధ్యలో చికెన్ ముక్కకు బదులు ఏదో పాకుడు జీవి కనిపించింది… దీంతో అవాక్కయిన కస్టమర్ దాన్ని తేరిపారా చూశాడు… అంతే అతని గుండె ఝల్లుమంది… అది చికెన్ ముక్క కాదు… ఒళ్ళంతా కాళ్ళతో పాకులాడే విషపు కీటకం జెర్రిగా గుర్తించాడు. వెంటనే వాంతి వచ్చినంత పనైంది… కొద్దిసేపు కంగారుపడ్డ ఆ కస్టమర్ తేరుకుని హోటల్ సిబ్బందికి బిర్యానీలో వచ్చిన జెర్రిని చూపించి ఆగ్రహం వ్యక్తం చేశాడు. బిర్యానీలో ఏం వస్తున్నాయో కూడా చూసుకోకుండా ఎలా వండుతున్నారంటూ మండిపడ్డాడు… బిర్యానీలో వచ్చిన జెర్రి ఫోటోలు తీసి ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపాడు.. ఆ సమయంలో ఆ హోటల్‌లో బిర్యానీ తింటున్న మిగిలిన కస్టమర్లు విషయం తెలుసుకుని నీ బిర్యానీ వద్దూ… పిండాకూడు వద్దు అనుకుంటూ అక్కడినుంచి వెళ్ళిపోయారట.
హైదరాబాద్‌లో ఫేమస్ హోటల్ ఆల్పా హోటల్‌ను ఫుడ్ సేఫ్టీ అధికారులు సెప్టెంబర్ 17న సీజ్ చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను ఆనుకుని ఉండే ఆల్పా హోటల్‌కు నిత్యం వేలాది మంది కస్టమర్స్ వస్తారు. ఇటీవల అక్కడ మటన్ కీమా, రోటీ తిన్నవారు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. తనిఖీలు చేయగా.. హోటల్‌లో శుభ్రత, నాణ్యత పాటించడం లేదని గుర్తించిన అధికారులు వెంటనే హోటల్‌ను సీజ్ చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..