
అది అనకాపల్లి జిల్లాలోని ఓ పామాయిల్ తోట..! అక్కడకు ఎప్పుడో రాని వాహనాలు వస్తూ ఉన్నాయి. ఎవరికి అనుమానం రాకుండా ఒక ముఠాగా ఏర్పడి అక్కడ ఓ డంపును ఏర్పాటు చేసేశారు. అలికిడి లేని సమయంలో వాహనాలు తీసుకొచ్చి సరుకు డంప్ చేస్తున్నారు. అక్కడే ఎందుకు పెట్టారంటే.. ఆ పామాయిల్ తోటలోంచి వెలువడిన వాసన.. తమ ప్లాన్ కు సహకరిస్తుందని, కానీ చేసిన పాపం ఊరికే పోతుందా..? అడ్డంగా బుక్ అయ్యారు వారంతా..!
గంజాయి స్మగ్లింగ్ చేసేందుకు స్మగ్లర్లు అవసరమైన అన్ని అడ్డదారులు తొక్కుతున్నారు. పోలీసుల కళ్ళు కప్పి సరిహద్దులు దాటించేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. కొన్నిసార్లు వాళ్ళ ఐడియాలు ఫలించి అదృష్టం బాగుంటే గంజాయి గమ్య స్థానానికి చేరిపోతుంది. కానీ పోలీసులు ఊరుకుంటారా మరి..! డేగ కళ్ళతో వారిని పట్టుకుని కటకటాల వెనక్కు నెడుతున్నారు.
వివరాల్లోకి వెళితే.. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం కొంతల అడ్డసరం గ్రామాల మధ్య పామాయిల్ తోట ఉంది. అక్కడికి చీకటి పడగానే వాహనాలు వస్తూ ఉన్నాయి. గత కొంతకాలంగా యవ్వారం సాగిపోతుంది. ఓ రోజు శనివారం(మే 31) తెల్లవారుజామున పోలీసులు మెరుపు దాడులు చేశారు. 750 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 9 మంది నిందితులను అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. ఓ కారు, మూడు బైకులను సీజ్ చేశారు.
విషయం ఏంటంటే.. కొంతమంది గుట్టుచప్పుడు కాకుండా గంజాయిని వాహనంలో తీసుకొచ్చి.. కొంతలం – అడ్డసరం గ్రామాల మధ్య ఉన్న ఆయిల్ పామ్ తోటలో నిల్వ చేస్తున్నారనే సమాచారం పోలీసులకు అందింది. దీంతో వెంటనే రోలుగుంట, కొత్తకోట ఎస్సైలు, వారి సిబ్బంది తో పామాయిల్ తోటలో దాడులు చేశారు. అదే సమయంలో గంజాయిని వాహనం నుంచి అన్‌లోడ్ చేస్తున్నారు. హ్యుండాయ్ వెన్యూ వాహనాన్ని గుర్తించి.. ఆ ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టారు. వెంటనే పోలీస్ సిబ్బంది వాహనాన్ని, అక్కడ ఉన్న 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో పోలీసుల రాకను గుర్తించి మరో ఇద్దరు పారిపోయారు.
పట్టుబడిన వారిని పోలీసులు ప్రశ్నించారు. వియ్యపు గోవింద, బంగారు అప్పల నాయుడు అనే ఇద్దరు నిందితులు కలిసి ఒడిశా మల్కన్‌గిరి జిల్లా కలిమెలకు చెందిన పాపులు వెంకటేష్ అనే వ్యక్తి నుండి 750 కిలోల గంజాయిని కొనుగోలు చేశారు. మొదట 600 కిలోల గంజాయిని తీసుకొచ్చి ఆయిల్ పామ్ తోటలో ఓ రహస్య ప్రాంతంలో గంజాయిని నిల్వ చేశారు. ఈ రోజు తెల్లవారుజామున మరో 150 కిలోల గంజాయిని హ్యుండాయ్ వెన్యూ కారులో తీసుకొచ్చి.. అదే ప్రాంతంలో నిల్వ చేయడానికి ప్రయత్నించారు. అక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు మంచి రేటు వస్తే దాన్ని తరలించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో పోలీసులకు సమాచారం అందడంతో వాళ్ల గుట్టు బయటపడింది.
ప్రధాన నిందితులైన గోవింద్, అప్పలనాయుడుకు మరికొంతమంది సహకరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తమరన వెంకట శ్రీనివాస రాజా, కడిమి రాకేష్, బొడ్డు నానాజీ అనే మరో ముగ్గురు నిందితులకు గంజాయి సేకరణ, నిల్వ సమయంలో పైలటింగ్‌లో సహాయం చేశారు. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన మారిగెల లక్ష్మణ్ రెడ్డి, మడుల శివ కుమార్ హ్యుండాయ్ కారును ఏర్పాటు చేసి.. సీలేరు, మరేడిమిల్లి – తుని ద్వారా రోలుగుంటకు గంజాయిని రవాణా చేయడంలో సహాయం చేసినట్లు పోలీసులు గుర్తించారు.
ప్రధాన నిందితుడు వియ్యపు గోవింద గతంలో నాలుగు గంజాయి కేసుల్లో, నల్లబిల్లి అంజి బాబు 2 గంజాయి కేసుల్లో నిందితులుగా ఉన్నారు. తప్పించుకున్న నిందితులతోపాటు ఫార్వర్డ్ బ్యాక్ వర్డ్ లింకుల కోసం ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుందన్నారు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా. అత్యంత చాకచక్యంగా గంజాయి స్మగ్లర్ల గుట్టును బయటపెట్టిన పోలీసులను జిల్లా ఎస్పీ అభినందించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..