Andhra Pradesh: ఈ చెట్టు చరిత్ర తెలిస్తే అవాక్కవ్వాల్సిందే.. మొదలు ఎక్కడో తెలియని మహావృక్షం..

కడపలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం ఒక అద్భుతమైన మహావృక్షానికి నిలయం. సుమారు 600-700 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఊడలమర్రి దాదాపు 50 మీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి భక్తులను ఆకట్టుకుంటుంది. పెన్నా నది ఒడ్డున ఉన్న ఈ ఆలయంలోని ప్రాచీన వటవృక్షం వైశాల్యం ఇంకా పెరిగే అవకాశం ఉందని.. కానీ ఊడలను కట్ చేస్తున్నట్లు పూజారులు తెలుపుతున్నారు.

Andhra Pradesh: ఈ చెట్టు చరిత్ర తెలిస్తే అవాక్కవ్వాల్సిందే.. మొదలు ఎక్కడో తెలియని మహావృక్షం..
Kadapa Ramalingeswara Temple Banyan Tree

Edited By:

Updated on: Nov 24, 2025 | 8:48 PM

పురాతన దేవాలయాలలో పెద్ద పెద్ద వృక్షాలు దర్శనమివ్వడం సర్వసాధారణమే అయితే మనం ఇప్పుడు చెప్పుకోబోయే ఈ మహావృక్షం దాదాపు ఆరు తరాలకు పైగా ఆ దేవాలయంలో భక్తులకు దర్శనమిస్తుందట. దాదాపు 50 మీటర్ల వైశాల్యం కలిగిన ఈ మహావృక్షం ఇప్పుడు అక్కడికి వచ్చే భక్తులందరినీ ఆకర్షిస్తుంది. కడప నగరానికి శివారు ప్రాంతమైన వాటర్ గండి సమీపంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఈ మహావృక్షం ఉంది. పెన్నా నదికి ఒడ్డున ఉన్న ఈ దేవాలయం ఎంతో సుందరంగా ఉంటుంది. ప్రకృతి అందాలను ఆస్వాదించాలంటే ఈ దేవాలయంలోకి వెళితే అనేక వృక్షాలు ఇక్కడ మీకు దర్శనమిస్తాయి.

అందులో ఈ మహా వటవృక్షమైన ఊడలమర్రి అందరినీ ఆకర్షిస్తుంది. ఈ చెట్టుది దాదాపు 600 నుంచి 700 సంవత్సరాల చరిత్ర. రామలింగేశ్వర స్వామి దేవాలయానికి ఎదురుగా ఈ వృక్షం ఉంటుంది. అలాగే మహా వృక్షం నుంచి వేలాడే ఊడలు నేలలోనికి పాతుకుపోయి దాదాపు ఈ ఊడలమర్రి వైశాల్యాన్ని 50 మీటర్ల వరకు పెంచాయంటే ఈ మహావృక్షం ఎంత పెద్దదో ఊహించుకోవచ్చు. ఈ వృక్షాన్ని చూసిన వారంతా ఏ దేవాలయంలో ఇంత పెద్ద ఊడల మర్రి చెట్టును చూడలేదని అంటున్నారు. ఈ చెట్టు ఊడలు నేలలోకి పాతుకుపోయి అసలు ఈ చెట్టుకు మొదలు ఎక్కడ ఉందా అనేదే కనిపించకుండా పోయింది అంటే దీని వైశాల్యం అర్థం చేసుకోవచ్చు.

ఈ వృక్షం ఇంకా పెరగాల్సి ఉందని.. ఊడలను అప్పుడప్పుడు కత్తిరిస్తూ ఉండడం వలన దీని వైశాల్యం ఇంకా పెరగలేదని ఆలయ అర్చకులు అంటున్నారు. లేకపోతే మరింత పెరిగి ఈ ఊడలమర్రి మరింత పెద్దదిగా అయ్యేదని చెబుతున్నారు. ప్రతి ఒక్క భక్తుడు రామలింగేశ్వర స్వామిని పూజించడంతోపాటు ఈ చెట్టు వివరాలు తప్పనిసరిగా తెలుసుకుని వెళతారని అర్చకులు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us