
విజయనగరం, ఆగస్ట్ 7: విజయనగరం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ బాధ్యతలను విస్మరించి మద్యం సేవించడం అలవాటుగా మార్చుకున్న ఓ వ్యక్తిని భార్య మందలించడంతో తీవ్ర మనస్తాపానికి గురై పురుగుల మందు త్రాగి ప్రాణాలు కోల్పోయాడు.
గరివిడి మండలం వెదుళ్లవలస గ్రామానికి చెందిన మన్నేపూరి పైడినాయుడు (60) కొంతకాలంగా ఉపాధి లేకుండా జీవిస్తున్నాడు. తరచూ మద్యం సేవిస్తూ ఇంటి బాధ్యతలను పట్టించుకోవడం లేదని కుటుంబ సభ్యులు కొద్ది రోజులుగా వాపోతున్నారు. దీంతో కుటుంబ పోషణ భార్య పై పడడంతో ఇద్దరి మధ్య తరుచూ వాగ్వాదాలు జరిగేవి. ఇదే విషయం పై భార్య లక్ష్మి భర్తను ఎప్పటిలాగే మందలించింది. కుటుంబం కోసం పనికి వెళ్లాలని, బాధ్యతగా ఉండాలని సూచించి అనంతరం ఆమె పొలం పనులకు వెళ్లింది. అలా భార్య పొలం పనులకు వెళ్లడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో పైడినాయుడు వ్యవసాయ అవసరాల కోసం ఇంట్లో ఉంచిన పురుగుల మందు తాగాడు.
కొంతసేపటి తర్వాత విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను చీపురుపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉండటంతో విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి రిఫర్ చేశారు. వైద్యులు చికిత్స అందించినప్పటికీ పైడినాయుడు మృతి చెందాడు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనతో వెదుళ్లవలస గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. కుటుంబ విభేదాలు, మద్యం వ్యసనం వంటి సమస్యలు కొన్ని సందర్భాల్లో తీవ్ర పరిణామాలకు దారితీసే అవకాశం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.