ఎర్రచందనం, గంజాయి, డ్రగ్స్ వంటి వాటి స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేయడం అధికారులకు, పోలీసులకు సవాల్‌గా మారుతోంది. ఎత్తులకు పైఎత్తులు వేస్తూ.. రోజుకో కొత్త తరహాలో అక్రమార్కులు ఈ దందాలను కొనసాగిస్తున్నారు. స్పెషల్ చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి.. తనిఖీలు చేస్తున్నా… డ్రగ్స్(Drugs), గంజాయి(Cannabis) స్మగ్లర్లు క్రియేటివ్‌గా ఆలోచిస్తూ మత్తును రవాణా చేస్తున్నారు. ఇప్పుడు… అందుగలదు.. ఇందు లేదు అని సందేహం వలదు.. ఎందెందు వెతికినా.. పోలీసులకు గంజాయి కనిపిస్తూనే ఉంది. తాజాగా సోమవారం అరకు లోయ(Araku Valley) ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద 15 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నందు వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా బ్యాగులు తగిలించుకున్న ఆరుగురు ముద్దాయిలు పోలీసులు, రెవెన్యూ సిబ్బందిని చూస్తూ కంగారు పడ్డారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేయగా.. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న కాలేజ్ బ్యాగుల్లో చెక్ చేయగా గంజాయి కనిపించింది. 3 కాలేజ్ బ్యాగుల్లో నుంచి 15 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితుల్లో ముగ్గురు ఏజెన్సీ ప్రాంతానికి చెందిన వారు కాగా ముగ్గురు బయట రాష్ట్రాలకు చెందినవారుగా గుర్తించారు. కేసు నమోదు చేసి.. నిందితులను రిమాండ్‌కు తరలించారు.
ఏపీ సర్కార్.. గంజాయి సాగు, రవాణాపై చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. ఓ వైపు గంజాయి తోటల ధ్వంసం కొనసాగుతుంటే… మరోవైపు గంజాయి రవాణా చేసే ముఠాలు వెనక్కి తగ్గడం లేదు. ఏజెన్సీ నుంచి ప్రతి వాహనాన్ని చెక్ చేస్తున్నారు. గంజాయి రవాణా చేస్తూ పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..