
అనంతపురం, ఆగస్ట్ 17: అనంతపురంలోని కల్యాణదుర్గం నుంచి సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కుర్లపల్లి గ్రామంలో ఈ భారీ ఉమ్మడి కుటుంబం ఉంది. గ్రామంలో సుమారు 400 ఇళ్లు, 2,000 మంది జనాభా ఉండగా.. గ్రామంలోకి వెళ్లగానే కనిపించే పెద్ద ఇళ్లు ఈ కుటుంబానివే. రోడ్డుకు ఇరువైపులా ఉన్న రెండు పెద్ద ఇళ్లతో పాటు మరో ఇల్లు, పెద్ద ఖాళీ ప్రదేశం ఈ కుటుంబ అవసరాలకు ఉపయోగపడుతున్నాయి. 83 మంది సభ్యులకు ఇవి కూడా సరిపోక ప్రస్తుతం మరో ఇంటిని నిర్మించుకుంటున్నారు.
ఇంతమంది ఒకే కుటుంబంలో ఉండటంతో రోజువారీ వంట కూడా పెద్ద వ్యవహారమే. ఈ ఇంట్లో రోజుకు సుమారు 50 కిలోల బియ్యం అవసరమవుతుంది. అల్పాహారంగా రాగి సంగటి తయారు చేయడం ఆనవాయితీ. మధ్యాహ్నం అన్నం, కూర వండుతారు. రాత్రిపూట అవసరాన్ని బట్టి టిఫిన్లు లేదా ప్రత్యేక వంటకాలు చేస్తారు. వారానికి ఒకసారి బజ్జీలు, వడలు, స్వీట్లు చేసుకుంటే పెద్ద మొత్తంలోనే తయారు చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి చపాతీలు లేదా బజ్జీలు చేయాలన్నా సుమారు 15 కిలోల పిండి అవసరమవుతుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆదివారం నాన్‌వెజ్ వండుకోవాలంటే సుమారు ఒక పొట్టేలు లేదా 10 కిలోల చికెన్ అవసరమవుతుంది. పండుగలు, జాతరల సమయంలో రెండు పొట్టేళ్లు, సుమారు 20 కిలోల చికెన్ వండుతారు.
ఈ కుటుంబంలో మరో ప్రత్యేకత ఏమిటంటే.. 83 మందికి వంట మొత్తం ఒకే చోట జరుగుతుంది. ఇప్పటికీ కట్టెల పొయ్యినే ఉపయోగిస్తున్నారు. కారం, పచ్చడి వంటి వాటిని గ్రైండర్‌లో కాకుండా రోకలితోనే తయారు చేస్తారు. కుటుంబ సభ్యుల ప్రకారం.. ఆరు తరాలుగా పాత పద్ధతులను కొనసాగిస్తున్నారు. ఇంట్లో అందరికీ ఒకే రకమైన వంట చేస్తారు. ఆరోగ్య కారణాలతో ప్రత్యేక ఆహారం అవసరమైన వారికి మాత్రం చపాతీలు, కొర్ర అన్నం, రొట్టెలు వంటి వాటిని వేరుగా తయారు చేస్తారు. 83 మంది కుటుంబాన్ని నిర్వహించడం అంత సులభమైన విషయం కాదు. అందుకే ప్రతిరోజూ ఉదయం పెద్దలు సమావేశమై ఆ రోజు ఎవరు ఏ పని చేయాలో నిర్ణయిస్తారు. కుటుంబ పెద్దలు హనుమంతరాయుడు, ముత్యాలప్పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటి సభ్యుల్లో కొందరు వ్యవసాయ పనులకు వెళ్తారు. మరికొందరు ఆవులు, గొర్రెలను చూసుకుంటారు. ఇంకొందరు పాలు పితకడం, పశువుల కొట్టాలను శుభ్రం చేయడం వంటి పనులు చేస్తారు. ఇంటి మహిళల్లో కొందరు వంట బాధ్యతలు చూసుకుంటారు. కుటుంబ సభ్యుడు మహేశ్ వాహనాల నిర్వహణ, ఇంటికి అవసరమైన సరుకులు తీసుకురావడం వంటి పనులు చూసుకుంటారు. మరో సభ్యుడు పంటలను మార్కెట్‌కు తరలించి విక్రయించే బాధ్యత తీసుకుంటారు.
ఒకప్పుడు తీవ్ర పేదరికాన్ని అనుభవించిన ఈ కుటుంబం.. ఉమ్మడిగా కలిసి పనిచేయడం వల్లే ఆర్థికంగా ఎదిగామని చెబుతోంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం ఒకప్పుడు ఒకపూట భోజనం కూడా కష్టంగా ఉండేది. ప్రస్తుతం కుటుంబానికి సుమారు 120 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. మిర్చి, వంకాయ, టమోటా, కర్బూజా, బొప్పాయి, వేరుశనగ వంటి పంటలను సాగు చేస్తున్నారు. పండించిన పంటలను దళారులకు ఇవ్వకుండా తమ సొంత వాహనాల్లో నేరుగా మార్కెట్లకు తరలించి విక్రయిస్తున్నారు. టమోటాలను కోలార్‌కు, వంకాయలను చెన్నైకి, కర్బూజా, బొప్పాయి వంటి పంటలను దూర ప్రాంతాల మార్కెట్లకు పంపిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంటి అవసరాల కోసం సుమారు ఐదు ఎకరాల్లో వరి సాగు చేసి, ధాన్యాన్ని నిల్వ చేసుకుంటారు. మిగిలిన ధాన్యాన్ని మార్కెట్‌లో విక్రయిస్తారు.
వ్యవసాయంతో పాటు కుటుంబానికి చెందిన నాలుగు ట్రావెల్స్ బస్సులు కూడా ఉన్నాయి. ఇవి కల్యాణదుర్గం నుంచి కర్ణాటక ప్రాంతాలకు తిరుగుతుంటాయి. కుటుంబ సభ్యులే వ్యవసాయం, పశుపోషణ, వాహనాల నిర్వహణ, పంటల విక్రయం వంటి పనులను విభజించుకుని చేసుకుంటున్నారు. కుటుంబంలో పెద్దగా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు చేసేవారు లేరు. కొందరు ఇంటర్, డిగ్రీ వరకు చదివి కుటుంబ బాధ్యతల కారణంగా వ్యవసాయ పనుల్లోకి వచ్చారు. కుటుంబంలో ప్రస్తుతం 32 మంది పిల్లలు చదువుకుంటున్నారు. వారిలో కొందరు ఇంటర్మీడియట్, మరికొందరు డిగ్రీ చదువుతున్నారు. చిన్నారుల్లో ఎనిమిది మంది అంగన్‌వాడీకి వెళ్తున్నారు. పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలల్లోనే చదివిస్తున్నామని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఎవరినీ ఎక్కువా, తక్కువా చూడకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తున్నామని అంటున్నారు.
కుటుంబంలో విభేదాలు రాకుండా ఉండేందుకు పెళ్లిళ్ల విషయంలోనూ ప్రత్యేక పద్ధతిని పాటించామని కుటుంబ పెద్ద హనుమంతరాయుడు తెలిపారు. తన కుమారులు, బావమరిది కుమారులు కలిపి మొత్తం తొమ్మిది మంది యువకులకు ఒకే రోజు, ఒకే ముహూర్తంలో ధర్మస్థలలో వివాహాలు జరిపించినట్లు చెప్పారు. ఒక్కరి పెళ్లి మాత్రమే చేస్తే మిగిలిన వారిలో భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉందనే ఉద్దేశంతో అందరికీ ఒకేసారి వివాహాలు జరిపించామని ఆయన వివరించారు. ఇంత పెద్ద కుటుంబంలో ఆరుగురు అత్తలు, 14 మంది కోడళ్లు ఉన్నప్పటికీ ఎలాంటి పెద్ద గొడవలు ఉండవని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఎవరి పనులు వారు చేసుకుంటూ, ఏదైనా చిన్న సమస్య వచ్చినా వెంటనే మాట్లాడుకుని పరిష్కరించుకుంటామని అంటున్నారు. కొంతసేపు వాదించుకున్నా సాయంత్రానికి మళ్లీ అందరూ కలిసి నవ్వుతూ, సరదాగా గడుపుతామని కుటుంబ మహిళలు చెబుతున్నారు. ఈ ఐక్యతే ఇంత పెద్ద కుటుంబాన్ని ఇన్నేళ్లుగా కలిసి ఉంచుతోందని వారు భావిస్తున్నారు.
ఈ కుటుంబ పెద్దల ప్రకారం.. వారి ఉమ్మడి జీవనం ఆరు తరాలుగా కొనసాగుతోంది. గతంలో పేదరికాన్ని ఎదుర్కొన్న కుటుంబం.. అందరూ కలిసి కష్టపడటంతో నేడు ఈ స్థాయికి చేరుకుంది. అందుకే కుటుంబం విడిపోకుండా భవిష్యత్ తరాలు కూడా కలిసి ఉండాలని పెద్దలు కోరుకుంటున్నారు. 83 మంది సభ్యులు, ఒకే వంటగది, ఉమ్మడి వ్యవసాయం, ఉమ్మడి ఆస్తులు, కలిసి పండుగలు, కలిసి పెళ్లిళ్లు.. ఆధునిక కాలంలో ఉమ్మడి కుటుంబాలు క్రమంగా తగ్గిపోతున్న వేళ కుర్లపల్లిలోని ఈ కుటుంబం మాత్రం ఇప్పటికీ ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ప్రత్యేకంగా నిలుస్తోంది.