Andhra: తల్లి కల నెరవేరింది.. కానీ బిడ్డను చూడకుండానే తుది శ్వాస

మార్కాపురం జిల్లా కాకర్లకు చెందిన ఆశ కార్యకర్త గుంటు లీలమ్మ మాతృత్వం కోసం ప్రాణాలనే పణంగా పెట్టింది. ప్రసవం చేస్తే ప్రాణాపాయం ఉంటుందని వైద్యులు హెచ్చరించినప్పటికీ, బిడ్డను కాపాడాలని పట్టుదలతో సిజేరియన్ చేయించుకుంది. మగబిడ్డకు జన్మనిచ్చిన అనంతరం ఆమె కన్నుమూయడంతో కుటుంబంతో పాటు గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

Andhra: తల్లి కల నెరవేరింది.. కానీ బిడ్డను చూడకుండానే తుది శ్వాస
Lelamma Maternal Death

Edited By:

Updated on: Jul 29, 2026 | 12:46 PM

మాతృత్వం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన ఓ మహిళ చివరకు బిడ్డకు జన్మనిచ్చింది. కానీ ఆ ఆనందాన్ని ఆస్వాదించేలోపే ఆమె కన్నుమూసిన విషాద ఘటన మార్కాపురం జిల్లాలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. వైద్యులు ముందుగానే ప్రాణాపాయం గురించి హెచ్చరించినప్పటికీ, తన ప్రాణం కంటే బిడ్డ ప్రాణమే ముఖ్యమని భావించిన ఆమె తీసుకున్న నిర్ణయం చివరికి కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచేసింది.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలం కాకర్ల గ్రామానికి చెందిన గుంటు లీలమ్మ(40) ఆశ కార్యకర్తగా సేవలందిస్తున్నారు. కుటుంబ పరిస్థితుల కారణంగా ఆలస్యంగా వివాహం చేసుకున్న ఆమెకు 2018లో పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత చాలా కాలం పాటు సంతానం కలగకపోవడంతో ఆ దంపతులు ఆవేదన చెందారు. అయితే ఇటీవల ఆమె గర్భం దాల్చడంతో కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది.

గర్భం దాల్చిన కొద్ది రోజులకే వైద్య పరీక్షల్లో లీలమ్మకు గుండె సంబంధిత సమస్య ఉన్నట్లు తేలింది. ఈ పరిస్థితిలో గర్భాన్ని కొనసాగించడం ప్రమాదకరమని వైద్యులు సూచించారు. అనంతరం ప్రత్యేక వైద్యం అందించి గుండెకు స్టంట్ అమర్చడంతో పరిస్థితి కొంత మెరుగుపడినట్లు భావించారు. కానీ గర్భధారణ చివరి దశకు చేరుకునే సరికి ఆమె ఆరోగ్యం మళ్లీ విషమించింది.

అత్యవసర పరిస్థితుల్లో తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమెను చేర్చగా, ప్రసవ సమయంలో తల్లీబిడ్డల్లో ఒక్కరిని మాత్రమే కాపాడే అవకాశం ఉందని వైద్యులు కుటుంబ సభ్యులకు వివరించారు. అయినప్పటికీ తన బిడ్డను సురక్షితంగా ఈ లోకంలోకి తీసుకురావాలని లీలమ్మ పట్టుదలగా నిర్ణయించుకుంది. కుటుంబ సభ్యుల సమ్మతితో వైద్యులు సిజేరియన్ శస్త్రచికిత్స నిర్వహించగా మగబిడ్డ జన్మించాడు.

అయితే ప్రసవం అనంతరం లీలమ్మ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. పుట్టిన బిడ్డను ఒక్కసారి కూడా చూడకుండానే ఆమె కన్నుమూయడం కుటుంబ సభ్యులను కన్నీటి పర్యంతం చేసింది. స్వగ్రామానికి మృతదేహాన్ని తీసుకురాగా గ్రామమంతా విషాదంలో మునిగిపోయింది. ఆశ కార్యకర్తగా ప్రజలకు సేవలందించిన లీలమ్మకు ఆరోగ్యశాఖ అధికారులు, సహచర వైద్య సిబ్బంది నివాళులర్పిస్తూ ఆమె సేవలను స్మరించుకున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Loading...
Unable to load recommendations.
Follow Us