ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవు మత్స్యకారుల వలకు భారీ టేకు చేప చిక్కింది. వారంతా భారీ చేప చిక్కిందని ఆనందంతో.. దాన్ని ఒడ్డుకు తీసుకొచ్చారు. అయితే క్షణాల్లో ఆ ఆనందం కాస్తా ఆవిరైంది. మత్య్యకారులకు ఆ భారీ చేప గట్టి షాక్ ఇచ్చింది. సుమారు 4 వందల కేజీల బరువున్న ఈ చేప కేవలం రెండు వేల రూపాయలు మాత్రమే ధర పలకడంతో మత్య్యకారులకు దిమ్మ తిరిగింది. తొలుత ఈ చేప ఆకారానికి తగిన ధర లభిస్తుందని, తమ పంట పండిందని మత్స్యకారులు అలల మధ్య తేలిపోతూ ఒడ్డుకు చేరుకున్నారు. స్థానిక బయ్యర్లను పలిచి ఎన్ని వేలు ఇస్తారని బేరం పెట్టారు. బయ్యర్లు చెప్పిన సమాధానం విని మత్స్యకారులు కళ్ళు తేలేసినంత పనిచేశారు. వారం రోజుల తరబడి సముద్రంలో చేపల కోసం వేటకు వెళితే 30 వేలు ఖర్చయిందని, కనీసం పెట్టిన పెట్టుబడి డబ్బులు కూడా రాలేదని వాపోతున్నారు. ఇంతకీ అసలు స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..
వివరాల్లోకి వెళ్తే.. చీరాల మండలం వాడరేవుకు చెందిన మత్స్యకారుడు గోవిందు ఎప్పటిలాగే సముద్రంలో చేపల వేటకు వెళ్ళాడు. తన సహచరులతో కలిసి వారం రోజులుగా సముద్రంలో మకాం వేశాడు. అక్కడక్కడా చిన్న చిన్న చేపలు దొరికినా మరిన్ని చేపల కోసం వేట కొనసాగించాడు. అనుకున్నట్టుగానే వలకు భారీ ఎనుగు టేకు చేప చిక్కింది. ఈ చేప బరువు 4 క్వింటాళ్ళు ఉంది. 10 అడుగుల పొడవు, అంతే పరిమాణంలో వెడల్పు ఉంది. తీరం నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఈ టేకు చేప వలలో పడిందని మత్యకారులు సంబరపడ్డారు. వారం రోజుల పాటు వేట చేసేందుకు 30 వేల వరకు ఖర్చు అయిందట. ఈ సమయంలో భారీ చేప చిక్కడంతో పెట్టిన ఖర్చులు పోను ఇంకా డబ్బులు మిగులుతాయన్న ఆనందంతో గోవింద్ అండ్ బ్యాచ్ ఒడ్డుకు చేరుకున్నారు.
పడవను పక్కన పెట్టి 4 క్వింటాళ్ళ చేపను మోసుకుంటూ ఒడ్డుకు తెచ్చారు. ఇక ఏముంది డబ్బులు కురుస్తాయని సంబరపడుతూ చేపలు కొనుగోలు చేసే బయ్యర్లకు ఫోన్ల మీద ఫోన్లు చేశారు. తీరా బయ్యర్లు చేపను చూసి ఈ చేపకు 2 వేల కన్నా ఎక్కువ డబ్బులు రావని కరాఖండిగా చెప్పడంతో మత్స్యకారులు అవాక్కయ్యారు. ఈ చేపకు మార్కెట్లో డిమాండ్ లేదని చెప్పడంతో ఉత్సాహమంతా నీరుకారిపోయింది. 30 వేలు ఖర్చు పెట్టి వేట చేస్తే.. తీరా చేతికి అందింది రెండు వేలా అంటూ ఊసూరుమన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..