Weahter Forecast: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడుతున్నారు. ఈ తరుణంలో వాతావరణ శాఖ నుంచి చల్లని కబురొచ్చింది. రాగల మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. సముద్ర మట్టానికి 0.9 కిమీ. నుంచి 1.5కిమీ. ఎత్తులో ఏర్పడిన ఉత్తర దక్షిణ ఆవర్తన ద్రోణి ఇప్పుడు నైరుతి మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా, దక్షిణ తమిళనాడు వరకు వ్యాపించిందని హైదరాబాద్, విజయవాడ వాతావరణ కేంద్రాలు వెల్లడించాయి.
దీని కారణంగా రాగల మూడు రోజుల్లో (20వ తేదీ నుంచి 22వ తేదీ వరకు) తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నాయి. అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా కురుస్తాయని ఇరు రాష్ట్రాల వాతావరణ శాఖలు హెచ్చరించాయి. ఈ ఉత్తర దక్షిణ ఆవర్తణ ద్రోణి ప్రభావం వల్ల అక్కడక్కడ సాధారణం కంటే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని పేర్కొన్నాయి. కొన్ని చోట్ల పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది.
ఇదిలాఉంటే.. ఇటీవల కాలంలో తెలంగాణ, ఏపీలల్లో వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ఈ అకాల వర్షాల వల్ల వరి, మిర్చి పంటలు నాశనమయ్యాయి. దీంతోపాటు పిడుగుపాటు ఘటనలతో తెలంగాణలో ఆరుగురికిపైగా మరణించారు. కాగా ఎండలు మండుతున్న తరుణంలో వర్షాలతో వాతవరణంలో కొంచెం మార్పులు రానున్నాయి.
Also Read: