MP Raghu Rama Krishna Raju: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు గుంటూరు సీఐడీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈనెల 28వ తేదీ వరకు ఆయనను రిమాండ్‌కు తరలించాలని ఆదేశించింది. ఆయన కాళ్లపై గాయాలు ఉండటంతో ఎంపీని ఆస్పత్రికి తరలించారు. ముందుగా జీజీహెచ్‌కు తరలించగా, ఆ తర్వాత రమేష్ ఆస్పత్రికి తరలించాలని సూచించింది కోర్టు. ఆయన కోలుకునే వరకు ఆస్పత్రిలో ఉండవచ్చని తెలిపింది. ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతున్నంత వరకు ఆయనకు వై కేటగిరి భద్రత కొనసాగుతుందని, ఆయన శరీరంపై కనిపిస్తున్న గాయాలపై న్యాయస్థానం నివేదిక కోరింది. రెండు ఆస్పత్రుల్లో మెడికల్ పరీక్షలకు కోర్టు ఆదేశించింది.
ఎంపీ రఘురామకృష్ణరాజు కేసులో సీఐడీ కోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు.. సీఐడీ విచారణలో కొందరు తనపై దాడి చేశారని నిందితుడు చెప్పారు. ఐదుగురు వ్యక్తులు రబ్బరు కర్రలతో దాడి చేసినట్లు తెలిపారు. తాళ్లతో కాళ్లు కట్టేసి దాడి చేసినట్లు రఘురామ తెలిపారు అని సీఐడీ కోర్టు న్యాయమూర్తి తెలిపారు. నిందితుడి గాయాలను తాను పరిశీలించాను అని అన్నారు. గాయపడిన నిందితుడికి వైద్య పరీక్షలు అవసరమన్నారు.
మరోవైపు రఘురామ కోర్టును తప్పుదారి పట్టిస్తున్నారని అదనపు న్యాయవాది జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి అన్నారు. బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చిందని, మధ్యాహ్నం కుటుంబ సభ్యులు భోజనం తెచ్చారని అన్నారు. అప్పటి వరకు రఘురామ బాగానే ఉన్నారని, పిటిషన్ డిస్మిస్ కాగానే కొత్త నాటకానికి తెర తీశారని అన్నారు. పోలీసులు తనను కొట్టారంటూ సాయంత్రం కోర్టులో కట్టుకథలు అల్లుతున్నారన్నారు. రఘురామ ఆరోపణలపై కోర్టు మెడికల్ కమిటీ వేసిందని ఏఏజీ తెలిపారు. నేడు మధ్యాహ్నం వరకు కమిటీ నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు ఆయన చెప్పారు.