ఇండియా నుంచి ప్రయాణాలపై అమెరికా ఆంక్షలు విధించింది. వచ్చే వారం నుంచి ఇవి అమలులోకి వస్తాయని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకి తెలిపారు. మే 4 నుంచి అమలులోకి వస్తున్నట్టు కూడా చెప్పారు. తమ దేశ అంటువ్యాధుల నివారణా కేంద్రం సలహాపై ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఇండియాలో కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని, పైగా వివిధ వేరియంట్లను కూడా నిపుణులు కనుగొన్నారని ఆమె చెప్పారు. ఇటీవలే అమెరికా భారత దేశంలో ఉన్న అమెరికన్లను ఆ దేశం వదిలి రావాలంటూ 4 ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. అలాగే ఇండియాకు వెళ్లరాదని కూడా అమెరికన్లను కోరింది. తాజా ప్రతిపాదనపై బైడెన్ ప్రభుత్వం లాంఛనంగా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఇండియా నుంచి వచ్చే ప్రయాణికులపై జర్మనీ, ఫ్రాన్స్, కెనడా, యూకే, వంటి దేశాలు ఆంక్షలు విధించా సంగతి తెలిసిందే. హాంకాంగ్, న్యూజిలాండ్, సింగపూర్ వంటి దేశాలు కూడా ఇండియా నుంచి వచ్చే విమాన సర్వీసులపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.
భారత్ నుంచి, భారత్ కు వెళ్లే అన్ని అంతర్జాతీయ విమానాల నిలిపివేతను డీజీసిఏ మే 31 వరకు పొడిగించింది. కాగా దేశంలో కోవిడ్ కేసులు వచ్చేవారం మరింత పెరగవచ్చునని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కన్నా ఇప్పుడు వైరస్ వేగంగా విస్తరిస్తోందని అంటున్నారు. అటు వరుసగా 9 రోజులుగా ఇండియాలో కేసులు 3 లక్షలకు పైగా నమోదవుతున్నాయి. నిన్న 3.86 లక్షల కేసులు నమోదయ్యాయి. శనివారం నుంచి 18 ఏళ్లకు పైగా వయస్సు పైబడినవారికందరికీ యుధ్ధ ప్రాతిపదికన టీకామందులు వేసే కార్యక్రమం ప్రారంభం కానుంది .