అమెరికా ఈశాన్య తీరంపై హెన్రీ తుపాను విరుచుకుపడుతోంది. భారీ వరదలు విలయం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఒక్కసారిగా వరద పోటెత్తింది. టెన్నెస్సీ రాష్ట్రంలో భారీ వరదల్లో చిక్కుకుని 22 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గల్లంతయ్యారు.
వరదల ధాటికి వందల సంఖ్యలో ఇళ్లు నీట మునగగా, మరికొన్ని కూలిపోయాయి. రోడ్లు కొట్టుకుపోయాయి. భారీ వరదల్లో వాహనాలు కొట్టుకుపోతున్నాయి. టెన్నెసీలో రికార్డు స్థాయిలో 34.5 సెంటీమీటర్ల వర్షం కురిసిందని అధికారులు తెలిపారు. 1982 నుంచి ఈ స్థాయిలో వర్షం నమోదుకావటం ఇదే మొదటిసారి. 7 అడుగుల మేర వరద ముంచెత్తడంతో పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. కొందరు చెక్క బల్లల సాయంతో వరదలో ఈదుకుంటూ బయటపడ్డారు. ఈ నేపథ్యంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలను కోరారు టెన్నెసీ గవర్నర్. .
మరోవైపు హెన్నీ తుఫాను ప్రభావంతో న్యూయార్క్, న్యూజెర్సీ, మసాసుసెట్స్, రోడ్ ఐలాండ్‌లలో భారీ వర్షాలు పడుతున్నాయి. సముద్రం పోటెత్తుతుండగా, గంటకు 70 మైళ్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. న్యూయార్క్ రాష్ట్రంలోని లాంగ్ ఐలాండ్‌లో ఆకస్మిక వరదలు వస్తాయని ముందస్తు హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఇవి కూడా చదవండి: Jewellers businessmen: వద్దేవద్దు.. గోల్డ్‌పై హాల్‌మార్కింగ్‌కు వ్యతిరేక గళం.. ఇవాళ వ్యాపారుల నిరసన