ఏ దేశంలో ఉన్నా మన సంస్కృతి, సంప్రదాయాలను మరచిపోవడం లేదు ప్రవాస భారతీయులు. విదేశాల్లోనూ తమ ఇష్టదైవాలకు ఆలయాలు నిర్మించి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. అలాగే బే ఏరియాలోని ఫ్రీమాంట్ హిందూ టెంపుల్‌లో పూరి జగన్నాధునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతే కాదు.. పుర వీధుల్లో ఊరేగింపు చేశారు.
తొలుత ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం.. వేద పండితులు మంత్రోచ్ఛరణల మధ్య హారతి కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. ప్రత్యేకంగా అలంకరించిన రథంపై పూరీ జగన్నాథుడికి ఊరేగింపు నిర్వహించారు. కొబ్బరికాయలు కొట్టి రథయాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. జగన్నాథుని రథాన్ని లాగేందుకు పోటీలు పడ్డారు.
జగన్నాథుని రథయాత్రలో స్థానిక మేయర్, కౌన్సిల్ మెంబర్లు పాల్గొన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేస్తున్న ఎన్నారైలను కొనియాడారు.
1983 నుంచి 36 ఏళ్లుగా.. ఈ జగన్నాథుని రథయాత్ర నిర్వహిస్తున్నామన్నారు ఫ్రీమాంట్ హిందూ టెంపుల్ ఫౌండర్ అండ్ ఛైర్మన్ రోమేష్ జా్ప్రా. ఈ రథయాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు.
ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైనదిగా.. అత్యంత పెద్దదిగా ప్రసిద్ధి చెందిన పూరీ జగన్నాథుని రథయాత్ర. అలాంటి రథయాత్రను అమెరికాలోనూ నిర్వహించడం పట్ల ప్రవాస భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.