Corona Cases: పోయిందనుకున్న మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. పంచవ్యాప్తంగా కరాళ నృత్యం చేస్తోంది కరోనా. వందలు, వేల నుంచి లక్షల్లో నమోదవుతున్నాయి కరోనా కేసులు. అగ్రరాజ్యం అమెరికాపై కొవిడ్ రక్కసి పంజా విసిరింది. రోజుకో మైల్‌స్టోన్‌ను క్రాస్ చేస్తోంది. అమెరికాలో ఒక్కరోజే 10లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా ప్రారంభం నుంచి అమెరికాలో ఇవే అత్యధిక కేసులు. గత కరోనా వేవ్‌లతో పోలిస్తే ఇప్పుడు మూడు రెట్లు ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. మూడు రోజుల క్రితం 5లక్షల 91 వేల కేసులు నమోదవగా.. తాజాగా 10లక్షలకు పైగా కేసులు నమోదవడం కలవరపెడుతోంది.
ఇక వైరస్ బారినపడి ఆస్పత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతోంది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో లక్షమందికి పైగా చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 8లక్షల 26వేల మంది కరోనా ధాటికి ప్రాణాలు కోల్పోయారు. ఒకవైపు కరోనా.. మరోవైపు ఒమిక్రాన్ విజృంభణతో 12 నుంచి 15 ఏళ్ల వయసు వారితో పాటు బూస్టర్ డోస్ అందించేందుకు ఫైజర్ టీకాకు ఎఫ్‌డీఏ అనుమతులిచ్చింది.
ఇక భారత్‌లోనూ కోవిడ్ ఉధృతికి మరోసారి మొదలైంది. ఓ వైపు కరోనా.. మరో వైపు కోవిడ్ వేరియట్ ఒమిక్రాన్ కేసులు వణుకుపుట్టిస్తున్నాయి. నిన్న దేశంలో 37,379 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 11,007 మంది కోలుకున్నారు. ఈ సమయంలో 124 మంది కోవిడ్‌తో మరణించారు. కరోనా డెల్టా వేరియంట్‌తో పాటు.. ఓమిక్రాన్ వేరియంట్ కూడా వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటివరకు దేశంలో మొత్తం ఓమిక్రాన్ కేసుల సంఖ్య 1,892కి చేరింది. మహారాష్ట్ర , ఢిల్లీలో అత్యధికంగా 568 , 382 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం ఓమిక్రాన్ 1,892 మంది రోగులలో 766 మంది కోలుకున్నారు.
ఇవి కూడా చదవండి: