అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి తానేమీ తీసిపోనన్నట్టే ఉన్నాడు ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ కూడా.. మిన్నెసోటా లోని ఓ క్లినిక్ ని విజిట్ చేసినప్పుడు ఈయన ముఖానికి ఎలాంటి మాస్క్ లేకుండానే కరోనా రోగులను పరామర్శించాడు. ఈ కరోనా కాలంలో ఈయన తన వెంట ఓ పదిమందిని వెంటేసుకుని ఈ క్లినిక్ లో కలయదిరగడం వివాదాస్పదమైంది. ఈ పదిమందిలో ఓ కరోనా పేషంట్ తో బాటు వైట్ హౌస్ లో కరోనా వైరస్ టాస్క్ ఫోర్స్ సభ్యులు కూడా ఉన్నారు. అంతా మాస్కులతో ఉండగా… మన ఉపాధ్యక్షులవారు మాత్రం ప్రత్యేకంగా కనిపించాలి అనో, లేక నాకెందుకు మాస్క్ అనుకున్నారో తెలియదు గానీ ఈ రూపంలో దర్శనమిచ్చారు. క్లినిక్ లోని కొందరు పేషంట్లను పరామర్శించారు. ఈ క్లినిక్ పేరు మేయో క్లినిక్ అట.. రోగులు, విజిటర్లు, స్టాఫ్ అందరూ విధిగా మాస్కులు ధరించాలని తన వెబ్ సైట్ లో ఈ చిన్న హాస్పిటల్ పేర్కొంది. కానీ మైక్ పెన్స్ తీరుపై ఆన్ లైన్ లో విమర్శలు వెల్లువెత్తడంతో.. ఆయన రాకముందే మాస్కు ఆవశ్యకత గురించి ఆయనకు ముందే తెలియజేశామని ఈ క్లినిక్ ట్వీట్ చేసింది. అయితే ఆ తరువాత ఆ ట్వీట్ ని తొలగించింది.
మైక్ పెన్స్ మాస్క్ ధరించకుండా ప్రమాదకరమైన ధోరణికి నాంది పలికారని డెమోక్రటిక్ సెనేటర్లు మండిపడ్డారు. పెన్స్ ఇలా వితౌట్ మాస్క్ తో బయటకు రావడం ఇదే మొదటిసారి కాదు. లోగడ కొలరాడో గవర్నర్ ను గ్రీట్ చేసినప్పుడు సైతం ఆయన మాస్క్ లేకుండానే కనిపించారు.