
అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో వరుస భూకంపాలు సంభవించడంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. శుక్రవారం రాత్రి 8.19 గంటల సమయంలో దక్షిణ కాలిఫోర్నియాలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.1గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. భూకంప ధాటికి పలు ఇళ్లు, రోడ్లు ధ్వంసమయ్యాయి. వరుస ప్రకంపనాలు రావడంతో ఇళ్ల నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు. మరోవైపు భూకంపం నేపథ్యంలో లాస్ ఎంజెల్స్ కమ్యూటర్ రైల్ సర్వీస్‌ను నిలిపివేశారు. కాగా, గురువారం కూడా ఇదే ప్రాంతంలో 6.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. దక్షిణ కాలిఫోర్నియాలో 1994లో 6.6 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. లాస్ ఏంజెల్స్ కేంద్రంగా ఈ భూమి కంపించింది. ఆ సమయంలో 57 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోగా.. బిలియన్ డాలర్ల ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు.