ప్రస్తుతం ఫిఫా ప్రపంచ కప్ పోటీలు ఖతర్‌లో జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ పోటీలను వీక్షించేందుకు ప్రపంచ నలుమూలల నుంచి 12 లక్షల మందికిపైగా అభిమానులు ఖతర్‌కు చేరుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన హెచ్చరికలు ఫుట్ బాల్ లవర్స్‌ను భయపెడుతున్నాయి. న్యూ మైక్రోబ్స్ అండ్ ఇన్‌ఫెక్షన్స్ జర్నల్‌లో ప్రచురితమైన వివరాల ప్రకారం ఖతార్‌లో కెమెల్ ఫ్లూ వ్యాప్తిచెందే ప్రమాదం ఉందని తెలిపింది. ఈ వైరస్ అచ్చంగా కరోనాను పోలి ఉంటుంది. ఈ విషయమై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) శాస్త్రవేత్తలు ఈ మేరకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రేక్షకులతో పాటు స్థానికులు, ఆటగాళ్లకు ప్రమాదం పొంచి ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
కెమల్ ఫ్లూ అనేది ఒంటెల నుంచి మనుషులకు వ్యాప్తి చెందే వ్యాధి. ఇది తొలిసారిగా 2012లో సౌదీ అరేబియాలో వెలుగులోకి వచ్చింది. ఈ వ్యాధి శాస్త్రీయ నామం.. మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (ఎంఈఆర్‌ఎస్). ఈ వ్యాధి కరోనా కుటుంబానికి చెందిన ఎంఈఆర్‌ఎస్-కోవ్ వైరస్ వల్ల సంభవిస్తుంది. వ్యాధి సోకిన జంతువు లేదా రోగితో సంబంధం ఉన్న వారికి ఫ్లూ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తులో వచ్చే అంటు వ్యాధుల జాబితాలో ఈ వ్యాధిని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల చేర్చింది. 2021 జనవరి నాటికి కెమల్ ఫ్లూ కేసులు మొత్తం 2500 నమోదయ్యాయి.
ఈ ఫ్లూ బారిన పడిన వారిలో దాదాపు కరోనా వ్యాధి లక్షణాలు ఉంటాయి. ముఖ్యంగా జ్వరం, దగ్గు, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది, వాంతులు, పొత్తి కడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. 60 ఏండ్లు పైబడిన వృద్ధులు, బలహీన వ్యాధినిరోధక శక్తిని కలిగి ఉన్నవారు, ఇప్పటికే తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న వారు ఈ వ్యాధి బారిన పడే అవకాశాలు ఉన్నాయి. పీసీఆర్ టెస్ట్ సహాయంతో ఈ వైరస్‌ను గుర్తిస్తారు.
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..