Women’s university Swabi : పాకిస్థాన్‌లోని యూనివర్సిటీలో విద్యార్థినులు ఫోన్ వినియోగించడంపై నిషేధం విధించారు. పాకిస్థాన్ (Pakistan) వాయువ్య ప్రాంతంలోని ఖైబర్ పఖ్తుంక్వా ఉమెన్స్ యూనివర్సిటీ క్యాంపస్‌లో విద్యార్థినులు ఫోన్లు వినియోగించడంపై అధికారులు కఠిన ఆంక్షలు జారీ చేశారు. స్మార్ట్‌ఫోన్లు, టచ్‌స్క్రీన్ మొబైల్ ఫోన్లు లేదా ట్యాబ్‌లను వర్సిటీ పరిసరాల్లోకి అనుమతించబోమంటూ విశ్వవిద్యాలయ అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ ఆదేశాలు ఏప్రిల్ 20 నుంచే (బుధవారం) అమలులోకి వచ్చినట్లు అక్కడి మీడియా సంస్థలు వెల్లడించాయి. యూనివర్సిటీలో ఉన్న సమయంలో విద్యార్థినులు సోషల్ మీడియాను విరివిగా వినియోగిస్తున్నారని.. దీంతో ఇది వారి ప్రవర్తన, చదువుపై ప్రభావం చూపుతుందని ఈ ఆదేశాలు జారీ చేసినట్టు అధికారులు నోటిఫికేషన్‌లో వెల్లడించారు. ఎవరైనా ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు రూ.5 వేల జరిమానా విధిస్తామని పేర్కొంది. విద్యార్థులను హెచ్ఓడీలు నిరంతరం పర్యవేక్షించాలని సూచనలు చేసింది.
కాగా.. తెహ్రిక్ తాలిబన్ మిలిటెంట్లు క్రియాశీలంగా ఉండే ఖైబర్ పఖ్తుంక్వా ప్రాంతంలో తరచూ విద్యార్థినుల డ్రెస్ కోడ్, హెయిర్ స్టైల్ వంటి వాటిపై ఆంక్షలు అమలు చేస్తుంటారు. అమ్మాయిలంతా సల్వార్ కమీజ్ ధరించాలని, ఇస్లా ఆచారాలను పాటించాలని నిబంధనలు విధిస్తుంటారు. కాగా.. గతేడాది మార్చిలో పెషావర్ యూనివర్సిటీ కొత్త డ్రెస్ కోడ్‌ను పాటించాలని సూచించింది. విద్యార్థినులు తమకు నచ్చిన కమీజ్‌తో పాటు తెల్లని సల్వార్ ధరించాలని షరతు పెట్టింది. అంతేకాకుండా హజారా వర్సిటీ కూడా విద్యార్థినులు దుపట్టాతో పాటు సల్వార్ కమీజ్ ధరించాలని సూచనలు చేసినట్లు మీడియా పేర్కొంది.
Also Read: