లండన్, డిసెంబర్ 29: అనారోగ్యంతో దవాఖానకు వచ్చిన ఓ మహిళకు పారాసిటమాల్ ఓవర్‌డోస్ ఇవ్వడం వల్ల మరణించింది. ఈ ఘటన బ్రిటన్‌లోని విడ్నెస్ పట్టణంలో చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతి చెందిన మహిళను లారా హిగ్గిసన్ (30)గా గుర్తించారు. బ్రిటన్‌లోని విడ్నెస్‌కు చెందిన ఆమెకు ఇద్దరు పిల్లలు, భర్త ఉన్నారు. ‘న్యుమోనియా’బారిన పడ్డ ఆమె చికిత్స కోసం 5 ఏప్రిల్ 2017న సమీపంలోని ఆస్పత్రికి వెళ్లింది. అయితే ఆమె బరువు కేవలం 40 కిలోల కంటే తక్కువగా ఉంది. న్యుమోనియాతో బాధపడుతున్న లారా 2017 ఏప్రిల్ 7వ తేదీన ఆస్పత్రిలో చేరింది. ఆమెకు ఆస్పత్రి వైద్యులు ఇంట్రావీనస్ ట్యూబ్ ద్వారా మూడు సార్లు 1G మోతాదు చొప్పున పారాసెటిమల్ ఇచ్చారు. అయితే ఏప్రిల్ 6 డోస్ పెంచడం వల్ల ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది.
ఏప్రిల్ 7న గుర్తించిన వైద్యులు విరుగుడు యాంటీ డోస్ ఇచ్చినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో ఏప్రిల్ 19న ఆమె మరణించింది. లారా మరణానికి కారణం సెప్సిస్, సిర్రోసిస్, ప్యాంక్రియాటైటిస్‌తో కూడిన అవయవ వైఫల్యంగా బయటపడింది. లారా చికిత్సలో పారాసెటమాల్ అధిక మోతాదులో ఇవ్వడం మూలంగా మరణించినట్లు ఆస్పత్రి యాజమన్యం గుర్తించింది. 19 ఏప్రిల్ 2017న చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. లారా హిగ్గిసన్ 5 అడుగుల ఎత్తు, 40 కిలోల బరువు మాత్రమే ఉన్నారని, ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ‘పారసిటమాల్’ అధిక మొత్తంలో ఇవ్వటం మూలంగా మరణానికి దారి తీసిందని వైద్య నిపుణులు భావిస్తున్నారు.
సాధారంగా పారాసెటమాల్ కాంప్లిమెంట్లను తలనొప్పి, జ్వరం వంటివాటికి వైద్యులు సిఫార్సు చేస్తుంటారు. వీటిని తగిన మోతాదులో తీసుకుంటే సురక్షితంగా పరిగణించబడుతుంది. అధికంగా లేదా సుదీర్ఘ కాలం వీటిని ఉపయోగిస్తే అనేక దుష్ప్రభావాలకు దారితీసే ప్రమాదం ఉంది. వికారం, కడుపు నొప్పి, ఒంటి దద్దుర్లు వంటి తేలికపాటి దుష్ప్రభావాలు సంభవించవచ్చు. కొంతమందిలో దురద, వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి అలెర్జీ ప్రతిచర్యలు కూడా కనిపిస్తాయి. పారాసెటమాల్ అధిక వినియోగం లివర్, కిడ్నీ ఫెయిల్యూర్‌కి సైతం దారితీస్తుంది. పారాసెటమాల్ థ్రోంబోసైటోపెనియా (తక్కువ ప్లేట్‌లెట్ కౌంట్), ల్యూకోపెనియా (తక్కువ తెల్ల రక్త కణాల సంఖ్య) వంటి రక్త రుగ్మతలకు కూడా దారితీస్తుంది.