ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి లో శాశ్వత సభ్యత్వం కోసం భారత్‌కు మద్దతునిచ్చే అంశంపై తమ వైఖరి స్పష్టంగా చెప్పలేనని ఐరాసలో అమెరికా రాయబారిగా నియమితురాలైన లిండా థామన్ గ్రీన్‌ఫీల్డ్ పేర్కొన్నారు. 35 ఏండ్లకు పైగా విదేశీ వ్యవహారాలశాఖలో పని చేసిన థామస్ గ్రీన్‌ఫీల్డ్‌ను ఐరాసలో అమెరికా రాయబారిగా ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ నిర్ణయించారు. ఆమె నియామకంపై సెనెట్ విదేశీ వ్యవహారాల కమిటీ ధ్రువీకరించనున్న నేపథ్యంలో లిండా థామస్ చేసిన వ్యాఖ్య ప్రాధాన్యం సంతరించుకున్నది.
భారత్‌కు భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం కల్పించే విషయమై వ్యతిరేకించే వారి వాదనలను తెలుసుకోవాల్సి ఉందని ఆమె చెప్పారు. భారత్ అభ్యర్థిత్వాన్ని ఇటలీ, పాకిస్థాన్, మెక్సికో, ఈజిప్ట్ వ్యతిరేకిస్తున్నాయి. ఇంతకుముందు అమెరికాలోని జార్జి డబ్ల్యు బుష్, బారక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వాలు ఐరాస భద్రతామండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కోసం మద్దతునిస్తామని బహిరంగంగానే ప్రకటించాయి.
భారత్, జర్మనీ, జపాన్ దేశాలకు భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం కల్పించాలని మీరు భావిస్తున్నారా? అని మీడియానే గ్రీన్‌ఫీల్డ్ ప్రశ్నించారు. ఐరాస భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వంపై కొంత చర్చ జరుగుతున్నదని, కొన్ని బలమైన వాదనలు కూడా వినిపిస్తున్నాయని తెలిపారు. లిండా థామస్ గ్రీన్ ఫీల్డ్‌కు జో బైడెన్ క్యాబినెట్ హోదా కల్పించారు.