అందమైన అమ్మాయిని చూస్తే ఎలాంటి వారికైనా పుట్టు రిమ్మ తెగులని ఓ సామెతను నిజం చేసే సంఘటన తాజాగా బ్రిటన్‌లో చోటు చేసుకుంది. ఓ మహిళ ఆన్‌లైన్లో కొన్ని సరుకులు ఆర్డర్ పెట్టింది. కాసేపటికి ఇంటి కాలింగ్ బెల్ మోగగానే మహిళ వెళ్ళి తలుపులు తీసింది. ఎదురుగా తను ఆర్డర్ పెట్టిన సరుకులు పట్టుకొని డెలివరీ బాయ్ గుమ్మంలో నిలబడి ఉన్నాడు. అతని వద్దనుండి సరుకులు రిసీవ్ చేసుకుని ఆమె లోపలికి వెళ్ళిపోయింది. అయితే కొన్ని సెకెన్లలోనే మళ్ళీ కాలింగ్ బెల్ మోగింది. మహిళ అనుమానంగానే వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా మళ్ళీ డెలివరీ బాయ్ నిలబడి ఉన్నాడు. ఏదైనా ఇవ్వడం మరిచిపోయాడేమో అనుకుంది ఆ మహిళ.
బ్రిటన్‌లోని మెరిడెన్ ఎస్టేట్‌లో నివసిస్తున్న 33 ఏళ్ల మహిళకు ఊహించని విధంగా ఈ వింత అనుభవం ఎదురైంది. ఆమెను ‘దయచేసి ఏమీ అనుకోకుండా మీ వయసెంతో చెబుతారా’ అని అడిగాడు. నా వయసుతో ఇతనికేం పని అనుకుంటూనే… 33సంవత్సరాలని చెప్పింది. ఆమె అలా చెప్పగానే సదరు డెలివరీ బాయ్ వెంటనే ఆ మహిళ ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకొని ముద్దుపెట్టుకోబోయాడు. అయితే అతని వాలకం గమనించి జరగకూడనిది ఏదో జరుగుతుందని అనుకున్న ఆ మహిళ అతన్ని విడిపించుకుని వేగంగా లోపలికి వెళ్ళి తలుపు వేసుకుంది. ఇదంతా ఇంటి బయట ఏర్పాటు చేసిన సిసి కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఈ ఘటన నేపథ్యంలో ఆ మహిళ సదరు కంపెనీ వారిపై తీవ్రంగా విరుచుకుపడింది. కాగా ఆ డెలివరీ బాయ్ వయసు దాదాపు 60 సంవత్సరాలు ఉంటాయట. ఆ వయసులో అతను అలా పని చేసుకుంటూ జీవించడం మంచిదే.. కానీ ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే బతుకుదెరువు పోయి రోడ్డుమీద పడడం ఖాయమని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
ది మిర్రర్ ప్రకారం,.. మహిళ ఫిర్యాదుకు స్పందించిన టెస్కో కస్టమర్ కు తమ డెలివరీ బాయ్ చర్యలకు క్షమాపణలు చెప్పింది. అంతేకాదు నిందితుడిని ఉద్యోగం నుంచి తొలగించింది. దీంతో పాటు డెలివరీ బాయ్‌పై అంతర్గత విచారణ కూడా ప్రారంభించారు. ఈ ఘటనపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు.
అదే సమయంలో కొందరు టెస్కో తన డెలివరీ బాయ్‌లకు మహిళలతో ఎలా ప్రవర్తించాలో నేర్పించాలని సూచిస్తున్నారు. అపరిచితుడు ఇలా ముద్దాడటానికి ప్రయత్నించడం పిచ్చి చర్యని.. ఇది ఎవరికీ ఆమోదయోగ్యం కాదని వ్యాఖ్యానిస్తున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..