
పుట్టబోయే చిన్నారులకు అమెరికా పౌరసత్వం పొందడమే పర్యాటకుల ప్రధాన ఉద్దేశంగా తాము భావిస్తే.. అటువంటి వారి వీసా దరఖాస్తులను తిరస్కరిస్తామని చావుకబురు చల్లగా చెప్పేసింది అమెరికా. వలస విధానాన్ని కఠినతరం చేస్తున్న ట్రంప్ యంత్రాంగం.. ఇతర వీసాలతోపాటు టూరిస్ట్ వీసాల విషయంలోనూ అనేక జాగ్రత్తలు తీసుకుంటోంది. పుట్టబోయే చిన్నారికి పౌరసత్వమే అమెరికా పర్యటన ఉద్దేశమని తాము భావిస్తే.. అలాంటి దరఖాస్తులను తిరస్కరిస్తామని భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం వెల్లడించింది. ఈ అడ్డదారి ప్రయత్నాలను ఏమాత్రం అనుమతించం అంటూ భారతదేశంలోని అమెరికా రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది.
అమెరికాలో పుట్టే పిల్లలకు శతాబ్దకాలంగా సహజసిద్ధ పౌరసత్వం లభిస్తోంది. దీంతో ఆ దేశంలో ప్రసవం చేసుకోవాలని కొందరు ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే రెండోసారి అధికారంలోకి రాగానే బర్త్ రైట్ సిటిజన్‌షిప్ విధానానికి ముగింపు పలుకుతూ జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ ఉత్తర్వుపై సంతకం చేశారు. ట్రంప్ వలసలకు సంబంధించిన విధానాలలో సుప్రీంకోర్టు తుది తీర్పు కోసం వెళ్లిన మొదటి వివాదం ఇదే. అక్రమంగా లేదంటే తాత్కాలికంగా అమెరికాలో నివసిస్తున్న తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలు అమెరికా పౌరులు కాదంటూ ట్రంప్ జారీచేసిన ఉత్తర్వును సుప్రీంకోర్టు పరిశీలనకు స్వీకరించింది. ఈ ఉత్తర్వు రాజ్యాంగబద్దతపై త్వరలో తుది తీర్పు వెలువడే అవకాశం ఉంది.
జన్మహక్కు పౌరసత్వం ద్వారా దేశంలోకి వస్తున్న లక్షల మందికి ఆశ్రయం కల్పించే స్థోమత అమెరికాకు లేదని చెప్పేస్తున్నారు ట్రంప్. ఒకవేళ సుప్రీంకోర్టు తన వాదనకు అనుకూలంగా తీర్పు ఇస్తే.. ఇప్పటికే పొందిన పౌరసత్వాలను రద్దు చేయాలో లేదో ఇంకా ఆలోచించలేదంటున్నారు. మరోవైపు తమ దేశానికొచ్చే పర్యాటకులు సోషల్ మీడియా హిస్టరీని అందించడాన్ని తప్పనిసరి చేసే ఆలోచనలో ఉంది ట్రంప్ సర్కార్.