శరీరంలో కత్తి దిగినా 174 మందిని కాపాడిన భారత పైలట్.. రియల్ హీరో అంటూ ట్రంప్, నెతన్యాహు ప్రశంసలు..

గాల్లో పెను ప్రమాదం తృటిలో తప్పింది. కాక్‌పిట్‌లోనే తోటి పైలట్ కత్తితో దాడి చేసి విమానాన్ని కూల్చేందుకు యత్నించగా... రక్తమోడుతున్నా ప్రాణాలకు తెగించి 174 మంది ప్రయాణికులను కాపాడారు ఓ భారతీయ పైలట్. క్షణాల్లో వేల అడుగులు పడిపోయిన విమానాన్ని సేఫ్‌గా ఎలా ల్యాండ్ చేశారు? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సైతం సెల్యూట్ చేసిన ఆ భారతీయ రియల్ హీరో ఎవరు? అనేది తెలుసుకుందాం..

శరీరంలో కత్తి దిగినా 174 మందిని కాపాడిన భారత పైలట్.. రియల్ హీరో అంటూ ట్రంప్, నెతన్యాహు ప్రశంసలు..
Trump And Netanyahu Hail Indian Pilot Smit Machchhar

Updated on: Oct 01, 2026 | 6:50 AM

దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌‌లోని టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో ఊహించని ప్రమాదం తప్పింది. గాల్లో ఉండగానే కో-పైలట్ కత్తితో విచక్షణారహితంగా దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలైన భారత సంతతి కెప్టెన్ స్మిత్ మచ్చార్ అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించారు. రక్తమోడుతున్నప్పటికీ కాక్‌పిట్ తలుపు తెరిచి, పెను విమాన ప్రమాదాన్ని నివారించి 174 మందికి పైగా ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు. బోయింగ్ 737 మ్యాక్స్-8 విమానం గాల్లో ఉండగా, ఒమన్ జాతీయుడిగా భావిస్తున్న కో పైలట్ అకస్మాత్తుగా కెప్టెన్ స్మిత్ మచ్చార్‌‌పై కత్తితో దాడి చేశాడు. విమాన నియంత్రణ వ్యవస్థలను ధ్వంసం చేసి, విమానాన్ని కూల్చేందుకు అతను తీవ్రంగా ప్రయత్నించాడు. ఆ పెనుగులాటలో విమానం కేవలం 30 సెకన్లలోనే దాదాపు 14,000 అడుగుల కిందికి దూసుకువచ్చింది. తీవ్ర గాయాలపాలై కిందపడిపోతున్న సమయంలో కూడా కెప్టెన్ స్మిత్ చాకచక్యంగా కాక్‌పిట్ డోర్‌ను అన్‌లాక్ చేసి కేకలు వేశారు. విమానం తీవ్ర కుదుపులకు లోనవడం, అరుపులు వినిపించడంతో అప్రమత్తమైన ప్రయాణికులు, సిబ్బంది వెంటనే కాక్‌పిట్‌లోకి దూసుకెళ్లారు.

కో-పైలట్‌ను అడ్డుకున్న ప్రయాణికుడు.. సేఫ్‌గా సౌదీలో ల్యాండింగ్

కాక్‌పిట్‌లోకి చొరబడిన ప్రయాణికులలో యానివ్ అనే ఇజ్రాయెల్ ప్లంబర్ ప్రధాన పాత్ర పోషించారు. టీవీలో ప్రసారమయ్యే ఎయిర్ డిజాస్టర్స్ కార్యక్రమాలు చూసి విమానాల నియంత్రణపై ప్రాథమిక అవగాహన పెంచుకున్నట్లు చెప్పిన యానివ్, ఇతర ప్రయాణికులతో కలిసి విధ్వంసానికి పాల్పడుతున్న కో-పైలట్‌ను కుర్చీ నుంచి వెనక్కి లాగి బంధించారు. అదే విమానంలో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు పైలట్లు, భద్రతా సిబ్బంది వెంటనే కాక్‌‌పిట్ నియంత్రణను తమ చేతుల్లోకి తీసుకుని విమానాన్ని అదుపు చేశారు. అనంతరం విమానాన్ని సౌదీ అరేబియాలోని తబూక్ విమానాశ్రయానికి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు. దాదాపు 8 గంటల నిరీక్షణ అనంతరం ప్రయాణికులను మరో ప్రత్యామ్నాయ విమానంలో టెల్ అవీవ్‌కు తరలించారు.

ట్రంప్, నెతన్యాహు సెల్యూట్

కెప్టెన్ స్మిత్ మచ్చార్ ప్రదర్శించిన అద్భుత ధైర్యాన్ని ప్రపంచ నేతలు కొనియాడారు. ఓవల్ ఆఫీస్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘స్మిత్ చాలా తీవ్రమైన గాయాలపాలైనా సమయస్ఫూర్తితో వ్యవహరించి రియల్ హీరోగా నిలిచారు. ఇదొక అద్భుతమైన సంఘటన’’ అని అన్నారు. తీవ్రంగా గాయపడినా వెనకడుగు వేయకుండా ప్రయాణికులను కాపాడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్ అసాధారణ ధైర్యానికి నా సెల్యూట్. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. స్మిత్‌ను అత్యంత నైపుణ్యం కలిగిన వీరుడిగా అభివర్ణిస్తూ, భారత్-ఇజ్రాయెల్-యూఏఈ తరఫున ఆయన క్షేమం కోసం ప్రార్థిస్తున్నట్లు భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి తెలిపారు.

ఎవరీ కెప్టెన్ స్మిత్ మచ్చార్?

గుజరాత్‌‌కు చెందిన స్మిత్ మచ్చార్ కమర్షియల్ ఏవియేషన్ రంగంలో పదేళ్లకు పైగా విశేష అనుభవం కలిగిన పైలట్. జూన్ 2011 నుండి 2022 వరకు దాదాపు 11 ఏళ్లపాటు భారత విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌లో పనిచేశారు. జూన్ 2022లో డైరెక్ట్ ఎంట్రీ కెప్టెన్‌గా ఫ్లైదుబాయ్‌లో చేరారు. బోయింగ్ 737 విమానాల నిర్వహణ, భద్రతా ప్రమాణాల్లో ఆయన నిపుణుడు. వెలింగ్‌కర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో పట్టా పొందారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కెప్టెన్ స్మిత్ ఆరోగ్యాన్ని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని, ఆయన కుటుంబానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని భారత దౌత్య కార్యాలయం వెల్లడించింది.

Loading...
Unable to load recommendations.
Follow Us