
అమెరికాలో ఉద్యోగం చేయాలనే కలలతో ఉన్న లక్షలాది మంది భారతీయ విద్యార్థులు, ఐటీ నిపుణులు, యజమానులకు అమెరికా ఫెడరల్ కోర్టు శుభవార్త అందించింది. డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం ప్రతిపాదించిన వివాదాస్పద లక్ష డాలర్లు (సుమారు రూ. 84 లక్షలు) వార్షిక హెచ్-1బీ వీసా రుసుమును యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జి లియో సోరోకిన్ చట్టవిరుద్ధమని పేర్కొంటూ కొట్టివేశారు. ఈ తీర్పుతో అమెరికాలో స్థిరపడాలనుకునే అంతర్జాతీయ ప్రతిభావంతులు, ముఖ్యంగా భారతీయులు ఊపిరి పీల్చుకున్నారు.
డోనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన విధానం ప్రకారం, ప్రతి హెచ్-1బీ కార్మికుడి కోసం యజమానులు ఏటా లక్ష డాలర్ల భారీ రుసుమును అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 19న ఈ ప్రతిపాదన బయటకు రాగానే పరిశ్రమ వర్గాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. అయితే, అమెరికా పార్లమెంట్ కాంగ్రెస్ ఆమోదం లేకుండా ఇలాంటి భారీ రుసుమును విధించడం పన్ను వేయడంతో సమానమని, ఇది చట్టవిరుద్ధమని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
భారతీయులపై ప్రభావమెంత?
అమెరికా హెచ్-1బీ వీసాలలో 70 శాతానికి పైగా వాటా భారతీయులదే. అలాగే ప్రస్తుతం అమెరికా విశ్వవిద్యాలయాలలో 3,30,000 మందికి పైగా భారతీయ విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో చాలా మందికి విద్య పూర్తి కాగానే ఉపాధి పొందేందుకు హెచ్-1బీ వీసాయే ఏకైక మార్గం. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఒకవేళ ఈ లక్ష డాలర్ల ఫీజు అమలులోకి వచ్చి ఉంటే, కంపెనీలకు స్పాన్సర్‌షిప్ భారం పెరిగిపోయేది. దీనివల్ల ముఖ్యంగా కెరీర్ ప్రారంభ దశలో ఉన్న కొత్త గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు ఇవ్వడానికి కంపెనీలు వెనుకాడేవి. స్టార్టప్‌లు, మధ్యతరహా కంపెనీలు, పరిశోధనా సంస్థలు తీవ్రంగా నష్టపోయేవి.
ప్రతిభకు పెరిగిన డిమాండ్!
ప్రస్తుతం అమెరికాలో టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), సైబర్ సెక్యూరిటీ, ఇంజనీరింగ్, హెల్త్‌కేర్ రంగాలలో తీవ్ర నైపుణ్యాల కొరత ఉంది. దేశీయంగా ఈ ఖాళీలను భర్తీ చేసే ప్రతిభ అందుబాటులో లేకపోవడంతో అంతర్జాతీయ నిపుణులు ఇక్కడ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఒకవేళ ఈ ఫీజు అమలులో ఉంటే, కంపెనీలు తమ ప్రాజెక్టులను భారత్ వంటి ఇతర దేశాలకు అవుట్‌సోర్స్ చేయాల్సి వచ్చేది. మరోవైపు, విదేశీ విద్యార్థులు అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఏటా దాదాపు 44 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని అందిస్తున్నారు. వలస విధానాలు కఠినతరం కావడం వల్ల విద్యార్థులు యూకే, జర్మనీ, ఆస్ట్రేలియా వైపు మొగ్గు చూపుతున్న తరుణంలో ఈ తీర్పు అమెరికాకు మేలు చేకూర్చనుంది.
ఈ కోర్టు తీర్పు అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానాల పట్ల మళ్లీ నమ్మకాన్ని పెంచింది. ప్రతిభావంతులను అడ్డుకునే ఏకపక్ష నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయని ఈ తీర్పు నిరూపించింది. ప్రస్తుతానికి అమెరికా కలలు కంటున్న వేలాది మంది భారతీయుల భవిష్యత్తు సురక్షితంగా మారింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..