Iran US conflict: పశ్చిమాసియాలో మధ్య మళ్లీ మొదలైన యుద్ధం.. ఇరాన్ స్థావరాలపై అమెరికా మెరుపు దాడులు!

హమ్మయ్య.. అంతా అయిపోయిందనుకునేలోపే పశ్చిమాసియా మళ్లీ భగ్గుమంది. ఇరాన్‌పై మరోసారి అమెరికా సైన్యం మెరుపుదాడులు చేసింది. హార్ముజ్ జలసంధిలో ఇరాన్ క్షిపణి, డ్రోన్ నిల్వ కేంద్రాలు, కోస్టల్ రాడార్ స్థావరాలపై యూఎస్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఎయిర్ స్ట్రైక్స్ చేపట్టింది. అయితే వాణిజ్య నౌకలపై ఇరాన్ డ్రోన్ దాడులే వల్లే తాము దాడి చేయాల్సొచ్చిందని అమెరికా చెప్పుకొచ్చింది.

Iran US conflict: పశ్చిమాసియాలో మధ్య మళ్లీ మొదలైన యుద్ధం.. ఇరాన్ స్థావరాలపై అమెరికా మెరుపు దాడులు!
Us Iran Peace Deal Broken

Updated on: Jun 27, 2026 | 8:04 AM

పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. గత వారమే రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందాలు జరగ్గా ఇప్పుడు మళ్లీ కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఏమిటంటే.. రెండు దేశాల మధ్య జరిగిన శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు చేయడమే అని తెలుస్తోంది. ఓమన్ తీరం వెంబడి ప్రయాణిస్తున్న సింగపూర్ కార్గో నౌక ‘ఎవర్ లవ్లీ’పై ఇరాన్ డ్రోన్ దాడులకు పాల్పడింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన అమెరికా ఇరాన్‌కు గట్టి గుణపాఠం చెప్పాలని డిసైడ్ అయింది. ఈ మేరకు ఇరాన్‌లోని రాడార్ స్థావరాలపై దాడులకు దిగింది.

ఇక వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడిని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సైతం తీవ్రంగా పరిగణించాడు. ఇరాన్ చర్య అత్యంత మూర్ఖత్వంతో కూడిన కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘన అంటూ ‘ట్రూత్ సోషల్’ వేదికగా ట్రంప్ మండి పడ్డాడు. ఇక ఈ దాడుల తర్వాత హార్ముజ్ జలసంధిలో హై అలర్ట్ నెలకొంది. వాణిజ్య నౌకల సురక్షిత ప్రయాణానికి రక్షణ కల్పిస్తూ, ఇరాన్‌తో జరిగిన ఒప్పందంలోని ప్రతి నిబంధన అమలు జరిగేలా US బలగాలు నిఘా పెంచాయి.

ఇదిలా ఉండగా అమెరికా దాడులు, ట్రంప్ ట్వీట్లపై అటు ఇరాన్ కూడా స్పందించింది. చర్చల మధ్యలోనే తమపై దాడులకు తెగబడటం ద్వారా యూఎస్ అధ్యక్షుడు శాంతి ఒప్పందాన్ని కాలరాశారని ఇరాన్ మండిపడింది. ఈ ఉల్లంఘన అమెరికాకే నష్టమని.. కాల్పుల విరమణ ఒప్పందాన్ని బేఖాతరు చేస్తూ అమెరికా చేసిన దుశ్చర్యకు ఆ దేశం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది.

ఇకపై బ్లేమ్ గేమ్ సాగదని.. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో సమీకరణాలు మారాయని, హార్ముజ్ జలసంధిపై పూర్తి నియంత్రణ తమదేనని ఇరాన్ స్పష్టం చేసింది. హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే ఓడలు తమ నిబంధనలను పాటించాలని, సురక్షిత మార్గాల ద్వారానే వెళ్లాలని పేర్కొంది. నియంత్రణను చూసి రెచ్చగొట్టొద్దు.. తమ భద్రతా చర్యలను ఉల్లంఘనగా భావిస్తే ఇరాన్ సాయుధ దళాలు బుద్ధి చెప్తాయని, ఇది సీజ్‌ఫైర్ ఉల్లంఘన కాదు.. ‘కాల్పుల విరమణ మేనేజ్‌మెంట్’ అంటూ ఇరాన్ ఘాటు వ్యాఖ్యలు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us