
ఓ వైపు శాంతి చర్చల ఒప్పందం జరుగుతుండగా… మరోవైపు రెండు దేశాలు మిస్సైల్స్‌తో ఒకరిపై మరొకరు విరుచుకుపడుతుండటం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీస్తోంది. ముందు మొదలుపెట్టింది మీరంటే… మీరంటూ ఇరాన్-అమెరికా దేశాలు ఒకరిపై మరొకరు దాడులకు దిగడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే.. అమెరికా, ఇరాన్‌లు మరోసారి కీలక నిర్ణయం తీసుకున్నాయి. పరస్పరం దాడులు ఆపేలా ఒప్పందానికి వచ్చాయి. అమెరికా , ఇరాన్‌లు ఒకరిపై ఒకరు దాడులను ఆపడానికి అంగీకరించాయని ఒక సీనియర్ అమెరికా అధికారి చెప్పినట్లు ఆక్సియోస్ నివేదిక పేర్కొంది. ఈ ప్రాంతం నుండి చమురు రవాణాకు కీలకమైన హోర్ముజ్ జలసంధిపై ఉన్న వివాదాన్ని పరిష్కరించుకోవడానికి, ఇరు పక్షాలు మంగళవారం (జూన్ 30, 2026) ఖతార్ రాజధాని దోహాలో సమావేశం కానున్నాయని ఆక్సియోస్ తెలిపింది. అయితే.. ఇది ఎంత వరకు నిజమన్నది.. ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది..
గతరెండు రోజులుగా పశ్చిమాసియాలో ఇటీవల చల్లారినట్లే కనిపించిన ఉద్రిక్తతలు మళ్లీ మొదటికి వచ్చేలా కనిపించింది. ఇరాన్‌పై అమెరికా వరుసగా రెండోరోజు దాడులకు దిగింది. ఇరాన్ దాడులు ఆపకపోవడంతో బదులుగా హర్మూజ్ జలసంధి సమీపంలోని టెహ్రాన్ లక్ష్యాలపై US బలగాలు దాడులకు దిగాయి. ఈ విషయాన్ని అమెరికా సెంట్రల్ కమాండ్ ‘ఎక్స్’ ద్వారా తెలిపింది. అధ్యక్షుడు ట్రంప్ డైరెక్షన్‌లో దాడులకు దిగినట్లు స్పష్టం చేసింది. ఇరాన్ నిఘా సదుపాయాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, గగనతల రక్షణ వ్యవస్థలు, డ్రోన్ల నిల్వల కేంద్రాలపై తమ యుద్ధ విమానాలు బాంబులు కురిపించినట్లు వెల్లడించింది. తొలుత ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కార్గో షిప్ ఎవర్ లవ్లీపై ఇరాన్ డ్రోన్ దాడి చేసిందని… దీంతో తాము కూడా బదులు తీర్చుకున్నట్టు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది.
అయితే కాల్పుల విరమణ ఉల్లంఘించకుండా ఉండేందుకు ఇరాన్‌కు అవకాశం ఇచ్చినా మళ్లీ ఆ దేశం దాడులు చేస్తోందని అమెరికా చెబుతోంది. రెండు మిలియన్ల బ్యారెళ్ల చమురుతో పనామా జెండాతో వెళుతున్న కికు ట్యాంకర్‌పై ఇరాన్ డ్రోన్ దాడి చేసినట్లు అమెరికా బలగాలు వెల్లడించాయి. దీంతో తాము కూడా దాడులు చేసినట్లు చెబుతోంది. అటు ఇరాన్ కూడా తగ్గేదేలే అన్నట్టు కనిపిస్తోంది. అమెరికానే పదేపదే కవ్విస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అమెరికా తగ్గితే తాము తగ్గుతామంటోంది ఇరాన్. అమెరికా, ఇరాన్ బలగాలు కీలకమైన ఈ సముద్ర మార్గంపై మరోసారి దాడులు చేసుకుంటున్న తరుణంలో.. హోర్ముజ్ జలసంధి గుండా తాము ప్రాధాన్యతనిచ్చే మార్గాన్ని తప్పించుకోవడానికి నౌకా రవాణా చేసే ఏ ప్రయత్నమైనా పశ్చిమ ఆసియాలో “ఉద్రిక్తతలను పెంచుతుందని” ఇరాన్ అగ్రశ్రేణి దౌత్యవేత్త ఆదివారం (జూన్ 28, 2026) హెచ్చరించారు.
ఇటు ఇరాన్ తీరుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి విరుచుకుపడ్డారు. ఇరాన్ తీరు మారకుంటే దాడులను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘిస్తోందన్నారు ట్రంప్. మొత్తంగా… ఎవరికి వాళ్లు అస్సలు తగ్గట్లేదు. ముందు మీరు దాడి చేశారంటే.. మీరే చేశారంటూ ఒకరిపై ఒకరు మిస్సైల్స్ కురిపించుకున్నారు. శాంతి ఒప్పందాలను సైతం లెక్కచేయట్లేదు. ఈ క్రమంలోనే.. మంగళవారం జరగనున్న శాంతి చర్చలు సఫలం అవుతాయో లేదో వేచి చూడాల్సి ఉంది.
ఇదిలా ఉండగా, శత్రుత్వాలను అంతం చేసే లక్ష్యంతో ఇజ్రాయెల్, లెబనాన్ దేశాలు ఒక ఒప్పందంపై సంతకాలు చేసిన రెండు రోజుల తర్వాత, దక్షిణ లెబనాన్‌లో జరిగిన పోరాటంలో ఒక సైనికుడు మరణించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ప్లాటూన్ కమాండర్ అయిన 21 ఏళ్ల కెప్టెన్ డేవిడ్ హజూట్, దక్షిణ లెబనాన్‌లో జరిగిన పోరాటంలో అమరుడయ్యాడని సైన్యం పేర్కొంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..