
మధ్యప్రాచ్యంలో పరిస్థితి మళ్లీ తీవ్రంగా మారుతోంది. అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఒక దశ దాటుతున్న వేళ, ఒమన్‌లో ఇరు దేశాల ప్రతినిధులు కీలక చర్చలు జరుపుతున్నారు. ఇవి ప్రత్యక్ష చర్చలు కాకపోయినా, యుద్ధాన్ని ఆపే చివరి ప్రయత్నంగా ఈ సమావేశాలను చూస్తున్నారు. ఒక చిన్న తప్పు జరిగితే పరిస్థితి పూర్తిగా చేయి దాటే ప్రమాదం ఉంది.
ఇటీవలి వారాల్లో అమెరికా మధ్య ప్రాచ్యంలో భారీగా సైనిక బలగాలను మోహరించింది. యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్లు, వేలాది సైనికులు ఇప్పటికే రంగంలోకి దిగారు. ఇది కేవలం ఒత్తిడి వ్యూహం కాదని, అవసరమైతే దాడికి సిద్ధమనే సంకేతంగా అమెరికా స్పష్టంగా చెబుతోంది. మరోవైపు ఇరాన్ కూడా దాడి జరిగితే తీవ్రంగా ప్రతీకారం తప్పదని హెచ్చరిస్తోంది.
ఈ సంక్షోభానికి బ్యాక్‌డ్రాప్‌గా ఇరాన్ లోపల పరిస్థితి మరింత ఉద్రిక్తంగా ఉంది. తీవ్రమైన ఆర్థిక సమస్యలు, నిరుద్యోగం, ధరల పెరుగుదలతో ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ఈ నిరసనలను భద్రతా బలగాలు కఠినంగా అణచివేశాయి. మానవ హక్కుల సంస్థల ప్రకారం వేలాది మంది మరణించారు. పదివేల మందికి పైగా అరెస్ట్ అయ్యారు. పాలక వ్యవస్థపై ప్రజల్లో అసంతృప్తి ఓపెన్‌గా బయటపడుతోంది.
ఇప్పుడీ మొత్తం వివాదంలో ప్రధాన అంశం మళ్లీ అణు కార్యక్రమమే. ఇరాన్ తన అణు కార్యక్రమం శాంతియుత అవసరాల కోసమేనని చెబుతోంది. కానీ అమెరికా, ఇజ్రాయెల్ మాత్రం దీనిని నమ్మడం లేదు. ప్రస్తుతం ఇరాన్ వద్ద ఉన్న అధిక శుద్ధి చేసిన యురేనియం నిల్వలు పెద్ద ఆందోళనగా మారాయి. ఇదే కారణంగా అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపేయాలని అమెరికా డిమాండ్ చేస్తోంది.
అమెరికా ఇక్కడితో ఆగడం లేదు. ఇరాన్ బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్, మధ్యప్రాచ్యంలో ఉన్న సాయుధ గ్రూపులకు మద్దతు, దేశంలో మానవ హక్కుల పరిస్థితి. ఇవన్నీ చర్చల్లో ఉండాలని చెబుతోంది. అయితే ఇరాన్ మాత్రం ఇవన్నీ తమ అంతర్గత భద్రతా అంశాలని, ఈ డిమాండ్లు అంగీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తోంది. ఒమన్ వేదికగా జరుగుతున్న ఈ చర్చల్లో ఇరు దేశాల వైఖరులు ఇప్పటికీ దూరంగానే ఉన్నాయి. అయినా కూడా ఈ సమావేశాలు పూర్తిగా విఫలమైతే యుద్ధ ముప్పు మరింత దగ్గర అవుతుంది. అందుకే మధ్యవర్తుల ప్రయత్నాలు కీలకంగా మారాయి. ఒమన్ ఇప్పటికే గతంలోనూ అమెరికా–ఇరాన్ మధ్య సున్నిత చర్చలకు వేదికగా నిలిచింది.
ఇరాన్ ప్రభుత్వం ఈ చర్చలను తమకు చివరి అవకాశం లాగా చూస్తోంది. ఆంక్షలు ఎత్తేస్తే ఆర్థికంగా కొంత ఊపిరి పీల్చుకునే అవకాశం ఉంటుంది. కానీ అదే సమయంలో ఎక్కువ రాయితీలు ఇస్తే దేశంలో రాజకీయంగా మరింత ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంది. బయట ఒత్తిడి, లోపల నిరసనలు – రెండింటి మధ్య ఇరాన్ చిక్కుకుపోయింది. అమెరికా వైపు చూస్తే, ట్రంప్ యుద్ధాన్ని కోరుకుంటున్నాడా అన్నదానిపై స్పష్టత లేదు. కానీ ఒత్తిడి పెంచి ఒక కఠిన ఒప్పందం సాధించాలనే ప్రయత్నంలో మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ చర్చలు ఫలిస్తే ట్రంప్‌కు డిప్లమాటిక్ విజయం అవుతుంది. విఫలమైతే సైనిక చర్య తప్పదనే సంకేతాలు ఇప్పటికే ఉన్నాయి.
మధ్యప్రాచ్య దేశాలు మాత్రం ఈ పరిణామాలను ఆందోళనతో చూస్తున్నాయి. అమెరికా దాడి జరిగితే అది ఇరాన్‌కే పరిమితం కాకుండా ప్రాంతం మొత్తం అస్తవ్యస్తం అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాయి. గగనతల దాడులతో మాత్రమే ఇరాన్ ప్రభుత్వాన్ని కూల్చడం సాధ్యం కాదన్నది అక్కడి దేశాల అంచనా. అందుకే ఒమన్‌లో జరుగుతున్న ఈ చర్చలు చాలా కీలకం. ఇవి విజయవంతమైతే యుద్ధం కొంతకాలం దూరమవుతుంది. ఫలితం లేకపోతే మాత్రం మధ్యప్రాచ్యం మరో పెద్ద సంక్షోభంలోకి జారిపోవడం ఖాయం. ఇప్పుడు అందరి చూపు ఒక్కటే – ఈ చర్చలు ఏ దిశగా వెళ్లబోతున్నాయో వేచి చూడాలి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..