అమెరికా-ఇరాన్ మధ్య 24 గంటల్లో శాంతి ఒప్పందం! పాక్ ప్రధాని సంచలన ప్రకటన

పశ్చిమాసియాలో మూడు నెలల ఉద్రిక్తతలకు ముగింపు పలికేలా అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం 24 గంటల్లో ఖరారయ్యే అవకాశం ఉందని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. చర్చలు తుది దశకు చేరగా, ఒప్పందంపై ఎలక్ట్రానిక్ సంతకాలు త్వరలో జరగనున్నాయి. మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి..

అమెరికా-ఇరాన్ మధ్య 24 గంటల్లో శాంతి ఒప్పందం! పాక్ ప్రధాని సంచలన ప్రకటన
Pakistan Pm And Donald Trum

Updated on: Jun 13, 2026 | 7:47 PM

పశ్చిమాసియాలో గత మూడు నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు త్వరలో ముగింపు పలికే అవకాశం కనిపిస్తోంది. అమెరికా–ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం మరో 24 గంటల్లో ఖరారయ్యే అవకాశముందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ సంచలన ప్రకటన చేశారు. అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు తుది దశకు చేరుకున్నాయని, ఒప్పందానికి సంబంధించిన తుది పాఠ్యంపై అంగీకారం కుదిరిందని ఆయన వెల్లడించారు. ఒప్పందం ఖరారైన వెంటనే ఎలక్ట్రానిక్ విధానంలో సంతకాలు జరిగేలా పాకిస్థాన్ ఏర్పాట్లు చేస్తోందని పేర్కొన్నారు.

శనివారం సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో చేసిన పోస్టులో షరీఫ్.. “శాంతి ఒప్పందానికి మేమెన్నడూ ఇంత దగ్గరగా రాలేదు. మరో 24 గంటల్లో ఒప్పందం పూర్తయ్యే అవకాశం ఉంది. అనంతరం ఎలక్ట్రానిక్ సంతకాలు, వచ్చే వారం సాంకేతిక స్థాయి చర్చలు జరుగుతాయి” అని తెలిపారు. ఈ చారిత్రక ఒప్పందం దీర్ఘకాలిక శాంతికి బలమైన పునాది వేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే చర్చల ప్రక్రియలో సహకరించిన అమెరికా, ఇరాన్ ప్రభుత్వాలతో పాటు ప్రాంతీయ దేశాలకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ ప్రకటనకు ఒక రోజు ముందు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. “ఇస్లామాబాద్ అవగాహనా ఒప్పందం ఇంతకుముందెన్నడూ లేనంత దగ్గరలో ఉంది. తుది ఒప్పందం పూర్తయ్యే వరకు మీడియా ఊహాగానాలకు దూరంగా ఉండాలి” అని ఆయన పేర్కొన్నారు. ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ అంశంపై ఆసక్తి చూపుతూ సంబంధిత పోస్టులను తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఒప్పందంపై అధికారిక సంతకాలు పూర్తయ్యే వరకు పూర్తి స్పష్టత రానప్పటికీ, అమెరికా–ఇరాన్ మధ్య శాంతి చర్చలు కీలక మలుపు తిరిగినట్లు అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే ప్రాంతీయ భద్రత, ఇంధన మార్కెట్లు మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా సానుకూల ప్రభావం పడే అవకాశం ఉంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us