
ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన అమెరికా-ఇరాన్ చర్చలు ఎటువంటి పురోగతి లేకుండానే ముగిశాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించడానికి జరిగిన ఈ చర్చలు విఫలమయ్యాయని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అధికారికంగా ప్రకటించారు. అమెరికా విధించిన షరతులకు ఇరాన్ తలొగ్గకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని ఆయన స్పష్టం చేశారు. గత కొన్ని రోజులుగా మధ్యప్రాచ్యంలో శాంతి నెలకొల్పేందుకు, హర్మూజ్ జలసంధి నియంత్రణ, అణు ఒప్పందం వంటి కీలక అంశాలపై ఇరు దేశాల ప్రతినిధుల మధ్య చర్చలు జరిగాయి. అయితే అమెరికా ప్రతిపాదించిన కఠినమైన నిబంధనలను అంగీకరించడానికి ఇరాన్ నిరాకరించింది.
ఇరాన్ తన అణు కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాలన్న అమెరికా షరతును ఇరాన్ వ్యతిరేకించింది. ముందుగా తమపై ఉన్న ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలని ఇరాన్ పట్టుబట్టగా, షరతులు పాటిస్తేనే ఆంక్షల తొలగింపు ఉంటుందని అమెరికా తేల్చి చెప్పింది. మధ్యప్రాచ్యంలోని ఇతర దేశాల వ్యవహారాల్లో ఇరాన్ జోక్యాన్ని తగ్గించుకోవాలన్న ప్రతిపాదనపై కూడా ఏకాభిప్రాయం కుదరలేదు.
ఈ చర్చల ఫలితంపై జేడీ వాన్స్ స్పందిస్తూ.. ‘‘మేము శాంతిని ఆకాంక్షించాం. కానీ అందుకు ఇరాన్ సిద్ధంగా లేదు. కానీ మా దేశ ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. ఇరాన్ మా షరతులను అంగీకరించడం లేదు. అందుకే చర్చల కోసం వెళ్లిన తమ తిరిగి అమెరికా వెళ్తున్నాం’’ అని తెలిపారు. ఇరాన్ మొండి వైఖరి వల్లే చర్చలు కొలిక్కి రాలేదని ఆయన ఆరోపించారు. అణ్వాయుధాల తయారీని పూర్తిగా నిలిపివేయాలన్న తమ షరతును ఇరాన్ ఒప్పుకోలేదని, ఈ ఒప్పందం కుదరకపోవడం అమెరికా కంటే ఇరాన్‌కే ఎక్కువ నష్టమని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు ట్రంప్ చర్చలతో సంబంధం లేకుండా హర్మూజ్ జలసంధిని ఓపెన్ చేసి తీరుతామని స్పష్టం చేశారు.
అమెరికా చేస్తున్న ఆమోదంయోగ్యం కాని డిమాండ్ల వల్లే చర్చలు అసంపూర్తిగా ముగిశాయని ఇరాన్ ప్రకటించింది. తమ దేశ ప్రయోజనాలను కాపాడేందుకు తమ బృందం 21 గంటల పాటు నిరంతరాయంగా చర్చలు జరిపినప్పటికీ, అమెరికా మొండి వైఖరి వల్ల ఫలితం లేకుండా పోయిందని ఆరోపించింది. తమ అణు హక్కులను వదులుకోబోమని, అలాగే హర్మూజ్ జలసంధిపై నియంత్రణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఇరాన్ స్పష్టం చేసింది.
ఈ చర్చల వైఫల్యంతో మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. అగ్రరాజ్యం ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటుందో అన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో ముడి చమురు ధరలపై, అంతర్జాతీయ మార్కెట్లపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.