డొనాల్డ్ ట్రంప్ వర్సెస్ కమలా హ్యారిస్.. ఇద్దరి నేతల మధ్య హోరాహోరీ మాటల యుద్ధం 90 నిమిషాల పాటు సుధీర్ఘంగా కొనసాగింది.. మొదటిసారి లైవ్ డిబేట్‌లో ఇద్దరు నాయకుల మధ్య హోరాహోరిగా పలు విషయాలపై చర్చ జరిగింది. షేక్ హ్యాండ్‌తో మొదలైన చర్చ పరుషపదజాలం వరకు వెళ్లింది. మైక్ కట్ చేసిన తర్వాత కూడా ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.. కమలా హ్యారిస్ తనదైన శైలిలో తటస్థ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. గాజా, ఉక్రెయిన్, అబార్షన్, వలస చట్టాలపై పరస్పర ఆరోపణలు జరిగాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5న జరగనున్నాయి. సరిగ్గా ఎన్నికలు జరిగే ఎనిమిది వారాలకు ముందు ప్రధాన పార్టీల అభ్యర్థులిద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. డొనాల్డ్ ట్రంప్, కమలా హ్యారిస్ మధ్య మొదటి ప్రత్యక్ష చర్చ పెన్సిల్వేనియా రాష్ట్రంలోని ఫిలాడెల్ఫియాలో ABC ద్వారా జరిగింది. విదేశాంగ విధానం, అబార్షన్, ఎన్నికల విశ్వసనీయతపై ట్రంప్ ప్రశ్నలకు కమలా హ్యారిస్ దీటుగా సమాధానం చెప్పారు. అదే సమయంలో అమెరికాకు పెరుగుతున్న వలసలపై ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. గాజా, ఉక్రెయిన్, అబార్షన్, వలస చట్టాలపై ట్రంప్, హ్యారిస్ పరస్పర ఆరోపణలు చేసుకున్నారు.
కమలా హ్యారిస్, జో బైడెన్ మధ్య విధానపరంగా ఎటువంటి తేడా లేదని, కమలా హ్యారిస్ బైడెనేనని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చర్చ సందర్భంగా ఆరోపించారు. బైడెన్ అంటే ఎవరి తెలియదని చెప్పేందుకు ఆమె ప్రయత్నిస్తోందని విమర్శించారు. వారి పాలనలో ఆర్థిక వ్యవస్థ దారుణమైన పరిస్థితిని ఎదుర్కొనేందుకు, ద్రవ్యోల్బణం హీనస్థితికి చేరుకుందని ట్రంప్ మండిపడ్డారు. ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం ఆగాలని తాను కోరుకుంటున్నానని ట్రంప్ ప్రకటించారు. నాటోతో తాను వ్యవహరించినట్టు వ్యవహరించే ధైర్యం బైడన్‌కు, కమలకు లేదని ట్రంప్ విమర్శించారు.
తాను జో బైడన్ కాదు, కచ్చితంగా డొనాల్డ్ ట్రంప్ లాంటి వ్యక్తిని కాదని కమలా హ్యారిస్ స్పష్టం చేశారు. దేశానికి కొత్త తరపు నాయకత్వాన్ని తానందిస్తానని ప్రకటించారు. వాస్తవాలు నమ్మడం, ఆశాభావం కల్పించడం చేస్తానని తెలిపారు. అమెరికా ప్రజలను అగౌరవపరిచే చర్యలు తాను చేపట్టనని కమలా హ్యారిస్ హామీ ఇచ్చారు. జాతీయ, భద్రత, విదేశాంగ విధానాలపరంగా ట్రంప్ చాలా బలహీనమైన వ్యక్తని కమల విమర్శించారు. పొగడ్తలకు పడిపోతారని, ఆయన చుట్టు భజనపరులుంటారని అన్నారు.
జాతి గురించి ట్రంప్ సంధించిన ప్రశ్నలకు చాలా వరకు కమలా హ్యారిస్ నేరుగా సమాధానం చెప్పలేదు. జాతి వివక్ష విషయంలో ట్రంప్ చరిత్ర గురించి చాలా విషయాలు బయటపెట్టారు. అదే సమయంలో ఆఫ్గానిస్థాన్ పరిస్థితులు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించి ట్రంప్ చాలా విషయాలు మాట్లాడారు. ఆఫ్గన్ నుంచి సైన్యాన్ని ఉపసంహరించడం ద్వారా రోజు మూడొందల మిలియన్ డాలర్లు ఆదా చేయగలుగుతున్నామని హ్యారిస్ వివరించారు. తటస్థ ఓటర్లను ఆకట్టుకునేందుకు కమల ప్రయత్నించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..