40 ట్రిలియన్ డాలర్లను దాటేసిన అమెరికా జాతీయ అప్పు

మునుపెన్నడూ లేని విధంగా అమెరికా అప్పు 40 ట్రిలియన్ డాలర్లు అంటే రూ 3,320 లక్షల కోట్లు దాటింది. గడిచిన ఐదు నెలల్లోనే రూ 95 లక్షల కోట్ల విలువైన అప్పులు తీసుకుందని ఆర్గనైజేషన్​ ఫర్​ ఎకనమిక్​ కార్పొరేషన్ ​అండ్​ డెవలప్​మెంట్​ రిపోర్ట్ ​తెలిపింది. అభివృద్ధి చెందిన దేశాల్లో అమెరికా ఆర్థిక స్థితి అత్యంత బలహీనంగా ఉందని బాంబు పేల్చింది.

40 ట్రిలియన్ డాలర్లను దాటేసిన అమెరికా జాతీయ అప్పు
Us Debt Crosses $40 Trillion Mark!

Updated on: Aug 21, 2026 | 11:02 AM

అమెరికా ఆర్థిక వ్యవస్థ డేంజర్ బెల్స్‌ మోగిస్తోంది. దేశ రుణభారం తాజాగా 40 ట్రిలియన్ డాలర్ల రికార్డు స్థాయిని దాటింది. ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఒత్తిడిని ఇది సూచిస్తోంది. పెరుగుతున్న రక్షణ ఖర్చులు, సోషల్ సెక్యూరిటీ, మెడికేర్‌ ఇతర సంక్షేమ పథకాలకు చేస్తున్న భారీ కేటాయింపులు, లోటు బడ్జెట్‌పై వడ్డీల కారణంగా అప్పుల భారం అనూహ్యంగా పెరిగిపోతోంది. అభివృద్ధి చెందిన దేశాల్లో అమెరికా ఆర్థిక స్థితి అత్యంత బలహీనంగా ఉందని ఆర్గనైజేషన్​ ఫర్​ ఎకనమిక్​ కార్పొరేషన్ ​అండ్​ డెవలప్​మెంట్​ నివేదిక బాంబు పేల్చింది.

ఇక ఆందోళన కలిగిస్తోన్న మరో అంశం అప్పుల వేగం పెరగడం. ఐదు నెలల క్రితం మార్చిలో అమెరికా అప్పు 39 ట్రిలియన్ డాలర్లు, అంతకుముందు ఐదు నెలల క్రితం అక్టోబర్‌లో 38 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. ప్రతి ఐదు నెలలకు ఒక ట్రిలియన్ డాలర్ల చొప్పున అప్పు పెరగడం ప్రమాదకర పరిస్థితికి అద్దం పడుతోంది. ఒకవైపు ఆరు నెలలుగా ఇరాన్‌తో చేస్తున్న యుద్ధానికి రక్షణ వ్యయాన్ని పెంచుతూ పోతోంది ట్రంప్‌ ప్రభుత్వం. మరోవైపు గ్యాస్, నిత్యావసరాల ధరలను తగ్గించేందుకు ప్రయత్నించడం ఈ పరిస్థితికి కారణంగా తెలుస్తున్నాయి. అనవసర ఖర్చులను తగ్గించి, ఆర్థిక వృద్ధి వేగం అయ్యేలా చేయడం ద్వారా అప్పు- జీడీపీ నిష్పత్తి పరిధి దాటకుండా చూసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని వైట్ హౌస్ ప్రతినిధి కుష్ దేశాయ్ అన్నారు.

అయితే, పెరుగుతున్న అప్పుల ప్రభావం ఇప్పటికే అమెరికన్ల జీవితాలపై పడుతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. గృహ, వాహన రుణాలపై వడ్డీ రేట్లు పెరగడం, వ్యాపార సంస్థలలో పెట్టుబడులు తగ్గినందువల్ల జీతాలు తగ్గడం, వస్తు సేవల ధరలు పెరగడం వంటివి జరుగుతున్నాయి. “ప్రస్తుత ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం నిలకడలేకుండా ఉంది. ప్రపంచ యుద్ధం వంటి ఏదైనా ఊహించని ఘటన జరిగితే, ఈ సవాలు సంక్షోభంగా మారే ప్రమాదం ఉంది” అని బైపార్టిసన్ పాలసీ సెంటర్ అధ్యక్షురాలు మార్గరెట్ స్పెల్లింగ్స్ హెచ్చరించారు.

ట్రెజరీ బాండ్ల ఆదాయాలు దశాబ్దాల గరిష్ట స్థాయిని తాకడంతో వడ్డీ భారం విపరీతంగా పెరిగిపోతోంది. ఏటా రూ. 83 లక్షల కోట్లు వడ్డీల చెల్లింపులకే వెళుతోంది. అయితే, 40 ట్రిలియన్ డాలర్ల అప్పు సమస్య కాదని కొందరు ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఎకానమీ బలంగా ఉండటం ఒక కారణమైతే, గ్లోబల్ రిజర్వ్ కరెన్సీగా డాలర్ తన హోదా కొనసాగిస్తుండటం వల్ల అమెరికాకు ఎక్కువ అప్పులు తీసుకునే సామర్థ్యం ఉందని తెలియచేస్తున్నారు. ప్రస్తుతం అమెరికా రుణ పరిమితి 41.1 ట్రిలియన్ డాలర్లు. ఈ పరిమితికి 2027 నాటికి చేరుకునే అవకాశం ఉందని, అప్పుడు కాంగ్రెస్ దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు అంటున్నారు. అమెరికా ప్రత్యర్థి చైనాకు రూ.690.47 లక్షల కోట్లు, ఇండియాకు రూ.200.53 లక్షల కోట్లు అప్పు ఉన్నట్లుగా అంచనా వేశారు.

Loading...
Unable to load recommendations.
Follow Us