
అమెరికా, ఇరాన్‌ల మధ్య అధికారికంగా కాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మాత్రం పూర్తిగా అదుపులోకి రాలేదు. శాంతి చర్చలు ఒకవైపు కొనసాగుతుండగానే, మరోవైపు వ్యూహాత్మక ప్రాంతాల్లో సైనిక ఘర్షణలు చోటుచేసుకోవడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. తాజా పరిణామాల ప్రకారం, సోమవారం (మే 25) నాడు అమెరికా దళాలు దక్షిణ ఇరాన్‌లోని హోర్ముజ్ జలసంధి పరిసర ప్రాంతాలే లక్ష్యంగా భారీ దాడులు జరిపాయి. ఇరాన్‌కు చెందిన క్షిపణి ప్రయోగ స్థావరాలు, సైనిక నౌకలపై అమెరికా సైన్యం విరుచుకుపడింది.
ఈ దాడులపై యూఎస్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) ప్రతినిధి తిమోతి హాకిన్స్ కీలక ప్రకటన చేశారు. ఈ చర్య పూర్తిగా ఆత్మరక్షణలో భాగంగానే తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. దక్షిణ ఇరాన్ పరిసరాల్లో ఉన్న ఇరాన్ దళాల నుండి అమెరికా సైనికులకు తీవ్రమైన ముప్పు పొంచి ఉందని, అందుకే ఈ ఆపరేషన్ చేపట్టాల్సి వచ్చిందని తెలిపారు. అమెరికా నౌకాదళాన్ని దెబ్బతీసేందుకు క్షిపణులను సిద్ధం చేసిన ప్రదేశాలను, అలాగే సముద్ర మార్గంలో మందుపాతరలు వేయడానికి ప్రయత్నిస్తున్న ఇరాన్ నౌకలను తాము విజయవంతంగా లక్ష్యంగా చేసుకున్నట్లు ఆయన వివరించారు. కాల్పుల విరమణ ఉన్నప్పటికీ, తమ సైనికుల రక్షణ విషయంలో రాజీ పడేది లేదని అమెరికా తేల్చి చెప్పింది.
నిజానికి కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత కూడా ఇరు దేశాల మధ్య ఘర్షణలు జరగడం ఇది మొదటిసారి కాదు. మే నెల ప్రారంభంలోనే హోర్ముజ్ జలసంధి గుండా వెళుతున్న అమెరికా యుద్ధనౌకలపై ఇరాన్ బలగాలు ఎలాంటి ఉసిగొల్పుడు లేకుండానే క్షిపణులు, డ్రోన్లు, చిన్న పడవలతో దాడులు చేశాయని అమెరికా ఆరోపించింది. ఈ రెచ్చగొట్టే చర్యల నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ సైనిక స్థావరాలపై ప్రతీకార దాడులు చేయడానికి సైన్యానికి పూర్తి అధికారాలు ఇచ్చారు.
ఈ సైనిక ఘర్షణల మధ్యే ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ తన వద్ద ఉన్న అత్యంత సుసంపన్నమైన యురేనియంను వెంటనే వదులుకోవాలని డిమాండ్ చేశారు.ఇరాన్ తన వద్ద ఉన్న దాదాపు 1,000 పౌండ్ల (సుమారు 453 కిలోగ్రాముల) సుసంపన్నమైన యురేనియంను అమెరికాకు అప్పగించడమో లేదా పూర్తిగా నాశనం చేయడమో చేయాలని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ యురేనియం నిర్వీర్యం చేసే ప్రక్రియను అంతర్జాతీయ అణుశక్తి కమిషన్ లేదా అలాంటి నిష్పాక్షిక సంస్థ పర్యవేక్షిస్తుందని తన ‘ట్రూత్ సోషల్’ ఖాతాలో ట్రంప్ పేర్కొన్నారు. మరోవైపు, అమెరికా అధికారులు ప్రస్తుతం ఇరాన్ విషయంలో నో డస్ట్.. నో డాలర్ అనే కఠిన విధానాన్ని అవలంబిస్తున్నారు. అంటే, ఇరాన్ తన వద్ద ఉన్న సుసంపన్నమైన యురేనియంను పూర్తిగా తొలగించే వరకు, ఆ దేశానికి ఎలాంటి ఆర్థిక ఉపశమనం లేదా ఒప్పంద ప్రయోజనాలు దక్కవని అమెరికా తెగేసి చెప్పింది.
ఒకవైపు దౌత్యపరమైన చర్చలు జరుగుతున్నా, క్షేత్రస్థాయిలో దాడులు మరియు అణు నిబంధనలపై ట్రంప్ విధిస్తున్న కఠిన షరతులు చూస్తుంటే, అమెరికా-ఇరాన్ మధ్య సంపూర్ణ శాంతి స్థాపన అంత సులువు కాదని స్పష్టమవుతోంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..