UKRAINE-RUSSIA CONFLICT: ఉక్రెయిన్, రష్యా యుద్దంలో అనూహ్య మలుపు.. అదే జరిగితే అణ్వస్త్ర దాడులు చేస్తామన్న రష్యా.. తగ్గేదేలే అంటున్న ఫిన్‌లాండ్, స్వీడెన్

|

May 18, 2022 | 6:35 PM

పెద్ద సంఖ్యలో రష్యన్ సైనికులు మరణించారు. వందల సంఖ్యలో యుద్ద ట్యాంకర్లు ధ్వంసమయ్యాయి. అయితేనే అటు రష్యా, ఇటు ఉక్రెయిన్ తగ్గేదేలే అన్నట్లుగా దూకుడు ప్రదర్శిస్తూనే వున్నాయి. అసలీ యుద్ధానికి అంతమెప్పుడు అని ఎవరైనా అడిగితే ఏమీ చెప్పలేని పరిస్థితి. యుద్దంలో విజేత ఎవరు అన్న దానికి కూడా ఇప్పుడప్పుడే సమాధానం లభించేలా లేదు. కానీ తాజాగా...

UKRAINE-RUSSIA CONFLICT: ఉక్రెయిన్, రష్యా యుద్దంలో అనూహ్య మలుపు.. అదే జరిగితే అణ్వస్త్ర దాడులు చేస్తామన్న రష్యా.. తగ్గేదేలే అంటున్న ఫిన్‌లాండ్, స్వీడెన్
UKRAINE-RUSSIA CONFLICT
Follow us on

UKRAINE-RUSSIA CONFLICT INTENSIFYING FURTHER NUCLEAR ATTACKS BY RUSSIA:  దాదాపు మూడు నెలల క్రితం ఉక్రెయిన్‌పై పట్టు సాధించేందుకు రష్యా ప్రారంభించిన ప్రత్యేక సైనిక చర్య కొత్త మలుపులు తీసుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 24న ప్రారంభమైన రష్యా సైనిక చర్య నాలుగైదు రోజులో లేదా పది రోజుల్లో ముగుస్తుందని అంతా అనుకున్నారు. రష్యాతో పోలిస్తే పెద్దగా సైనిక, ఆయుధ సంపత్తి లేని ఉక్రెయిన్ .. పుతిన్(Vladimir Putin) సేనలను ఎంతో కాలం ప్రతిఘటించలేదని అంతా భావించారు. కానీ తమ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు ప్రతీ సైనికుడు అంకిత భావంతో రంగంలోకి దిగడంతో ఉక్రెయిన్ తమకున్న పరిమిత ఆయుధాలతోనే రష్యన్ దళాలను ఎదుర్కొంది. ఆ తర్వాత నాటో(NATO) దేశాల నుంచి ఆయుధ సరఫరా కూడా జరగడంతో ఉక్రెయిన్, పుతిన్ సేనలను సుదీర్ఘకాలం అడ్డుకుంటూ వస్తోంది. రెచ్చిపోయిన రష్యన్ దళాలు.. ఉక్రెయిన్ దేశంలోని ప్రధాన నగరాలను ధ్వంసం చేశాయి. మరియుపోల్(Mariupol), ఒడెస్సా(Odesa), ఖార్ఖీవ్ వంటి ప్రధాన నగరాలు దారుణంగా ధ్వంసమయ్యాయి. రాజధాని కీవ్‌(Kyiv)తోపాటు పశ్చిమాన పోలండ్ సరిహద్దుకు చేరువలో వున్న ఎల్వీవ్ Lviv సిటీలలో సైతం రష్యన్ దళాలు విధ్వంసం సృష్టించాయి. ఫిబ్రవరి 24న ప్రారంభమైన రష్యా సైనిక చర్య.. మే 18 నాటికి 85 రోజుకు చేరింది. ఇప్పటికీ రష్యన్ దళాలు ఉక్రెయిన్‌పై పట్టు సాధించలేదు. అమెరికా(America) సహా నాటో దేశాలు పంపిన యాంటి ట్యాంకర్ మిస్సైళ్ళతో ఉక్రెయిన్ బలగాలు రష్యన్ దళాలను ధీటుగా ఎదుర్కొన్నాయి. వందల సంఖ్యలో రష్యన్ యుద్ద ట్యాంకర్లను స్టింగర్, జావెలిన్ వంటి యాంటి ట్యాంకర్ మిస్సైళ్ళతో పేల్చి వేశారు ఉక్రెయిన్ సైనికులు. ఈ యుద్ధంలో ఉక్రెయిన్ విధ్వంసమైంది. ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి రెండు, మూడు దశాబ్ధాలు పట్టినా ఆశ్చర్యపోక తప్పని పరిస్థితి. కానీ పెద్ద సంఖ్యలో రష్యన్ సైనికులు మరణించారు. వందల సంఖ్యలో యుద్ద ట్యాంకర్లు ధ్వంసమయ్యాయి. అయితేనే అటు రష్యా, ఇటు ఉక్రెయిన్ తగ్గేదేలే అన్నట్లుగా దూకుడు ప్రదర్శిస్తూనే వున్నాయి. అసలీ యుద్ధానికి అంతమెప్పుడు అని ఎవరైనా అడిగితే ఏమీ చెప్పలేని పరిస్థితి. యుద్దంలో విజేత ఎవరు అన్న దానికి కూడా ఇప్పుడప్పుడే సమాధానం లభించేలా లేదు. కానీ తాజాగా ఉక్రెయిన్ యుద్ధంలోకి నాటో దళాలు నేరుగా ఎంటరవుతున్నాయని ఓ వార్త.. ఉక్రెయిన్ దేశం నాటోలో చేరడాన్ని రష్యా వ్యతిరేకించిన నేపథ్యంలో ఫిన్‌లాండ్(Finland), స్వీడెన్(Sweden) వంటి బాల్టిక్ దేశాలు కూడా నాటోలో చేరేందుకు రెడీ అవుతున్నాయంటూ మరో వార్త ఉక్రెయిన్, రష్యా యుద్ధాన్ని మరో లెవెల్‌కి తీసుకు వెళ్ళే సంకేతాలను సూచిస్తున్నాయి.

ఉక్రెయిన్ ప్రతిఘటన ప్రారంభించినపుడు తమకు అండగా నాటో దళాలు వస్తాయని అనుకుంది. కానీ తమ కూటమిలో సభ్య దేశం కాకపోవడంలో నాటో దళాలు ఉక్రెయిన్ తరపున యుద్దరంగంలోకి దిగలేదు. కానీ యుద్దం ప్రారంభమైన వారం, పది రోజుల్లోనే పోలండ్ Poland గుండా అమెరికా, యుకే UK వంటి దేశాలు ఆయుధాలను సరఫరా చేయడం మొదలుపెట్టాయి. బల్గేరియా Bulgariaలో చాన్నాళ్ళు యుద్ద విన్యాసాలను చేసిన అమెరికా, నాటో దేశాల ఎయిర్ ఫోర్స్.. అక్కడ్నించే ఉక్రెయిన్‌కు ఆయుధాలను సరఫరా చేశాయి. అమెరికా తన వద్ద వున్న 9 వేల స్టింగర్, జావెలిన్ యాంటి ట్యాంకర్ మిస్సైళ్ళలో 5 వేల వరకు ఉక్రెయిన్‌కు తరలించింది. ఇందుకోసం యుద్ధనౌకలను వినియోగించింది.  దాంతో పెద్ద ఎత్తున వచ్చిన రష్యన్ యుద్ద ట్యాంకులను యాంటి ట్యాంకర్ మిస్సళ్ళతో ఉక్రెయిన్ దళాలు పేల్చి వేశాయి. యుద్ద ట్యాంకులను పేల్చి వేయడం వల్లనే కీవ్ నగరం నుంచి రష్యన్ బలగాలు ఈస్ట్ ఉక్రెయిన్ ప్రాంతానికి వెళ్ళిపోయాయి. అయితే యుద్ధానికి ఎలా ముగింపు పలకాలో రష్యాకు అంతుచిక్కనట్లు కనిపిస్తోంది. ఈస్టర్న్ ఉక్రెయిన్‌ను హస్తగతం చేసుకోవడం ద్వారా ఉక్రెయిన్, రష్యాల మధ్య ఓ బఫర్ జోన్ ఏర్పాటు చేసుకోవాలన్నది పుతిన్ వ్యూహమని నిన్న మొన్నటి వరకు పలువురు భావించారు. కానీ మరియుపోల్ సమీపంలోని స్టీల్ ప్లాంట్‌పై రష్యా పట్టు కోల్పోవడం, అక్కడ తలదాచుకున్న ఉక్రెయిన్ సైనికులు 260 మంది అక్కడ్నించి సురక్షితంగా బయటపడడంతో పరిస్థితిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరియుపోల్ నుంచి డాన్ బాస్ Don Boss ఏరియా దాకా తూర్పు ఉక్రెయిన్ అసలు రష్యా ఆధీనంలో వుందా ? ఈ విషయంలో రష్యా చేసిన ప్రకటనలు ప్రచారార్భాటమేనా ? అన్న సందేహాలు ఇపుడు బలపడుతున్నాయి. మరియుపోల్‌లో సైనిక చర్య ముగిసిందని రష్యా బదులుగా ఉక్రెయిన్ ప్రకటించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇన్నాళ్ళు ఈస్ట్ ఉక్రెయిన్‌పై తమకే పట్టుందంటూ రష్యా చేసిన ప్రకటనలు డొల్లవేనని తాజాగా అనిపిస్తోంది. ఇదిలా కొనసాగుతుండగా.. ఉక్రెయిన్ యుద్దంలోకి నాటో బలగాలు నేరుగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. తమ సభ్య దేశం కాకపోయినప్పటికీ.. సభ్యత్వం కోసం ఇదివరకే దరఖాస్తు చేసుకున్న ఉక్రెయిన్‌కు అండగా వుండేందుకు, రష్యన్ బలగాలను తరిమిగి కొట్టేందుకు నాటో ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. నాటో దేశాల సైనిక సామర్థ్యంతో పోటిస్తే రష్యా సైనిక సంపత్తి దాదాపు మూడో వంతు మాత్రమే వుంటుంది. కానీ అణ్వాయుధాల విషయంలో నాటో దేశాలన్నింటి దగ్గర వున్న అణ్వస్త్రాలను కలిపినా రష్యా దగ్గరున్న వాటికంటే తక్కువే. అంటే నాటో బలగాలు ఉక్రెయిన్ తరపున పోరుకు దిగితే.. రష్యా తప్పనిసరైన పరిస్థితిలో అణ్వాయుధాలను ప్రయోగించక తప్పదు. పరాజయ పరాభవాన్ని తప్పించుకునేందుకైనా పుతిన్ Putin న్యూక్లియర్ వెపన్స్ వినియోగానికి సిద్దం కావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంటే నాటో దళాలు రంగంలోకి దిగితే అది ప్రపంచ నాశనానికి దారితీసే ప్రమాదం ఎక్కువే. ప్రస్తుతం రష్యన్‌ ఆర్మీని ఉక్రెయిన్‌ దళాలు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి.. మరోవైపు లిథువేనియాలోని నాటో ఎయిర్‌బేస్‌లో నాటో దళాలు యుద్ధ విన్యాసాలు చేస్తున్నాయి. లిథువేనియాలోని నాటో ఎయిర్‌బేస్‌లో అధునాతన హెలిక్యాప్టర్లు, యుద్ధ శకటాలను నాటో దేశాలు మోహరించాయి. రష్యా, బెలారస్‌ సరిహద్దులకు సమీపంలో యుద్ధ విన్యాసాలు కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్‌ సైన్యానికి అండగా నిలిచిన నాటో కూటమి లిథువేనియాలో రుక్లాలో అత్యాధునిక యుద్ధ ట్యాంకర్లను రంగంలోకి దింపింది. శతాబ్దాల సైనిక తటస్థ వైఖరికి స్వస్తి పలుకుతూ స్వీడన్‌ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. నాటోలో చేరనున్నట్లు ప్రకటించింది. సహచర నార్డిక్‌ దేశం ఫిన్‌లాండ్ నాటోలో చేరుతున్నట్లు ప్రకటించిన మరుసటి రోజే స్వీడన్‌ తన నిర్ణయాన్ని వెల్లడించింది. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణతో ఫిన్‌లాండ్, స్వీడన్‌ ఆందోళన చెందుతున్నాయి. రష్యాతో ఫిన్లాండ్‌కు 1,340 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. స్వీడన్‌కు సరిహద్దు లేకున్నా.. ఎప్పటికైనా ముప్పు తప్పదని భావిస్తోంది. అందుకే నాటోలో చేరాలని డిసైడ్‌ అయింది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఫిన్‌లాండ్, స్వీడన్‌ నాటోలో చేరడంపై ఆగ్రహంతో ఉన్నారు. నాటో విస్తరణ ప్రపంచానికి, ముఖ్యంగా రష్యాకు సమస్యాత్మకంగా మారుతుందని పుతిన్ భావిస్తున్నారు. మీది ఘోర తప్పిదం. మీ భద్రత ఏమీ బలోపేతం కాదంటూ రష్యా విదేశాంగ శాఖ డిప్యూటీ మంత్రి సెర్గీ ర్యాబ్కోవ్‌ ఫిన్‌లాండ్, స్వీడన్‌పై విరుచుకుపడ్డారు. దీర్ఘకాల పరిణామాలు ఉంటాయని స్పష్టం చేశారు. వదిలేస్తామని అనుకోవద్దని, తగిన చర్యలుంటాయని హెచ్చరించారు. మరోవైపు రష్యా అణుదాడులకు తెగబడొచ్చనే భయంతో ఫిన్‌లాండ్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 500 పైగా బంకర్లు నిర్మిస్తోంది. సకల వసతులతో భూమికి 25 మీటర్ల లోతున బంకర్ల నిర్మాణం చేపట్టింది. అణు దాడులకు చెక్కుచెదరనంత ధృఢంగా బంకర్లు నిర్మిస్తుంది. నగరం జనాభా 9 లక్షలమంది అవసరమైతే కొన్ని వారాలపాటు తలదాచుకునే సౌకర్యాలు ఏర్పాటు చేస్తోంది. రెండో ప్రపంచ యుద్ధం అనుభవంతో.. 1960లో కొన్నింటిని నిర్మించగా తర్వాత మెరుగుపరుస్తూ వచ్చారు. ఇప్పుడు నాటోలో చేరుతున్న ఫిన్‌లాండ్.. అవసరమైతే యూరప్‌ సరిహద్దులకు అణు సామగ్రి తరలిస్తామని రష్యా హెచ్చరించిన నేపథ్యంలో అప్రమత్తం అవుతోంది. ఏం జరిగినా ఎదుర్కొనేలా బంకర్లను సంసిద్ధం చేస్తోంది. ఇక ఫిన్‌లాండ్, స్వీడన్‌..నాటోలో చేరికపై టర్కీ అడ్డుపుల్లలు వేస్తోంది. వాటిని భాగస్వాములుగా చేసుకోవడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. 30 దేశాల నాటోలో టర్కీ కూడా ఒకటి. ఏదైనా కొత్త దేశం చేరాలంటే అన్ని దేశాల అంగీకారం తప్పనిసరి. ఇదే పాయింట్‌ను టర్కీ ఉపయోగించుకుంటుంది. తమ దేశానికి ప్రమాదకరంగా మారిన కుర్దిష్‌, ఇతర ఉగ్రవాద సంస్థలకు ఫిన్‌లాండ్, స్వీడన్‌ మద్దతిస్తున్నాయని, వాటికి నాటో సభ్యత్వం ఇవ్వొద్దని టర్కీ డిమాండ్‌ చేస్తోంది. అంతేకాక, ఆ రెండు దేశాలు తమపై సైనిక ఆంక్షలను విధించాయని.. అలాంటప్పుడు సైనిక కూటమిలో ఎలా చేర్చుకుంటారని టర్కీ ప్రశ్నిస్తోంది. అయితే, కుర్దీష్‌లకు ఆశ్రయం ఇవ్వకుండా, తమ ఎగుమతులపై ఆంక్షలను ఎత్తివేస్తే టర్కీ.. ఫిన్‌లాండ్, స్వీడన్‌ల నాటో సభ్యత్వం పై అభ్యంతరాలను వెనక్కు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ దిశగానే టర్కీ విదేశాంగ మంత్రి వ్యాఖ్యలు చేశారు. అయితే ఫిన్‌లాండ్, స్వీడన్‌ నాటోలో సభ్యత్వానికి ప్రయత్నిస్తున్న వేళ నాటోలోని కీలక దేశం టర్కీ ఎదురు తిరగడం ఆసక్తిని రేపుతోంది. ప్రస్తుతం నాటో వర్సెస్‌ రష్యా మారిన పరిస్థితుల్లో టర్కీ వ్యవహారం రష్యాకు నైతికంగా బలం చేకూర్చనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, టర్కీని ఒప్పించేందుకు స్వీడన్‌ రక్షణ మంత్రి ఆ దేశానికి వెళ్లనున్నారు. మరోవైపు ఫిన్‌లాండ్, స్వీడన్‌ చేరికకు అమెరికా, కెనడా, బ్రిటన్‌ సంపూర్ణ మద్దతు తెలిపాయి. ఈ నేపథ్యంలో టర్కీని ఎలా బుజ్జగిస్తారు.. ఎలాంటి హామీలిస్తారనే అంశం ఆసక్తిగా మారింది.

ఇక ఇక్కడ చర్చించుకోవాల్సిన మరో అంశం.. ఫిన్‌లాండ్, స్వీడెన్ దేశాల నిర్ణయం. నాటో విస్తరణను రష్యా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తరుణంలో ఆ దేశంతో 1340 కిలో మీటర్ల సరిహద్దును పంచుకుంటున్న ఫిన్‌లాండ్ నాటో ఎంట్రీకి సిద్దమవడం పుతిన్‌కు షాకిచ్చే అంశమే. రెండు దేశాలు (ఫిన్‌లాండ్, స్వీడెన్) నాటో ఎంట్రీకి సిద్దమైనా వాటిలో ఫిన్‌లాండ్ మాత్రమే రష్యాతో నేరుగా సరిహద్దును కలిగి వుంది. కాబట్టి ఫిన్‌లాండ్ విషయంలోను రష్యా అప్‌సెట్ అవుతుంది. అందుకే ఫిన్‌లాండ్ నిర్ణయాన్ని పుతిన్ సహా పలువురు రష్యన్ నేతలు ఖండించారు. ఫిన్‌లాండ్ నాటోలో చేరితే ఆ దేశంపై దాడికి వెనుకాడబోమని రష్య రక్షణ శాఖ మంత్రి ప్రకటించారు. పుతిన్ కూడా దాదాపు అదే స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. నిజానికి రష్యాతో ఫిన్‌లాండ్‌కు పెద్దగా ప్రమాదం లేదు. స్వీడెన్ దేశానికైతే అస్సలే లేదు. కానీ ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఆ రెండు దేశాల్లో ప్రజలు ఆయా ప్రభుత్వాలపై ఒత్తిడి తేవడంతో ఆ రెండు దేశాల అధినేతలు నాటో కూటమిలో ఎంట్రీకి సిద్దమయ్యారు. ఈక్రమంలో ఇటీవల భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ Prime Minister Narendra Modi జరిపిన యూరోప్ Europe పర్యటన కీలకమని కొందరు అంతర్జాతీయ అంశాల విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రధాని డెన్మార్క్‌ Denmarkలో వున్న ఒక్క రోజే పలువురు నార్డిక్ దేశాల ప్రతినిధులుు ఆ దేశానికి వచ్చి మోదీని కలిశారు. వీరిలో స్వీడెన్, ఫిన్‌లాండ్ దేశాల కీలక నేతలు కూడా వున్నారు. తాము నాటోలో చేరనున్న విషయాన్ని ఆ రెండు దేశాల నేతలు మోదీతో చర్చించారన్నది విశ్లేషకుల అభిప్రాయం. రేపు రష్యా ఆగ్రహంతో యుద్దానికి దిగితే మధ్యవర్తిత్వానికి భారత్ వంటి దేశాల అవసరం వుందని ఆ రెండు దేశాలు భావించడం వల్లనే మోదీతో ముందే సంప్రదింపులు జరిపారని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. నాటోలో ఇదివరకే ఒకప్పడు యుఎస్ఎస్ఆర్‌ USSRలో అంతర్భాగమైన మూడు దేశాలు చేరిపోయాయి. అవి చేరినపుడు రష్యా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆ దేశాలను హెచ్చరించినా అప్పట్లో రష్యా బలహీనంగా వుండడంతో ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. దాంతో 2017 దాకా పలు దేశాలు నాటోలో చేరుతూనే వస్తున్నాయి. తాజాగా ఉక్రెయిన్ తమ యత్నాలను ముమ్మరం చేయడంతో రష్యా రంగంలోకి దిగక తప్పలేదు. నిజానికి యుఎస్ఎస్ఆర్ ముక్కలైన తర్వాత నాటో అవసరం లేదు. కానీ అమెరికా ఆధిపత్య ధోరణితో, ప్రపంచదేశాలపై పెద్దన్న పాత్ర పోషించేందుకు నాటోని విస్తరిస్తూనే వుంది. 3 దశాబ్దాల క్రితం అమెరికా, యుఎస్ఎస్ఆర్ మధ్య ప్రచ్ఛన్న యుద్దం కొనసాగింది. ఆ తర్వాత సోవియట్ యూనియన్ Soviet Union ముక్కలయ్యాక అమెరికా ఆధిపత్యానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. కానీ గత రెండు దశాబ్ధాలుగా పరిస్థితి మారుతూ వస్తోంది. ఒకప్పుడు బలహీనంగా వున్న భారత్, రష్యాలు బలమైన దేశాలుగా ఎదిగాయి. చైనా China ప్రపంచ వాణిజ్యాన్ని శాసించే స్థాయికి చేరింది. ఈక్రమంలో నాటో విస్తరణ ద్వారా పెద్దన్న పాత్ర పోషించేందుకు అమెరికా పలు మార్లు విఫలయత్నాలు చేసింది. అఫ్గానిస్తాన్ Afghanistan, సిరియా Syriaలలో అమెరికా సారథ్యంలోని నాటో దళాలు కొండని తవ్వి ఎలుకని కూడా పట్టలేక పలాయనం చిత్తగించాయి. ఇన్ని పరాభవ అనుభవాలున్నప్పటికీ నాటో విస్తరణకే అమెరికా ప్రయత్నాలు కొనసాగించడం పరోక్షంగా ప్రపంచ నాశనం దిశగా అడుగులు వేయడమేనని పలువురు భావిస్తున్నారు.  ఉక్రెయిన్ యుద్ధంలోకి నాటో దళాలు ఎంట్రీ అయినా.. ఫిన్‌లాండ్ నాటో ఎంట్రీని వ్యతిరేకిస్తూ రష్యా ఆ దేశంపై దాడిని ప్రారంభించినా.. అది తీవ్రస్థాయి యుద్ధానికి లేదా మూడో ప్రపంచ యుద్దానికి దారితీసి వినాశనం ఖాయమని కొందరంటున్నారు.