
అమెరికాలో తెలంగాణకు చెందిన 29 ఏళ్ల వ్యక్తి పోలీసులు కాల్పుల్లో మృతి చెందాడు. కాలిఫోర్నియాలో ఈ ఘటన జరిగింది. సెప్టెంబర్ 3వ తేదీన తన రూమ్‌మేట్‌తో జరిగిన గొడవ తర్వాత పోలీసులు అతడిని కాల్చి చంపారని సమాచారం. మృతుడిని తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మహ్మద్ నిజాముద్దీన్ గా గుర్తించారు. ఈ ఘటనపై శాంతాక్లారా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
నిజాముద్దీన్ ఉన్నత విద్య కోసం 2016లో అమెరికా వెళ్లారని అతని కుటుంబం తెలిపింది. ఫ్లోరిడా కళాశాల నుండి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత, అతను ఒక కంపెనీలో సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్‌గా పనిచేస్తున్నాడు. ఆ తరువాత, పదోన్నతి పొందిన అతను కాలిఫోర్నియాకు వెళ్లాడు. అమెరికా కాలమానం ప్రకారం గురువారం ఉదయం శాంతాక్లారా పోలీసులకు ఇరుగుపొరుగు వారి నుంచి డిస్టర్బెన్స్ కాల్ వచ్చింది. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులకు ఓ ఇంట్లో గొడవ జరుగుతున్న శబ్ధాలు వినిపించాయి. పోలీసులు తలుపులు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళి చూడగా నిజాముద్దీన్, మరో రూమ్ మెట్ తో గొడవ పడుతున్నాడు. రూమ్ మెట్ పై నిజాముద్దీన్ కత్తితో దాడి చేస్తున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. పోలీసులు వద్దని వారించిన వినకపోవడంతో నిజాముద్దీన్ పై కాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు. కత్తిపోట్లకు గురైన వ్యక్తిని ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
తన కొడుకు స్నేహితుడి ద్వారా ఈ సంఘటన సెప్టెంబర్ 3న జరిగిందని తెలుసుకున్నానని నిజాముద్దీన్ తండ్రి మొహమ్మద్ హస్నుద్దీన్ తెలిపారు. అయితే ఆ రోజు తన కొడుకుకు సరిగ్గా ఏమి జరిగిందో, అతను ఎలా చనిపోయాడో స్పష్టంగా తెలియదని అన్నారు. తన కొడుకు మృతదేహాన్ని భారతదేశానికి తీసుకురావడంలో సహాయం కోసం హస్నుద్దీన్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆయన విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌కు ఒక లేఖ రాశారు. ఆ లేఖలో, “నిజాముద్దీన్‌ను శాంటాక్లారా పోలీసులు కాల్చి చంపారని, అతని మృతదేహాన్ని కాలిఫోర్నియాలోని ఒక ఆసుపత్రిలో ఉంచారని తెలిసింది. పోలీసులు అతనిని ఎందుకు కాల్చారో తెలియదు” అని పేర్కొన్నారు.
అందిన సమాచారం ప్రకారం, తన కొడుకు, అతన రూమ్మేట్ ఒక చిన్న విషయానికి గొడవ పడ్డారని ఆయన అన్నారు. అయితే, ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు. తన కుమారుడి మృతదేహాన్ని మహబూబ్‌నగర్‌కు తీసుకురావడానికి సహాయం చేయడానికి వాషింగ్టన్ డీసీలోని భారత రాయబార కార్యాలయాన్ని, శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌ను సంప్రదించాలని హస్నుద్దీన్ జైశంకర్‌కు విజ్ఞప్తి చేశారు.
అతను ఎలా చనిపోయాడు?
ఎయిర్ కండిషనర్ విషయంలో రూమ్‌మేట్‌తో జరిగిన గొడవ ఘర్షణగా దారి తీసిందని, మృతుడి బంధువు ఒకరు తెలిపారు. అదీ కత్తి పోట్ల వరకు వెళ్లిందన్నారు. ఇరుగు పొరుగు వారు పోలీసులకు ఫోన్ చేశారు. గొడవ సమయంలో మరో ఇద్దరు రూమ్‌మేట్స్ ఉన్నట్లు సమాచారం. “పోలీసులు గదిలోకి ప్రవేశించినప్పుడు, వారు ఇద్దరినీ చేతులు ఎత్తమని అడిగారు. ఒకతను అంగీకరించాడు, మరొకరు అంగీకరించలేదు. ఆ తర్వాత పోలీసులు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు, దీంతో నిజాముద్దీన్ మరణించాడు. సరైన దర్యాప్తు లేకుండా కాల్పులు ఇంత త్వరగా జరగడం చాలా విచారకరం” అని బంధువు అన్నారు. “మృతదేహాన్ని మహబూబ్‌నగర్‌కు తిరిగి తీసుకురావడంలో సహాయం చేయాలని మేము తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా అభ్యర్థిస్తున్నాము. కుటుంబానికి ఇంకా పూర్తి సమాచారం అందలేదు” అని చెబుతూ, ఆ బంధువు మృతదేహాన్ని భారతదేశానికి తిరిగి తీసుకురావడంలో సహాయం కోరాడు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..