Sri Lanka Crisis: ఎప్పుడో తాతల కాలం క్రితం బతుకు దెరువు కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి శ్రీలంకకు వచ్చారు వీరంతా. పుట్టి పెరిగింది అంతా లంకలోనే అయినా.. తెలుగును మాత్రం మరువలేదు. ఇంట్లో ఇప్పటికీ తెలుగులోనే మాట్లాడుతున్నారు. తమ తర్వాతి తరం పిల్లలకు కూడా తెలుగు (Telugu) నేర్పుతున్నారు. పేర్లు కూడా తెలుగుపేర్లు పెట్టుకున్నారు. బతుకు తెరువు కోసం వీళ్ల పూర్వీకులు.. శ్రీలంకకు వచ్చి స్థిరపడ్డారు. లంకలో కురునేగళు, క్యాండి, బడవామి, గల్వోమి ప్రాంతాల్లో పెద్దసంఖ్యలో తెలుగువారున్నారు. అలా వచ్చిన వారంతా.. చిన్నా చితక పనులు చేసుకుంటూ బతుకుతున్నారు. కొందరు జాతకాలు చెబితే.. మరికొందరు పాములు కోతలు ఆడిస్తూ పొట్ట పోసుకుంటున్నారు. ఇప్పుడు వీరి జీవితం దినదిన గండంగా మారింది. దేశ పరిస్థితే సరిగా లేకపోవడంతో వీరిని చూసే వారు కూడా కరువయ్యారు. చంటి బిడ్డలతో ఉన్న కుటుంబాలు ఎలా జీవితాన్ని నెట్టుకురావాలో తెలియక అయోమయంలో ఉన్నారు. జాతకాలు చెబితే చిల్లర తప్ప ఏమీ ఇవ్వరు. ఇప్పుడా చిల్లర డబ్బులు కూడా లేకుండా పోవడంతో.. పిల్లలకు కనీసం పాలు కూడా కొనివ్వలేని దుస్థితి. ఎవరైనా టూరిస్టులు కనబడ్డారంటే చాలు.. వారి దగ్గరికి ఉరికిపోతారు. జాతకం చెప్పాలా అని అడుగుతారు.. ఎందుకంటే వారు చెప్పించుకుంటేనే.. వీరికి ఆ పూట అన్నం దొరికేది.
శ్రీలంకలో ఉన్న తెలుగు వాళ్ల అందరి పరిస్థితి ఇంచుమించు ఇలాగే ఉంది. అడవి ప్రాంతాలనే తమ నివాసాలుగా మల్చుకుని ఇక్కడ ఉంటున్నారు. ఆర్ధిక సంక్షోభం వీరి బతుకులను మరింత ఛిన్నాభిన్నం చేసింది. ఆడవాళ్లు ఏమో.. ఇలా జాతకాలు చెప్పుతూ బతుకుతుండగా.. మగవాళ్లు రోజువారీ కూలీలుగా పోతారని చెబుతున్నారు.
తమ తాతల కాలం నుంచి ఇక్కడే ఉంటున్నప్పటికీ.. తెలుగును మాత్రం మరిచిపోలేదు. ఇంట్లో ఉన్నప్పుడు అందరూ తెలుగులోనే మాట్లాడుతుంటారు. చిన్నా చితక పనులు చేసుకుంటున్న వీరి జీవితం అంధకారంగా మారింది. కొలంబో ఎయిర్‌పోర్టుకు సమీపంలో ఉన్న బడవామి గ్రామంలో ఉంటున్న తెలుగువారి జీవితం దుర్భరంగా మారింది. వారి జాడ తెలిసి అక్కడికి వెళ్లిన టీవీ9తో తమ గోడు వెల్లబోసుకున్నారు. తెలుగువారిని ఇక్కడ జిప్సీలని పిలుస్తారు. జీవితం బాగుంటుందని ఇక్కడికి వచ్చినా తలరాతలు మాత్రం మారలేదని వాపోతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో శ్రీలంకలో ఉండడం నరకంగా ఉందని అంటున్నారు. మళ్లీ తమ జన్మభూమికి స్వస్థలాలకు తీసుకెళ్లాలని కోరుతున్నారు. ఇన్నాళ్లు ఎలాగోలా బతికాము.. ఇప్పుడు బతకలేకుండా పోతున్నామని వాపోయారు. తమ జన్మభూమి అయిన ఆంధ్రప్రదేశ్‌కు తీసుకెళ్లేలా చూడాలని ఇక్కడి సీఎం వైఎస్ జగన్‌ను వేడుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి: