ఆఫ్రికాలోని జాంజిబార్‌లో తాబేలు మాంసం తినడం వల్ల ఇప్పటివరకు 9 మంది మృతి చెందారు. మృతుల్లో 8 మంది పిల్లల సహా ఒక మహిళ ఉన్నారు. అంతేకాదు మరోవైపు 78 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ఆసుపత్రిలో చేర్చారు. వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సముద్ర తాబేలు మాంసం తినడం సురక్షితమేనా అనే ఆందోళనను మరోసారి కలుగుతోంది. జాంజిబార్ జిల్లాలోని స్థానిక వైద్యాధికారి మాట్లాడుతూ మరణించిన వారిలో మహిళ తో పాటు ఆమె పిల్లలు కూడా ఉన్నారని చెప్పారు.
నివేదిక ప్రకారం రోగులు మంగళవారం తాబేలు మాంసం తిన్నారు. ల్యాబ్ టెస్టులో కూడా ఈ విషయం నిర్థారణ అయింది. క్రమంగా రోగుల పెరుగుతున్న నేపథ్యంలో తాబేలు మాంసం తినవద్దని వైద్య అధికారులు సూచిస్తున్నారు. వీరి మరణానికి, వ్యాధి బారిన పడడానికి కారణం తాబేలు మాంసంలో ఉన్న చెలోనిటాక్సిజం అని చెబుతున్నారు. మరణాలకు కారణం అవుతున్న చెలోనిటాక్సిజం అంటే ఏమిటో తెలుసుకోండి.
చెలోనిటాక్సిజం అనేది తాబేళ్ల నుండి విడుదలయ్యే విష పదార్థం. ఇంకా చెప్పాలంటే మరణానికి కారణం అయ్యే ఒక రకమైన విష ఆహారం. సముద్ర తాబేళ్లు సుదీర్ఘ జీవితానికి ప్రసిద్ధి చెందాయి. వీటి పైభాగంలోని గట్టి షెల్ లోపల ఒక ప్రత్యేక రకమైన విషపూరిత పదార్థం ఉంటుంది. దీనిని చెలోనిటాక్సిజం అంటారు. తాబేళ్లలో మాత్రమే కాదు చెలోనిటాక్సిజం అనేక రకాల ఇతర జల జంతువులలో కూడా కనిపిస్తుంది.
తాబేళ్లు తమను తాము రక్షించుకోవడానికి ఈ విషాన్ని ఉపయోగిస్తాయి. ఏదైనా నీటి జంతువు లేదా ఏదైనా ప్రాణ హాని ఉందని ఫీలైనప్పడు అవి విషాన్ని విడుదల చేస్తాయి. ఇది వాటిని వేటాడే జంతువుల నుంచి రక్షిస్తుంది. ఈ విషం ఇప్పుడు మనుషులకు ముప్పుగా మారింది.
దీని విషం కొన్ని పరిస్థితులలో మనుషులకు చేరుతుంది. ఉదాహరణకు, తాబేలును ఆహారంగా తినాలనుకునేవారు వండే సమయంలో జాగ్రత్త తీసుకోవాలి. తాబేలు గుడ్లు లేదా శరీర ద్రవాలతో సంబంధంలోకి వచ్చినప్పుడు కూడా ప్రమాదం పెరుగుతుంది. దీని మాంసాన్ని సరిగా ఉడకకపోయినా లేదా తినే సమయంలో అజాగ్రత్తగా ఉన్నా.. మనుషులకు ఈ విషం ప్రాణాపాయాన్ని కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. జాంజిబార్‌తో సహా అనేక ద్వీపాలలో తాబేళ్లను తింటారు. దీని కారణంగా కేసులు భారీ సంఖ్యలో నమోదయ్యాయి.
తాబేలు విషం శరీరంలోకి చేరినట్లయితే కొన్ని ప్రత్యేక లక్షణాలు కనిపిస్తాయి. వాంతులు, కడుపు నొప్పి , విరేచనాలు వంటివి ప్రాధమిక లక్షణాలు కాగా తీవ్రమైన సందర్భాల్లో, శరీర భాగాలు పనిచేయడం ఆగిపోవచ్చు. మరణం కూడా సంభవించవచ్చు. ఇప్పుడు కూడా ఇలాంటి ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఇలాంటి ఉదంతాలు వెలుగులోకి రావడం ఇదే తొలిసారి కాదు. నవంబర్ 2021లో కూడా తాబేలు మాసం తిని చనిపోయారు. ముగ్గురు ఆసుపత్రిలో చేరారు.
ప్రపంచంలోని అనేక దేశాలలోఇటువంటి కేసులను నివారించడానికి ఇప్పటికే సరైన సలహాలు జారీ చేయబడ్డాయి. అదే సమయంలో సముద్ర తాబేళ్లను కొనడం, అమ్మడం, తినడంపై నిషేధం ఉంది. భారతదేశం, అమెరికా, ఆస్ట్రేలియా, మలేషియా సహా అనేక దేశాల్లో తాబేళ్లను పట్టుకోవడం.. వేటాడడంపై నిషేధం ఉంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..