National: గోకర్ణం గుహలో ఆ రెండు వారాలు… అనుభవాలను పంచుకున్న రష్యన్‌ మహిళ…

గోకర్ణ సమీపంలోని గుహలో ఓ రష్యన్‌ మహిళ రహస్య జీవనం సాగిస్తుండగా పోలీసులు రక్షించారు. నైనా కుటినా అనే రష్యన్‌ మహిళ కేవలం ఇద్దరు కుమార్తెలతో కలిసి దాదాపు రెండు వారాల పాటు అక్కడే ఉన్నట్లు గుర్తించారు. తాజాగా ఓ అంతర్జాతీయ వార్తా సంస్థతో మాట్లాడిన ఆమె తన అనుభవాలను పంచుకున్నారు...

National: గోకర్ణం గుహలో ఆ రెండు వారాలు... అనుభవాలను పంచుకున్న రష్యన్‌ మహిళ...
Russian Woman Nina Kutina

Updated on: Jul 16, 2025 | 12:35 PM

గోకర్ణ సమీపంలోని గుహలో ఓ రష్యన్‌ మహిళ రహస్య జీవనం సాగిస్తుండగా పోలీసులు రక్షించారు. నైనా కుటినా అనే రష్యన్‌ మహిళ కేవలం ఇద్దరు కుమార్తెలతో కలిసి దాదాపు రెండు వారాల పాటు అక్కడే ఉన్నట్లు గుర్తించారు. తాజాగా ఓ అంతర్జాతీయ వార్తా సంస్థతో మాట్లాడిన ఆమె తన అనుభవాలను పంచుకున్నారు. పెయింటింగ్స్‌ వేస్తూ.. పాటలు పాడుతూ, పుస్తకాలు చదువుతూ ఇద్దరు పిల్లలతో చాలా ప్రశాంతంగా కాలం గడిపినట్లు తెలిపారు. తనకు నలుగురు సంతానం అని.. పదిహేనేళ్లపాటు అనేక దేశాల్లో పర్యటించినట్లు నైనా కుటినా చెప్పుకొచ్చింది. గత పదిహేనేళ్లుగా 20 దేశాలు తిరిగానని వెల్లడించారు.

తన నలుగురు పిల్లలు ఒక్కొకరు ఒక్కోచోట జన్మించారని రష్యన్‌ మహిళ వెల్లడించింది. ప్రసవానికి సంబంధించిన అన్ని విషయాలు తనకు తెలుసునని, ఆసుపత్రులు, వైద్యులు.. ఎవరి సాయం లేకుండానే తనకు డెలివరీ అయ్యిందని తెలిపింది. సూర్యోదయంతోనే నిద్రలేచి, పక్కనే ఉన్న నదిలో స్నానాలు చేస్తూ.. ప్రకృతి ఒడిలో గడిపామని ఆమె చెప్పింది. పక్కనున్న గ్రామాల నుంచి సరుకులు తెచ్చుకునేవారమని అన్నది. సీజన్‌ను బట్టి పొయ్యి లేదా గ్యాస్‌ స్టవ్‌ మీద వంట చేసుకునేవారమని చెప్పింది.

ప్రస్తుతం తమను అసౌకర్యమైన, మురికిగా ఉండే ప్రదేశంలో ఉంచి కేవలం అన్నం మాత్రమే పెడుతున్నారని నైనా కుటినా వాపోయింది. తన వస్తువుల్లో చాలావాటిని తీసేసుకున్నారని చెప్పింది. తొమ్మిది నెలల క్రితం చనిపోయిన తన కుమారుడి అస్థికలు కూడా తీసుకెళ్ళిపోయారంది. తన గురించి జరుగుతున్న ప్రచారమంతా అబద్దమని చెప్పింది. తాను శిక్షణ పొందిన ఉపాధ్యాయురాలిని కావడం వల్ల తన చిన్నారులకు చదువు చెప్పుతున్నానని తెలిపింది. తన పిల్లలు ఎంతో చురుకుగా ఉన్నారని వివరించింది.

బొమ్మలు గీస్తూ, వీడియోలు చిత్రీకరించడం ద్వారా ఆదాయం పొందుతున్నానని నైనా కుటినా స్పష్టం చేసింది. అయితే వ్యక్తిగత కారణాలతోనే రష్యాకు వెళ్లడం లేదని నైనా చెప్పుకొచ్చింది. నాలుగు దేశాలు తిరిగి భారత్‌కు వచ్చానని తెలిపింది. ఈ ప్రదేశం, ఇక్కడి ప్రజలు, వాతావరణం అంటే చాలా ఇష్టంమని కుటినా పేర్కొన్నారు. రష్యన్‌ రాయబార కార్యాలయంతో టచ్‌లోనే ఉన్నానని ఆమె క్లారిటీ ఇచ్చారు.