Russia Ukraine War: కుళ్లిన శవాలతో ప్రబలుతున్న కలరా.. వందలాది కేసులు.. ఆందోళనలో ఉక్రెయిన్‌ వాసులు..

|

Jun 12, 2022 | 3:31 PM

అపరిశుభ్ర వాతావరణం, కలుషిత నీరు కారణంగా కలరా వేగంగా విజృంభిస్తోంది. మరియాపోల్‌లో వందలాది కలరా కేసులు గుర్తించినట్టు అధికారులు తెలిపారు. మూడు నెలల భీకరదాడుల తరువాత మరియాలోల్‌ను..

Russia Ukraine War: కుళ్లిన శవాలతో ప్రబలుతున్న కలరా.. వందలాది కేసులు.. ఆందోళనలో ఉక్రెయిన్‌ వాసులు..
Ukraine Cholera
Follow us on

రష్యా దాడులతో సర్వనాశనమైన ఉక్రెయిన్‌ను వరుస సంక్షోభాలు వెంటాడుతున్నాయి. మరియాపోల్‌ , ఖేర్సన్‌ నగరాల్లో ఎక్కడ చూసినా కుళ్లిన శవాలే కనబడుతున్నాయి. అపరిశుభ్ర వాతావరణం, కలుషిత నీరు కారణంగా కలరా వేగంగా విజృంభిస్తోంది. మరియాపోల్‌లో వందలాది కలరా కేసులు గుర్తించినట్టు అధికారులు తెలిపారు. మూడు నెలల భీకరదాడుల తరువాత మరియాలోల్‌ను రష్యా తన గుప్పిట్లోకి తీసుకుంది. కుళ్లుతున్న శవాల చుట్టూ ముసురుతున్న ఈగలు, బొద్దింకల వంటి కీటకాలు కలరా వ్యాప్తికి కారణమయ్యే అవకాశం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. రానురానూ ఈ వ్యాధి మరింత తీవ్రరూపం దాల్చి రోజుల వ్యవధిలో వేల మందిని పొట్టనబెట్టుకునే ప్రమాదం పొంచి ఉందని ఆరోగ్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రష్యా దాడుల్లో ఆప్తులను కోల్పోయి నిరాశ్రయులుగా మారిన ఉక్రెయిన్‌ వాసులను కలరా రూపంలో మరో ప్రమాదం పొంచి ఉండడం పట్ల ఐక్యరాజ్య సమితి సైతం తీవ్ర విచారం వ్యక్తం చేసింది.

గత నెల రోజులుగా పలు కలరా కేసుల్ని గుర్తించినట్లు ఉక్రెయిన్‌ అధికారులు తెలిపారు. చాలా అంటువ్యాధులు కూడా ప్రబలుతున్నట్లు పేర్కొన్నారు.అయితే ఈ వార్తాలను రష్యా తోసిపుచ్చింది. ఇదంతా ఉక్రెయిన్‌ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారమని , మరియాపోల్‌లో ఒక్క కలరా కేసు కూడా నమోదు కాలేదని స్పష్టం చేసింది.

మరియాపోల్‌లో యుద్దం కారణంగా 10 వేల మంది చనిపోయారు. అనధికారం లెక్కల ప్రకారం మృతుల సంఖ్య ఇంకా ఎక్కువేనని అంటున్నారు. మరియాపోల్‌లో తాగునీటిలో మురుగునీరు చేరుతోందని.. ఇది కలరా సహా ఇతర అంటువ్యాధులకు దారితీసే అవకాశం ఉందని యూఎన్‌తో పాటు రెడ్‌క్రాస్‌ హెచ్చరించాయి. మరోవైపు ఔషధాల కొరత కొనసాగుతున్న కారణంగా పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కలరా భయంకరమైన వ్యాధి చాలా డేంజర్‌. సరైన సమయంలో చికిత్స అందకపోతే ఈ జబ్బు సోకి కొన్ని గంటల్లోనే మృత్యువు కాటేస్తుంది. ఇది ‘విబ్రియో కలరే’ అనే బాక్టీరియా వల్ల వస్తుంది. దీనితో కలుషితమైన ఆహారం తినడం లేదా నీరు తాగడం ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. అపరిశుభ్ర వాతావరణం, కలుషిత తాగునీటిలో ఈ బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది.