Russia Ukraine War News: ఉక్రెయిన్‌లో రష్యా సేనల దాడులు కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్ కూడా రష్యా సేనలకు ధీటైన సమాధానమిస్తోంది. గత నెలన్నర రోజులుగా కొనసాగుతున్న యుద్ధంలో భారీ సంఖ్యలో ప్రాణనష్టం జరగ్గా.. లక్షలాది మంది ఉక్రెయిన్లు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని తమ దేశం విడిచి వెళ్లిపోయారు. ఉక్రెయిన్ సేనలు, సామాన్య ప్రజలు ప్రతిఘటిస్తుండటంతో యుద్ధంలో రష్యా సైనికులు కూడా భారీ సంఖ్యలో మరణించారు. మార్చి 25 నాటి వరకు యుద్ధంలో 1,351 మంది రష్యా సైనికులు మరణించినట్లు మాస్కో వర్గాలు చెబుతున్నాయి. అయితే వాస్తవ సంఖ్య 20,000కి చేరువలో ఉండొచ్చని ఉక్రెయిన్ పేర్కొంది.
ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌పై రష్యా సేనల యుద్ధం బాగా జరుగుతోందంటూ ఆ దేశాధ్యక్షుడు పుతిన్(Russia President Putin) చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ(Zelensky) వ్యాఖ్యానించారు. భారీ సంఖ్యలో రష్యా సైనికుల మరణాలకు కారణమయ్యే ‘ప్రణాళిక’ను ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎలా ఆమోదించగలరంటూ విస్మయం వ్యక్తంచేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన పుతిన్.. రష్యా తాను ఆశించిన “ఉత్తమ” లక్ష్యాలన్నింటినీ సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. లక్ష్య సాధన కోసం ప్రత్యేక ఆపరేషన్ ప్రణాళిక ప్రకారం కొనసాగిస్తుందని స్పష్టంచేశారు.
పుతిన్ వ్యాఖ్యలపై జెలెన్‌స్కీ విస్మయం వ్యక్తంచేశారు. ప్రత్యేక ఆపరేషన్ ప్రణాళిక ప్రకారం జరుగుతుందని పుతిన్ మరోసారి పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. అయితే రష్యా ఇలాంటి ప్రణాళికను ఎలా అమలు చేస్తోందో ప్రపంచంలో ఎవరికీ అర్థం కావడం లేదని ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు. నెలకు పైగా జరిగుతున్న యుద్ధంలో పదివేల మంది తమ సొంత సైనికుల మరణానికి దోహదపడిన ప్రణాళికను కొనసాగించాలని ఎవరు భావిస్తారు? ఇలాంటి ప్రణాళికను ఎవరైనా ఎలా ఆమోదించగలరు? అంటూ పుతిన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. యుద్ధాన్ని ఆపాలంటే ఎంత మంది రష్యన్ సైనికుల మరణాలు పుతిన్‌కు ఆమోదయోగ్యంగా ఉంటారంటూ జెలెన్‌స్కీ ప్రశ్నించారు. 1979 నుండి 1989 వరకు 10 సంవత్సరాల పాటు జరిగిన ఆఫ్ఘన్ యుద్ధం కంటే.. ఉక్రెయిన్‌తో గత 48 రోజులుగా జరుగుతున్న యుద్ధంలో ఎక్కువ మంది సైనికులను రష్యా కోల్పోయిందని పేర్కొన్నారు.
యుద్ధ క్షేత్రంలో రష్యా వైఫల్యాలు, నాసిరకం సాంకేతికతపై కొందరు ఎగతాళి చేశారని గుర్తుచేశారు. రష్యా సేనలతో యుద్ధంపై వారి ప్రత్యర్థులు నిరాశాజనకంగా లేరంటూ జెలెన్‌స్కీ ఘాటు హెచ్చరికలు చేశారు. అన్ని రష్యన్ ట్యాంకులు పొలాల్లో చిక్కుకోవడం.. కొందరు రష్యా సైనికులు యుద్ధభూమి నుండి పారిపోరని గుర్తుచేశారు. కొందరు సైనికులకు ఆయుధాలను సరిగ్గా ఎలా పట్టుకోవాలో తెలియని బలహీనులు ఉన్నారని యుద్ధంలో తేలిందన్నారు.
Also Read..
Beast Movie: బీస్ట్ సినిమా చూసినవారికి బంపర్ ఆఫర్.. లీటర్ పెట్రోల్ ఫ్రీ ఇచ్చిన ఫ్యాన్స్..