Putins Palace History: రష్యాలో నల్ల సముద్రం ఒడ్డున పుతిన్‌కు ఒక రహస్యభవనం ఉన్నట్లుగా పదేళ్ల నుంచి సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఆ భవనాన్ని చూసిన వారు కూడా లేరు. అయితే తాజాగా రష్యన్ రాజకీయ నాయకుడు, పుతిన్ విమర్శకుడు అలెక్సీ నవాల్ని ఆ ఇంటికి సంబంధించిన వీడియోను జైలులో ఉన్నా తన సన్నిహితుల ద్వారా యూ ట్యూబ్‌లోకి అప్‌లోడ్ చేయించారు. హిస్టరీ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ బ్రైబ్ పేరుతో అప్‌లోడ్ చేసిన ఈ వీడియో యూ ట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది. ఏకంగా నాలుగు రోజుల్లోనే 6 కోట్ల వ్యూస్ సాధించింది.
కొంతమంది ఈ భవనాన్ని రష్యాలోనే అతి పెద్ద, విలాసవంతమైన భవనంగా అభివర్ణిస్తున్నారు. 2012లో బీబీసీ సైతం ఈ భవనం గురించి ఒక కథనాన్ని ప్రచురించింది. అక్షరాల10 వేల కోట్ల రూపాయల ఖర్చుతో ఈ భవనాన్ని నిర్మించారని ప్రచారం జరుగుతోంది. నివాస స్థలం పరిమాణం 1,95,000 చదరపు అడుగులు, భవనంలోనే ఈత కొలను, చర్చి, యాంఫీ థియేటర్, విలువైన ఫర్నిచర్ సమకూర్చారు. రష్యా ప్రభుత్వ సంస్థలైన రాస్‌నెఫ్ట్, ట్రాన్స్‌నెఫ్ట్ కలిసి ఈ భవానికి నిధులు సమకూర్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ వీడియోపై స్పందించిన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ భవనం తనది కాదని చెబుతున్నాడు. ఆయన మాటలు అంత నమ్మశక్యంగా లేవని కొంతమంది ఆరోపిస్తున్నారు. పుతిన్ కు తెలియకుండా అటువంటి విలాస భవనం రష్యాలో సాధ్యమేనా? అని ప్రశ్నిస్తున్నారు. 20 ఏళ్లుగా ఏకఛత్రాధిపత్యంతో పుతిన్ రష్యాను ఏలుతున్నారు. రెండు సార్లకు మించి అధ్యక్ష పదవి చేపట్టే వీలులేకుండా ఉన్న రష్యా రాజ్యాంగాన్ని సవరించి ప్రధానిగా, అధ్యక్షుడిగా మారుతూ పరిపాలన చేస్తున్నాడని విమర్శిస్తున్నారు. నియంతృత్వం, బూటకపు ప్రజాభిప్రాయ సేకరణలపై ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి.
ఇదిలా ఉంటే ఎనిమిదేళ్ల క్రితం ఏర్పాటైన రష్యా ఆఫ్ ద ఫ్యూచర్ రాజకీయ పార్టీ నాయకుడు అలెక్సీ నవాల్ని ఏడాది క్రితం జర్మనీలో విషప్రయోగానికి గురయ్యారు. పుతిన్ ప్రభుత్వమే తన పై విష ప్రయోగం చేయించినట్టు నవాల్ని ఆరోపించారు. వీటిని రష్యా సర్కారు తోసిపుచ్చింది. కొద్ది రోజుల క్రితం జర్మనీ నుంచి రష్యాకు చేరుకున్న నవాల్నిని ఎయిర్‌పోర్టులోనే అరెస్టు చేసి జైలుకు తరలించింది. ఇటీవల కొత్తగా ఎన్నికైన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, అలెక్సీ నావల్నీ విషప్రయోగంపై పుతిన్‌తో మాట్లాడినట్లు వైట్‌హౌస్ తెలిపింది.