PM Modi: భారత్ – చైనా స్నేహితులుగా ఉండటమే మంచిది.. మోదీతో చైనా అధ్యక్షుడు ఏమన్నారంటే..?
ఏడేళ్ల తర్వాత ప్రధాని మోదీ చైనాలో పర్యటిస్తున్నారు. షాంఘై సహకార సంస్థ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ క్రమంలో రెండు దేశాల సంబంధాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్-చైనా స్నేహితులుగా ఉండటమే రెండు దేశాలకు మంచిదని అన్నారు. దీనికి ప్రతిస్పందనగా మోదీ సైతం కీలక వ్యాఖ్యలు చేశారు.

షాంఘై సహకార సంస్థ సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జి జిన్‌పింగ్ మాట్లాడుతూ.. భారత్-చైనా స్నేహితులుగా ఉండటమే రెండు దేశాలకు మంచిదని అని అన్నారు. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన రెండు దేశాలు, తూర్పున పురాతన నాగరికులగా ఒకరికొకరు విజయానికి సహకరించుకునే భాగస్వాములుగా ఉండాలని అన్నారు.
జి జిన్‌పింగ్ కీలక వ్యాఖ్యలు
మోదీజీ.., మిమ్మల్ని మళ్లీ కలవడం చాలా సంతోషంగా ఉంది. SCO సదస్సుకు నేను మిమ్మల్ని చైనాకు స్వాగతిస్తున్నాను. గత సంవత్సరం కజాన్‌లో మనం విజయవంతమైన సమావేశం నిర్వహించుకున్నాం. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన రెండు దేశాలు మనవే. మనపై ప్రజల శ్రేయస్సును మెరుగుపరచడం, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య ఐక్యతను ప్రోత్సహించడం అనే చారిత్రక బాధ్యత ఉంది’’ అని జి జిన్‌పింగ్ అన్నారు. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలకు ఇది 75వ వార్షికోత్సవమని గుర్తు చేస్తూ.. ‘‘మన సంబంధాలను వ్యూహాత్మక, దీర్ఘకాలిక దృక్పథంతో కొనసాగించాలి. ఆసియా, ప్రపంచ శాంతి కోసం కలిసి పనిచేయాలి’’ అని జి జిన్‌పింగ్ సూచించారు.
మోదీ ఏమన్నారంటే..?
రెండు దేశాలకు చెందిన 2.8 బిలియన్ల ప్రజల ప్రయోజనాలు పరస్పర సహకారంతో ముడిపడి ఉన్నాయని.. ఇది మానవాళి సంక్షేమానికి దారితీస్తుందని ప్రధాని మోదీ అన్నారు. జిన్‌పింగ్ స్వాగతానికి ధన్యవాదాలు తెలిపిన ప్రధాని మోదీ.. గత ఏడాది కజాన్‌లో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఇద్దరి మధ్య జరిగిన చర్చలు సానుకూల దిశానిర్దేశం చేశాయని గుర్తు చేసుకున్నారు. సరిహద్దులో విభేదాలు తగ్గిన తర్వాత శాంతియుత వాతావరణం ఏర్పడిందని, సరిహద్దు నిర్వహణపై ప్రత్యేక ప్రతినిధులు ఒక అవగాహనకు వచ్చారని తెలిపారు. అలాగే కైలాష్ మానస సరోవర్ యాత్ర యాత్ర, రెండు దేశాల మధ్య ప్రత్యక్ష విమానాల పునఃప్రారంభం గురించి కూడా మోదీ ప్రస్తావించారు. ఈ సందర్భంగా భారత్-చైనా సంబంధాలను ‘‘పరస్పర విశ్వాసం, గౌరవం, సున్నితత్వం’’ ఆధారంగా ముందుకు తీసుకెళ్లాలని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
SCO సదస్సు
ఈ రెండు రోజుల SCO సదస్సులో 20 మందికి పైగా విదేశీ నాయకులు, 10 మంది అంతర్జాతీయ సంస్థల అధిపతులు పాల్గొంటున్నారు. చైనా, భారత్, రష్యా, పాకిస్తాన్, ఇరాన్, కజకిస్తాన్, కిర్గిజ్‌స్థాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, బెలారస్ ఇందులో సభ్య దేశాలుగా ఉన్నాయి. గల్వాన్ ఘర్షణ తర్వాత గత ఏడేళ్లలో ప్రధాని మోడీ చైనాకు రావడం ఇదే తొలిసారి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
