Pakistan Political Crisis: అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు ముందు పాక్ నేషనల్ అసెంబ్లీలో హైవోల్టేజ్ డ్రామా!

|

Apr 09, 2022 | 12:49 PM

పాకిస్తాన్‌లో రాజకీయ అస్థిరత తారాస్థాయికి చేరుకుంది. శుక్రవారం సాయంత్రం సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాత, పాక్ ప్రధాని ఇమ్రాన్ ప్రభుత్వంపై అవిశ్వాస ప్రవేశపెట్టాయి ప్రతిపక్షాలు.

Pakistan Political Crisis: అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు ముందు పాక్ నేషనల్ అసెంబ్లీలో హైవోల్టేజ్ డ్రామా!
Pakistan National Assembly
Follow us on

Pakistan Political Crisis: పాకిస్తాన్‌లో రాజకీయ అస్థిరత తారాస్థాయికి చేరుకుంది. శుక్రవారం సాయంత్రం సుప్రీంకోర్టు(Supreme Court) నిర్ణయం తర్వాత, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan)  ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం(No Confidence Motion) ప్రవేశపెట్టాయి ప్రతిపక్షాలు. ఈతీర్మానంపై ఓటింగ్‌ జరిపేందుకు జాతీయ అసెంబ్లీ నేడు ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ ఉదయం 10.30 గంటలకు సభ ప్రారంభం కాగా.. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ జరపాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. అయితే దీన్ని అధికార పక్షం వ్యతిరేకించింది. దీంతో సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్‌ సభను మధ్యాహ్నం 12.30 గంటల వరకు సభను వాయిదా వేశారు. ప్రజాస్వామ్యం ప్రకారం ఈ ప్రతిపాదనను వ్యతిరేకించడం మన హక్కు అని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ కరీషి అన్నారు. కోర్టు నిర్ణయం పట్ల ఇమ్రాన్ ఖాన్ నిరాశకు లోనయ్యారని, అయితే ఆయన దానిని తప్పకుండా గౌరవిస్తారని విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషీ అన్నారు.

జాతీయ అసెంబ్లీ సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష నేత షాబాజ్‌ షరీఫ్‌ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఆదేశాలను స్పీకర్‌ పాటిస్తారని భావిస్తున్నాం. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ నిర్వహించాలని డిమాండ్ చేశారు. దీనికి స్పీకర్‌ అసద్‌ ఖైజర్‌ స్పందిస్తూ.. పాక్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు విదేశీ కుట్ర జరుగుతోందన్న ఆరోపణలపై చర్చించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దీన్ని ప్రతిపక్షాలు ఖండించాయి. ఎలాంటి చర్చ జరపాల్సిన అవసరం లేదని, వెంటనే ఓటింగ్‌ చేపట్టాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. అనంతరం పాక్‌ విదేశాంగ మంత్రి, పీటీఐ నేత షా మహ్మద్‌ ఖురేషీ మాట్లాడుతూ.. విదేశీ కుట్రపై దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలోనే సభలో వాగ్వాదం నెలకొనడంతో స్పీకర్‌ సభను వాయిదా వేశారు.

ఇదిలావుంటే, ప్రజల ముందుకు వెళ్లాలని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నిర్ణయించుకున్నారని ఖురేషీ అన్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రధాని ప్రజల ముందుకు వెళ్లి ప్రజలే నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ప్రతి మ్యాచ్‌కి మేం సిద్ధంగా ఉన్నాం. విదేశీ కుట్రపై విచారణ చేస్తున్నామన్నారు. మరోవైపు, జాతీయ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు ప్రతిపక్షాలన్నీ హాజరయ్యాయి. కానీ అధికార పార్టీ నుంచి ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌‌తో సహా చాలా మంది నేతలు హాజరుకాలేదు. నేటి సమావేశానికి ఆయన గైర్హాజరయ్యారు. పీటీఐ నుంచి కేవలం 51 మంది సభ్యులు మాత్రమే హాజరవ్వడం గమనార్హం.

మరోవైపు, పాక్‌ జాతీయ అసెంబ్లీలో మొత్తం 342 సభ్యులున్నారు. అవిశ్వాసంపై ప్రతిపక్షాలు నెగ్గాలంటే 172 మంది సభ్యుల మద్దతు కావాలి. ప్రస్తుతం జాతీయ అసెంబ్లీలో అధికార పార్టీ బలం 164గా ఉండగా.. విపక్షాల సంఖ్యా బలం 177గా ఉంది. ఈ పరిస్థితుల్లో ఇమ్రాన్‌ అవిశ్వాసం నుంచి గట్టెక్కే అవకాశాలు కన్పించడం లేదు. దీంతో ఓటింగ్‌కు ముందే ఆయన రాజీనామా చేసే అవకాశముందని తెలుస్తోంది. మరోవైపు ఓటింగ్‌ వాయిదా పడేలా అధికార పక్షం ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే పీటీఐ పార్టీ నేతలతో ఇమ్రాన్‌ ఖాన్‌ అత్యవసరంగా సమావేశమయ్యారు. అసెంబ్లీలో పార్టీ కార్యాచరణపై వీరితో చర్చిస్తున్నట్లు సమాచారం. అవిశ్వాస తీర్మానంపై సభలో సుదీర్ఘంగా చర్చించాలని, తద్వారా ఓటింగ్‌ వాయిదా పడేలా చూడాలని ఇమ్రాన్‌ పార్టీ సభ్యులకు దిశానిర్ధేశం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Read Also…. Indian Defence budget: ప్రైవేట్ కంపెనీల నుండి ఆయుధాల కొనుగోలు.. కేంద్ర రక్షణ శాఖ కీలక నిర్ణయం..