
గత కొన్ని రోజులుగా పాకిస్థాన్‌లో ఉన్న హిందూ, సిక్కు ఆలయాలు కొత్త రూపులు దిద్దుకుంటున్నాయి. పాకిస్థాన్‌లోని మైనారిటీ హెరిటేజ్ సంరక్షణలో భాగంగా అక్కడ హిందూ ఆలయాల పునరుద్దరణ ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా లాహోర్ కోటలోని హిందూ చారిత్రక స్థలంలో కొలువై ఉన్న శ్రీరాముడి కుమారుడైన లవ’ ఆలయాన్ని అధికారులు పునరుద్దరించారు. అలాగే ప్రజల సందర్శనకు కూడా అనుమతించినట్టు స్థానిక అధికారులు తెలిపారు. ఈ ఆలయంలో పాటు సిక్కు కాలం నాటి పలు స్మారకచిహ్నాలను కూడా సందర్శనలోకి తీసుకొచ్చినట్టు తెలిపారు.
హిందూ పురాణాల ప్రకారం.. సిక్కుల కాలంలో ఈ లవ ఆలయం నిర్మించబడినట్టు తెలుస్తోంది. ఈ ఆలయం ప్రస్తుతం పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్‌లోని లాహోర్ కోటలోని గదుల మధ్యలో ఉంది. ఈ ఆలయానికి పైకప్పు కూడా లేదు. దీంతో వాల్డ్ సిటీ ఆఫ్ లాహోర్ అథారిటీ, అగాఖాన్ కల్చరల్ సర్వీస్ సహకారంతో ఈ ఆలయాన్ని పూర్తిగా పునరుద్దరించి సందర్శనకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే శ్రీరాముడి కుమారుడైన లవుడి పేరుతోనే ఈ ప్రాంతానికి లాహోర్ పట్టణం పేరు వచ్చిందని విశ్వాసం.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.