Pakistan: పాక్‌ ఆత్మాహుతి బాంబు దాడిలో 52 మంది దుర్మరణం.. 130 మందికి గాయాలు

Pakistan Suicide Bomb Blast: పాకిస్థాన్‌ ఆత్మాహుతి బాంబు దాడితో దద్దరిల్లింది. ఆఫ్గన్ సరిహద్దులో పాక్ నైరుతి ప్రాంతంలోని బలూచిస్తాన్ మస్తూంగ్ జిల్లాలో జరిగిన ఈ ఆత్మాహుతి బాంబు దాడిలో 52 మంది దుర్మరణం చెందగా.. మరో 130 మంది గాయపడ్డారు. మసీదులో శుక్రవారం ప్రార్ధనల సమయంలో ఈ ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది.

Pakistan: పాక్‌ ఆత్మాహుతి బాంబు దాడిలో 52 మంది దుర్మరణం.. 130 మందికి గాయాలు
Pakistan suicide bomb blast

Updated on: Sep 29, 2023 | 3:52 PM

పాకిస్థాన్‌ ఆత్మాహుతి బాంబు దాడితో దద్దరిల్లింది. ఆఫ్గన్ సరిహద్దులో పాక్ నైరుతి ప్రాంతంలోని బలూచిస్తాన్ మస్తూంగ్ జిల్లాలో జరిగిన ఈ ఆత్మాహుతి బాంబు దాడిలో 52 మంది దుర్మరణం చెందగా.. మరో 130 మంది గాయపడ్డారు. మసీదులో శుక్రవారం ప్రార్ధనల సమయంలో ఈ ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. బాంబు పేలుడులో గాయపడ్డవారిని స్థానిక ఆసుపత్రులకు తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పేలుళ్లకు తామే బాధ్యులమంటూ ఇప్పటివరకూ ఏ ఉగ్రవాద సంస్థా ప్రకటించుకోలేదు. స్థానికంగా బందోబస్తు విధులు నిర్వహిస్తున్న మస్తూంగ్ జిల్లాకు చెందిన డీఎస్పీ నవాజ్ కూడా మృతుల్లో ఉన్నారని తెలిసింది.

మిలాద్ ఉన్ నబీ, మహ్మద్ ప్రవక్త జయంతిని పురస్కరించుకుని ప్రజలు గుమికూడగా.. మానవ బాంబు వారి మధ్యలోకి ప్రవేశించి తనను తాను పేల్చివేసుకున్నట్లు స్థానిక పోలీసు అధికారులు తెలిపారు. ఆత్మాహుతి దాడేనని ధృవీకరించిన పోలీసు అధికారులు.. అక్కడ బందోబస్తు విధులు నిర్వహిస్తున్న డీఎస్పీ కారుకు అత్యంత సమీపంలోనే మానవ బాంబు తనను తాను పేల్చివేసుకున్నట్లు తెలిపారు. పేలుడు ఘటనకు సంబంధించి సమాచారం అందిన వెంటనే అదనపు భద్రతా బలగాలు, సహాయక వైద్య బృందాలను అక్కడికి తరలించినట్లు బలూచిస్తాన్ అంతర్గత సమాచార శాఖ మంత్రి జన్ అచక్‌జయ్ మీడియాకు తెలిపారు.

ఆత్మాహుతి దాడితో దద్దరిల్లిన బలూచిస్థాన్‌లోని ప్రాంతం..

వచ్చే ఏడాది జనవరి మాసంలో పాకిస్థాన్‌‌లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆ దేశ పశ్చిమ ప్రాంతంలో శాంతి భద్రతలు క్షీణించడం ఆ దేశ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. స్థానిక ఆసుపత్రి వర్గాలు 52 మృతదేహాలు ఉన్నట్లు ధృవీకరించారని డాన్ పత్రిక వెల్లడించింది. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలిపారు.

బాధ్యుల అరెస్టుకు ఆపద్ధర్మ సీఎం ఆదేశం

తీవ్రంగా గాయపడిన వారిని క్వెటాకు తరలించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. బలూచిస్థాన్‌లోని ఆస్పత్రుల్లో మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించినట్లు వివరించారు. బలూచిస్థాన్‌లో శాంతికి విఘాతం కలిగించేందుకు శత్రువు ప్రయత్నిస్తున్నాడంటూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అలీ మర్దాన్ దోమ్కీ పేర్కొన్నారు. బాంబు పేలుళ్లకు బాధ్యులైన వారిని అరెస్టు చేయాలని భద్రతా దళాలను ఆదేశించారు.

పాకిస్థాన్ ప్రధాన నగరాల్లో హై అలెర్ట్..

ఆత్మాహుతి పేలుడు ఘటన జరిగిన వెంటనే బలూచిస్థాన్ ప్రావినెన్స్‌లో శుక్రవారం ప్రార్థనలు జరుగుతున్న ఇతర మసీదుల దగ్గర భారీ సంఖ్యలో భద్రతా దళాలను మోహరించారు. మస్తుంగ్ జిల్లాలో మసీదు దగ్గర పేలుడు ఘటన నేపథ్యంలో కరాచీలో హై సెక్యూరిటీ అలెర్ట్ ప్రకటించారు. మసీదుల దగ్గర పోలీసులను మోహరించారు. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ సహా ఇతర ప్రాంతాల్లోనూ పోలీసు బలగాలు అలెర్ట్ అయ్యాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తలు చదవండి