Nawaz Sharif: అధికారం.. ప్రవాసం.. ఒకదాని వెంట ఒకటి.. ఆయనకు వరం వెంట శాపం

| Edited By: Sanjay Kasula

Oct 26, 2023 | 6:53 PM

Pakistan: ప్రవాస జీవితం ఒకదాని వెంట ఒకటి వరంతో పాటు శాపంలా ఆయన్ను వెంటాడుతున్నాయి. మూడు పర్యాయాలు ఆ దేశానికి ప్రధానిగా సేవలందించి, రెండు పర్యాయాలు ప్రవాసంలో గడిపిన నవాజ్ షరీఫ్ తాజాగా మరోసారి స్వదేశానికి తిరిగొచ్చారు. ఆ దేశంలో ప్రభుత్వాలను శాసించేది ప్రజలు కాదు, ఆర్మీ అన్న సంగతి అందరికీ తెలిసిందే. పాకిస్తాన్‌లో ప్రభుత్వాలను తన కంటి చూపుతో శాసిస్తున్న ఆర్మీ రూలర్స్ నవాజ్ షరీఫ్ విషయంలో తమ వైఖరిని అకస్మాత్తుగా మార్చుకున్నారు.

Nawaz Sharif: అధికారం.. ప్రవాసం.. ఒకదాని వెంట ఒకటి.. ఆయనకు వరం వెంట శాపం
Nawaz Sharif
Follow us on

పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ జీవితంలో అధికారం, ప్రవాస జీవితం ఒకదాని వెంట ఒకటి వరంతో పాటు శాపంలా ఆయన్ను వెంటాడుతున్నాయి. మూడు పర్యాయాలు ఆ దేశానికి ప్రధానిగా సేవలందించి, రెండు పర్యాయాలు ప్రవాసంలో గడిపిన నవాజ్ షరీఫ్ తాజాగా మరోసారి స్వదేశానికి తిరిగొచ్చారు. ఆ దేశంలో ప్రభుత్వాలను శాసించేది ప్రజలు కాదు, ఆర్మీ అన్న సంగతి అందరికీ తెలిసిందే. పాకిస్తాన్‌లో ప్రభుత్వాలను తన కంటి చూపుతో శాసిస్తున్న ఆర్మీ రూలర్స్ నవాజ్ షరీఫ్ విషయంలో తమ వైఖరిని అకస్మాత్తుగా మార్చుకున్నారు.

అందుకే గత ఐదేళ్లుగా లండన్‌లో ప్రవాస జీవితం గడుపుతున్న నవాజ్ షరీఫ్ సొంత గడ్డపై కాలుమోపగలిగారు. వచ్చీ రావడంతోనే రాజకీయ దుమారానికి తెరలేపారు. నవాజ్ షరీఫ్ పాకిస్తాన్‌కు తిరిగొస్తారని, ఆయన సోదరుడు షాబాజ్ ఆ దేశ ప్రధాని కావడం ఖాయమని అందరూ అనుకుంటున్న విషయమే అయినా పరిణామాలు ఇంత వేగంగా మారిపోతాయని మాత్రం ఎవరూ ఊహించలేదు.

నాడు అవినీతి ముద్ర.. నేడు రెడ్ కార్పెట్ స్వాగతం

అవినీతి అభియోగాలపై జైలు శిక్షకు సైతం గురై ప్రవాస జీవితం గడుపుతున్న నవాజ్ షరీఫ్ పాకిస్థాన్ తిరిగిరాగానే ఆయనకు ఎర్రతివాచీతో స్వాగతం లభించింది. ఇంతకాలం అవినీతిపరుడిగా చిత్రీకరించిన నవాజ్ షరీఫ్‌ను పాకిస్థాన్ సైన్యం ఆదేశానుసారం, అక్కడి డమ్మీ ప్రజాస్వామ్య వ్యవస్థ మొత్తం నిజాయితీపరుడిగా మార్చడానికి పూనుకుంది. నవాజ్ షరీఫ్‌పై నమోదైన ఆ కేసులను ఈ డమ్మీ ప్రజాస్వామ్య వ్యవస్థ మెల్లమెల్లగా తిరస్కరిస్తోంది. ఈ పరిణామాలు ఇమ్రాన్ ఖాన్‌కు మింగుడుపడకుండా చేస్తున్నాయి.

అక్టోబర్ 21న పాకిస్థాన్‌కు తిరిగి వచ్చిన నవాజ్ షరీఫ్.. ఆ వెంటనే లాహోర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో వేలాది మంది పాల్గొన్నారు. నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం మాత్రమే కాదు, పాకిస్థాన్ మాజీ ప్రధాని. నవాజ్ తమ్ముడు షాబాజ్ షరీఫ్ కూడా ఈ సభలో పాల్గొన్నారు. సభా వేదికపై నుంచి ఆకట్టుకునే కవిత్వంతో నవాజ్ షరీఫ్ చేసిన ప్రసంగం, కుటుంబ సమేతంగా వేదికపై దర్శనమివ్వడం ఆయన రీఎంట్రీకి సంకేతాలుగా మారాయి.

మూడు గ్యారంటీలతో ఎంట్రీ

నవాజ్ షరీఫ్ తన ప్రసంగంలో ప్రధానంగా మూడు అంశాలను ప్రస్తావించారు. అందులో మొదటిది ప్రతీకార రాజకీయాలు లేదంటే కక్షసాధింపు రాజకీయాలు. తాను ఎలాంటి పగ, ప్రతీకారంతో పాలన సాగించను అంటూ చెబుతున్నారు. పరోక్షంగా ఇమ్రాన్ ఖాన్‌‌కు చురకలు అంటించారు. ఇమ్రాన్ పదవి చేపట్టిన మరుక్షణం నుంచే నవాజ్ వెంట పడ్డారు. ఆయనపై అప్పటికే నమోదైన కేసులతో పాటు కొత్త కేసులను పెట్టి కొన్నింటిలో శిక్షపడేలా వేగంగా పావులు కదిపారు. తాను మాత్రం ఇమ్రాన్‌ ఖాన్ మాదిరిగా ప్రతీకార కక్షసాధింపు రాజకీయాలు చేయనని నవాజ్ షరీఫ్ చెప్పడం ఆయన అభిమానులను నిరాశపరిచినా దేశ ప్రజల మెప్పు పొందే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి.

ఇక రెండోది పొరుగుదేశాలతో శాంతి మార్గం. పాకిస్తాన్ తన పొరుగున ఉన్న భారతదేశాన్ని శత్రుదేశంగా చూస్తుందన్న విషయం యావత్ ప్రపంచానికి తెలుసు. ఈ ద్వేషభావంతో ఆ దేశం సాధించింది ఏమైనా ఉందా అంటే.. ఉగ్రవాదానికి అడ్డాగా మారి ఆర్థికంగా కుప్పకూలిపోవడమే. ఆ దేశంలో అతివాద మతఛాందస సంస్థలు, ఉగ్రవాదులు, ఆర్మీ తప్ప సామాన్య ప్రజలు భారత్‌తో విరోధాన్ని కోరుకోవడం లేదు. భారత్‌తో పాటు అటు అఫ్ఘనిస్తాన్‌తోనూ పాక్ శత్రుత్వాన్ని పెంచుకుంది. ఈ పరిస్థితుల్లో ఆ దేశ ప్రజలు తమకు కావాల్సింది యుద్ధం, అశాంతి కాదని, ప్రజలు తినడానికి తిండి, దేశాభివృద్ధి అని నినదిస్తున్నారు. జనం నాడి పసిగట్టిన షరీఫ్ ‘శాంతి’ మంత్రాన్ని అందుకున్నారు. అయితే ఆర్మీ కనుసన్నల్లో నడిచే డమ్మీ ప్రజాస్వామ్యం ఉన్న పాకిస్తాన్‌లో నవాజ్ షరీఫ్ జపించే శాంతి మంత్రం ఎంతమేర ఆచరణ సాధ్యం అన్నది సందేహాస్పదమే. ఎందుకంటే నవాజ్ షరీఫ్ శాంతి, సామరస్యం గురించి మాట్లాడిన ప్రతిసారీ పాకిస్థాన్‌లో రాజకీయంగా పరిణామాలన్నీ ఆయనకు వ్యతిరేకంగానే జరిగాయి.

ఇక మూడో ముఖ్యమైన విషయం ఏంటంటే.. పాకిస్థాన్ అభివృద్ధికి తాను ప్రాముఖ్యత ఇస్తానని నవాజ్ షరీఫ్ చెప్పడం. దివాలా అంచున ఉన్న పాకిస్థాన్‌ను ఒడ్డున పడేయడం అన్నదే అనేక సవాళ్లతో కూడుకున్న వ్యవహారం. ఆ తర్వాతే అభివృద్ధి సాధ్యం. కొన్నాళ్ల క్రితం గోధుమ నిల్వలు నిండుకుని ఆహార సంక్షోభ వాతావరణాన్ని ఆ దేశం ఎదుర్కొంది. ఇలాంటి స్థితిలో దేశాభివృద్ధి ఎంతమేర సాధ్యం అన్నది ప్రశ్నార్థకమే అయినప్పటికీ.. జనం కోరుకుంటున్నది ఇదేనని నవాజ్ షరీఫ్ గ్రహించారు కాబట్టి ‘శాంతి’తో పాటు అభివృద్ధి మంత్రాన్ని కూడా అందుకున్నారు.

ఏడాదిగా మారిన పరిణామాలు

గత ఏడాది పాకిస్థాన్‌లో అతని సోదరుడు షెహబాజ్ షరీఫ్ అధికారం చేపట్టినప్పుడే నవాజ్ తిరిగి రావడం ఖాయమని పాక్ ప్రజలు భావించారు. అనుకున్నట్టే తిరిగొచ్చిన నవాజ్‌కు ఘనస్వాగతం లభించింది. నవాజ్‌కు అతని కుటుంబం లేదా పార్టీ స్వాగతం పలకడంలో ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు. కానీ పాకిస్తాన్ సైన్యం తనదైన రీతిలో ఆయనకు స్వాగత పుష్పాలను అందించడమే విశేషం. కేసుల కారణంగానే నవాజ్ షరీఫ్ తన పదవిని కోల్పోయారన్న విషయం తెలిసిందే. పాక్ సైన్యం ఆదేశానుసారం అక్కడి వ్యవస్థ షరీఫ్‌కు కేసుల నుంచి ఊరట, ఉపశమనాన్ని అందిస్తోంది. తోషాఖానా కేసులో నవాజ్ షరీఫ్‌కు బెయిల్ లభించింది. ఇది కాకుండా ఏడేళ్ల జైలు శిక్ష పడ్డ అల్ అజీజా కేసులో ఆయనకు విధించిన శిక్షను నిలిపివేయడం ద్వారా ఊరట కల్పించారు. కేసులు రద్దు చేయడం, శిక్షలను రద్దు చేయడం పాక్ సైన్యం అందించే బహుమతులుగా చెప్పుకోవచ్చు. అయితే అధికారం కోల్పోవడం, దేశం నుంచి వెళ్లిపోవడం, తిరిగి రావడం నవాజ్ షరీఫ్ జీవితంలో కొత్త కాదు. నవాజ్ షరీఫ్ జీవితంలో కొన్నేళ్లుగా దేశం వెలుపల ప్రవాసంలో ఉండడం ఇది రెండోసారి.

ముషారఫ్ అధికారం కోల్పోయిన తర్వాత..

2017కి ముందు, 1999లో కార్గిల్ యుద్ధం తర్వాత నవాజ్ షరీఫ్‌ ప్రభుత్వాన్ని జనరల్ పర్వేజ్ ముషారఫ్ కూలదోశారు. ఆ తర్వాత 2007 వరకు నవాజ్ షరీఫ్ పాకిస్తాన్ వెలుపల, కొన్నిసార్లు సౌదీ అరేబియాలో మరియు కొన్నిసార్లు లండన్‌లో ప్రవాస జీవితాన్ని గడిపారు. పర్వేజ్ ముషారఫ్ అధికారం కోల్పోయిన తర్వాత నవాజ్ 2007లో తన దేశానికి తిరిగొచ్చారు. ఇదొక్కటే కాదు, 2008 ఎన్నికలలో ఆయన పార్టీ తిరిగి అధికారంలోకి రానప్పటికీ, పాకిస్తాన్ రాజకీయాల్లో మరోసారి క్రియాశీలకంగా మారాడు. ఫలితంగా షరీఫ్ 2013 ఎన్నికల్లో గెలుపొందగలిగారు. 2013లో నవాజ్ షరీఫ్ పార్టీ పీఎంఎల్(ఎన్) గెలుపొందడంతో ఆయన మూడోసారి పాకిస్థాన్ ప్రధాని అయ్యారు. అంతకు ముందు 1990 నుండి 1993 వరకు ఒకసారి, 1997 నుండి 1999 వరకు రెండోసారి పాకిస్తాన్ ప్రధాన మంత్రిగా నవాజ్ షరీఫ్ పనిచేశారు.

పాకిస్తాన్ పొలిటికల్ ట్రెండ్ ఇలా..

పాక్ రాజకీయాల ట్రెండ్‌ను గమనిస్తే, అక్కడ ఏ ప్రధానమంత్రి కూడా ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేయలేదు. నవాజ్ కూడా ఐదేళ్ల పదవీకాలాన్ని ఎప్పటికీ పూర్తి చేయలేకపోయారు. 2013లో అధికారం చేపట్టిన కొద్దికాలానికే పాక్ సైన్యంతో అతని సంబంధాలు దెబ్బతిన్నాయి. ఫలితంగా పాకిస్తాన్ సైన్యం నవాజ్‌ను వదిలి ఇమ్రాన్‌కు మద్దతు ఇవ్వడం ప్రారంభించింది. దీంతో 2017లో ప్రధాని పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. 2017 జులైలో నవాజ్ షరీఫ్ ప్రధానమంత్రి పదవికి అనర్హుడు అంటూ పాకిస్థాన్ కోర్టు ప్రకటించింది. నవాజ్ షరీఫ్ అప్పట్లో ‘పనామా పేపర్ లీక్’ కేసులో నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో నవాజ్ షరీఫ్, ఆయన కూతురు మరియమ్‌లకు విదేశీ బ్యాంకు ఖాతాలున్నట్లు తేలింది. ఈ విదేశీ ఖాతాల్లో నల్లధనం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. నవాజ్ షరీఫ్‌ను అధికారం నుంచి తొలగించడం అప్పట్లో పాకిస్థాన్‌లో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది.

నవాజ్ షరీఫ్ ఎన్నికల్లో పోటీ చేయకుండా పాకిస్థాన్ కోర్టు నిషేధం విధించింది. దాంతో ఆయన 2018 ఎన్నికల్లో పోటీ చేయలేకపోయారు. ఇది పరోక్షంగా ఇమ్రాన్ ఖాన్‌కు మార్గాన్ని సుగమం చేసింది. ఆ తర్వాత అవినీతి కేసులో నవాజ్ షరీఫ్‌ను దోషిగా పరిగణించిన కోర్టు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అవినీతి సొమ్ముతో ఆయన లండన్‌లో ఓ ప్రాపర్టీ కొనుగోలు చేశారన్నది ఈ కేసు సారాంశం. 2018 ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ విజయం సాధించారు. ఇమ్రాన్ ఖాన్ అధికారంలోకి వచ్చిన వెంటనే, నవాజ్ షరీఫ్‌పై వేగంగా చర్యలు తీసుకున్నారు. మరో అవినీతి కేసులో నవాజ్ షరీఫ్‌కు ఏడేళ్ల జైలు శిక్ష పడింది. ఇది సౌదీ అరేబియాలోని ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించిన కేసు.

సైన్యం మద్దతు కోల్పోయిన తర్వాత..

పాక్ ఆర్మీ మద్దతుతో ఇమ్రాన్ ఖాన్ అధికారంలోకి వచ్చారు. సైన్యం మద్దతు కోల్పోయిన నవాజ్ షరీఫ్‌ను కేసులు వెంటాడాయి. ఆయనపై వరుసగా పలు కేసులు నమోదయ్యాయి. కొన్ని కేసుల్లో దోషిగా నిరూపితమై శిక్షలు పడ్డాయి. నవాజ్ షరీఫ్‌ను అరెస్టు చేసి జైలుకు పంపడమే ఇక తరువాయి అన్న స్థితిలో 2019 నవంబర్‌లో శిక్ష నుంచి తప్పించుకోవడం కోసం కోర్టులో ఓ పిటిషన్ వేశారు. తన అనారోగ్యాన్ని సాకుగా చూపారు. చికిత్స కోసం విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని అభ్యర్థించారు. కోర్టు నుంచి వచ్చిన అనుమతి ఆయనకు ఇమ్యూనిటీ పాస్‌లా మారింది. పాకిస్తాన్ నుంచి బయటపడ్డ ఆయన ఐదేళ్లుగా ప్రవాసంలో గడిపారు. లేదంటే జైలు జీవితం గడపాల్సి వచ్చేది. ఇప్పుడు ఇమ్రాన్ కంటే నవాజ్ షరీఫ్ బెటర్ అని పాక్ సైన్యం భావించడమే ఆయనకు వరంగా మారింది. మరి దాన్ని ఆయన సద్వినియోగం చేసుకుంటారా లేదా అన్నది కాలమే సమాధానం చెబుతుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి