United Nations: “తెలిసినవారి చేతుల్లోనే ప్రతి 10 నిమిషాలకు ఓ మహిళ బలవుతుంది..”

ప్రపంచవ్యాప్తంగా మహిళలపై హత్యలు ఆగడం లేదని ఐరాస తాజా నివేదిక హెచ్చరించింది. 2024లో ప్రతి పది నిమిషాలకు ఓ మహిళ లేదా బాలిక తనకు తెలిసిన వ్యక్తుల చేతిలో బలైనట్లు తెలిపింది. గతేడాది దాదాపు 50 వేల మంది మహిళలు... భర్తలు, భాగస్వాములు, తండ్రులు, అన్నలు లేదా ఇతర బంధువుల చేతిలోనే ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది.

United Nations: తెలిసినవారి చేతుల్లోనే ప్రతి 10 నిమిషాలకు ఓ మహిళ బలవుతుంది..
Femicides

Updated on: Nov 25, 2025 | 4:44 PM

ప్రపంచవ్యాప్తంగా మహిళలపై హింస ఆగే పరిస్థితులు కనిపించడం లేదని ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక తెలిపింది. 2024లో ప్రతి పది నిమిషాలకు ఓ మహిళ తనకు తెలిసిన, పరిచయం ఉన్న, బంధుత్వం కలిగిన వ్యక్తుల చేతిలో హత్యకు గురైనట్లు అధ్యయనం వెల్లడించింది. UNODC, UN Women సంయుక్తంగా విడుదల చేసిన ఈ రిపోర్ట్ ప్రకారం.. గతేడాది 50 వేల మహిళలు, బాలికలు… భర్తలు, ప్రేమికులు, తండ్రులు, అన్నలు, లేదా ఇతర బంధువుల చేతిలోనే ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా మహిళల హత్యల్లో సగానికి పైగా కుటుంబ సభ్యుల పాత్ర ఉండటం ఆందోళన కలిగిస్తోంది. పురుషుల విషయంలో ఈ శాతం చాలా తక్కువగా ఉండటం.. మహిళలు ఇంట్లోనే ఎక్కువ ప్రమాదంలో ఉన్నారనే వాస్తవాన్ని చూపిస్తోంది.

రోజుకు సగటున 137 మహిళలు ఈ విధంగా హత్యకు గురవుతున్నారని, ఈ సంఖ్యలో అసలు తగ్గుదల ఏమీ లేదని నివేదిక స్పష్టం చేసింది. కొన్ని దేశాల డేటా అందుబాటులో లేకపోవడం వల్లే సంఖ్య కొంత తేడాగా కనిపిస్తోందని పేర్కొంది. ప్రపంచంలో ఏ ప్రాంతమూ ఈ సమస్య నుంచి పూర్తిగా బయటపడలేదు. ఆఫ్రికా ఖండంలోనే అత్యధికంగా 22 వేల హత్యలు నమోదయ్యాయి. ఇంటి హింసతో పాటు ఆన్‌లైన్ వేధింపులు, వ్యక్తిగత వివరాల లీకులు, అనుమతి లేకుండా ఫొటోలు.. వీడియోలు షేర్ చేయడం, డీప్‌ఫేక్ వీడియోలు వంటి కొత్త రకాల దాడులు కూడా పెరుగుతున్నాయని అధ్యయనం తెలిపింది. మహిళలపై ఆన్‌లైన్, ఆఫ్లైన్ రెండు రంగాల్లోనూ జరుగుతున్న హింసను ముందుగానే గుర్తించి, కఠిన చట్టాలను అమలు చేస్తేనే ఫెమిసైడ్ ఘటనలను తగ్గించగలమని నివేదిక సూచించింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..